వెనుకబడిన దళిత కుటుంబం. కటిక పేదరికం. తోబుట్టువుల్లో ఐదో నంబర్ తనది. సౌకర్యవంతమైన ఇల్లులేదు, కడుపునిండా తినేందుకు లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులనూ ఎదుర్కొని నేడు వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడమేగాక, దళిత మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. మరోపక్క తన రచనలతో దళిత మహిళలను జాగృతపరుస్తున్నారు అనితా భారతి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఉదాహరణగానూ, పేదరికంలోనూ నిజాయితీగా కష్టపడితే పైకి ఎదగవచ్చని నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు అనిత.
అది 1965.. ఢిల్లీలోని సీలమ్‌పూర్‌లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది అనితా భారతి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అనితకేమో బాగా చదువుకోవాలని కోరిక. తామెలాగూ చదువుకోలేదు. కనీసం పిల్లలనైనా చదివించాలన్న ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. స్కూలుకు వెళ్లడానికి యూనిఫాం గానీ చెప్పులు గానీ లేవు సరికదా... రాసుకునేందుకు పుస్తకాలు కూడా ఉండేవికావు. అయినా అలాగే స్కూలుకు వెళ్లి తనకున్న ఒక నోట్ బుక్‌లోనే పెన్సిల్‌తో పాఠాలు రాసుకుని అది పూర్తయిన తరువాత ఎరేజర్‌తో తుడిపేసి మళ్లీ కొత్త పాఠాలను రాసుకునేది.
పాతబట్టలతో బ్యాగ్ కుట్టుకుని ఎంతో మప్పితంగా స్కూలుకు వెళ్లేది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూనే .. స్కూలు అయ్యాక ఇంటికొచ్చి ఎన్వలప్‌ల తయారీలో తల్లికి సాయపడేది. పనిపూర్తయ్యాక కొవ్వొత్తి వెలుతురులో చదివి తరగతిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేది. అయితే అనితా వీటన్నింటిని శ్రమపడి అధిగమించినప్పటికీ, చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల చేసే కుల దూషణలు తనని తీవ్రంగా బాధించేవి. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కులవివక్ష ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో సమాజం, జీవితం పట్ల అవగాహన ఏర్పడిన అనిత అలాంటి వాటిని పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టి, పన్నెండో తరగతి పూర్తిచేసింది.
అప్పులు... పోరాటాలు
ఇంటరీ్మడియట్ తరువాత అప్పులు చేసి కాలేజీ చదువులు పూర్తిచేసింది. తొలుత బీఏ హిందీ హానర్స్‌లో చేరింది. తరువాత బిఈడీ చేసింది. అయితే కుల వివక్షని అధిగమించడానికి కాలేజీ యూనియన్లలో చురుకుగా పాల్గొనేది. ఇందులో భాగంగా దళిత విద్యార్థులందరితో కలిసి ‘ముక్తి’ సంస్థను స్థాపించి దళిత విద్యార్థుల హక్కులను కాపాడడానికి ప్రయతి్నంచేది. అంతేగాక ఒక స్కూలును ఏర్పాటు చేసి మురికివాడల్లోని దాదాపు వందమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. మరోపక్క ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ పూర్తి చేసింది. 1992లో గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. దీంతో టీచర్‌గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేపట్టేది. అనిత మెరుగైన పనితీరుకు గుర్తింపుగా రాధా కృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇందిరా గాంధీ అవార్డు, ఢిల్లీ స్టేట్ టీచర్ అవార్డు, సావిత్రబాయి ఫూలే అవార్డు ఆమెను వరించాయి.
భర్తతో కలిసి...
ఉద్యోగం వచి్చన ఏడాదిలో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ప్రోత్సాహంతో ‘కదమ్’ దళిత సెంటర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దళిత మహిళల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక దళిత్ రైటర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ దళితులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అంతేగాక దళిత మహిళల సమస్యలపై పోరాడే థియేటర్ గ్రూపు ‘అలటిపు’లో కూడా భాగస్వామిగా మారి, ఈ గ్రూపులోని మహిళలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు.
దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేగాక వారి హక్కులపై అవగాహన కలి్పంచేందుకు 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయడం ప్రారభించింది. 2012లో హిందీలో ‘కాంటెంపరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్స్ రెసిస్టెన్స్’ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్–10 పుస్తకాలలో ఒకటిగా నిలవడం విశేషం. ఎక్కువమంది బుక్‌ను ఇష్టపడడంతో మరింత ఉత్సాహంతో పుస్తకాలు రాయడం, దళిత మహిళలు, బాలికలు, అమ్మాయిలపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రస్తుతం రూప్‌నగర్ నంబర్ వన్ స్కూల్‌కు వైస్ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తూ నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment