Minimum education
-
Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Best Teacher Jayanthi Narayanan: స్పెషల్ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్స్కూల్లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్ చిల్డ్రన్కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి. మైలాపూర్‌లో ‘ది క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్ చిల్డ్రన్. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్డౌన్లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను. వాళ్లు నన్ను చూడక ఇరిటేట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా గుర్తించింది. సహనమే శక్తి ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్లో ప్రతి సంవత్సరం రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు చేశాను. పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది. వీడియో పాఠాలు కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్డౌన్ సమయంలో స్పెషల్ చిల్డ్రన్కు ఆన్లైన్ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్టాప్ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి. ఎన్నో చేయాలి స్పెషల్ చిల్డ్రన్కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్రూమ్ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్ పిల్లలు చదువును ఎంజాయ్ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి. ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్ ప్రతి స్పెషల్ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం. -
‘వాళ్లకూ.. విద్యార్హత ఉండాలి’
సాక్షి, చండీగఢ్ : ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అక అడుగు ముందుకేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను నిర్ణయించాలంటూ.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. పంచాయితీ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసే వారికి విద్యార్హతను నిర్ణియించాలని కోరుతూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. పంచాయితీరాజ్ ప్రతినిధులకు కనీస విద్యార్హత లేకపోవడం వల్ల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన లేఖలే తెలిపారు. -
టెన్త్ పాసైతేనే సర్పంచ్ పదవికి పోటీకి అర్హులు
సాక్షి, అమరావతి: గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఇకమీదట పోటీ చేయాలనుకునేవారు కనీసం టెన్త్ పాసవ్వాల్సిందే. ఈ మేరకు కొత్త నిబంధన రానుంది. గ్రామసర్పంచులకు చెక్‌పవర్ ఉండడం, సర్పంచ్‌తోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లాపరిషత్ చైర్మన్ పదవులకు మహిళలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలు గెలిచిన పలుచోట్ల.. వారి స్థానంలో వేరొకరు పెత్తనం చెలాయించడం వంటి కారణాలతో ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత నిబంధన అమలుకు కేంద్రం ప్రతిపాదించింది. హర్యానా తదితర కొన్ని రాష్ట్రాల్లో కనీస విద్యార్హత ఉండడం వల్ల.. స్థానిక పాలన మెరుగ్గా ఉందని అధ్యయనం చేసిన లోక్‌సభ అంచనాల కమిటీ.. దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక అందజేసింది. దీనిపై కేంద్రం లేఖ రాసింది.దీని పట్ల సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు సర్కారు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి నివేదిక కోరింది. ఆ నివేదిక అమల్లోకి వస్తే వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత ఎప్పుడైనా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనే ఈ నిబంధన అమలుకు రానుంది.