సంక్షేమానికి వైకల్యం | chandrababu government is not working for the welfare of people with disabilities | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి వైకల్యం

Published Sat, Oct 15 2016 4:50 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

సంక్షేమానికి వైకల్యం - Sakshi

సంక్షేమానికి వైకల్యం

దివ్యాంగులకు చంద్రబాబు సర్కారు మొండిచేయి...
పింఛన్ కోసం నాలుగు లక్షలమంది ఎదురుచూపు
ధ్రువీకరణ ఉన్నా 2.5 లక్షల మందికి పింఛన్ లేదు
పరీక్షల కోసం మరో లక్షన్నరమంది పడిగాపులు
మెడికల్ క్యాంపులకు నిధులివ్వని రాష్ర్ట ప్రభుత్వం
సర్కారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వికలాంగులు
రెండున్నరేళ్లలో తగ్గిన వికలాంగ పింఛన్లు

సాక్షి, అమరావతి
అసలే వైకల్యం.. కాళ్లు, చేతులు సరిలేక, శరీరం సహకరించక.. ఒక చోట నుంచి మరో చోటకు కదలాలంటే నరకయాతన.. అలాంటి దివ్యాంగులు ప్రతిరోజూ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బాధనంతటినీ పంటిబిగువున భరిస్తున్నారు. వైకల్య సర్టిఫికెట్ కోసం అవసరమైన వైద్య పరీక్షల కోసం కొంత మంది.... సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇచ్చే నాథుడు కానరాక మరికొంతమంది... సర్కారు కార్యాలయాల బైట పడిగాపులు పడుతున్నారు. ఈ రెండు కేటగిరీల సంఖ్య చూస్తేనే నాలుగులక్షలు దాటిందంటే ఆశ్చర్యం కలగక మానదు. సర్కారు సరిగ్గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే ఇంకా ఎన్నో లక్షల మంది గురించి తెలిసే అవకాశం ఉంది. కానీ నిధులివ్వని కారణంగా మెడికల్ క్యాంపులే జరగడం లేదు. రెండున్నరేళ్లుగా రాష్ర్టంలో దివ్యాంగుల దీనావస్థ ఇది. వారి సంఖ్య ఎంత ఉన్నా పెన్షన్ పొందేవారి సంఖ్య మాత్రం పెరగడమే లేదు. పైగా తగ్గింది కూడా... అలాగే అన్నిరకాల పింఛన్లదీ అదే పరిస్థితి. పెరగాల్సిందిపోయి తగ్గాయి. రెండున్నరేళ్ల క్రితం 43 లక్షలున్న పింఛన్లు ఇపుడు 42 లక్షలకు తగ్గిపోయాయి.

రెండేళ్లుగా తిరుగుతున్న వికలాంగులు..
వికలాంగ పింఛను పొందాలంటే 40శాతానికి పైబడి అంగవైకల్యం ఉండాలనే నిబంధన ఉంది. రాష్ర్టంలోని 13 జిల్లాల్లో వైకల్య ధృవపత్రాల కోసం 11,39,829  మంది ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ క్యాంపులలో 9,83,977 మందికి వైద్య పరీక్షలు జరిగాయి. ఇంకా లక్షన్నరమందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం దరఖాస్తు చేసుకున్న 11.39 లక్షల మందిలో 7,71,281 మందికి 40 శాతం పైబడి అంగవైకల్యం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే వీరిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5,36,223 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తోంది. 40 శాతం పైగా అంగవైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందిన 2,35,058 మంది గత రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతూనే ఉన్నారు.

పరీక్షల కోసం 1.55 లక్షల మంది ఎదురుచూపు
అంగవైకల్య సర్టిఫికెట్ల జారీ చేయడానికి ఉద్దేశించిన మెడికల్ క్యాంపుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయడం లేదు. దాంతో లక్షలాదిమంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటే లేకుండా పోయింది. అంగవైకల్య సరిఫికెట్ల కోసం దరఖాస్తుచేసుకున్న వారిలో 9,83,977 మందికి మాత్రమే మెడికల్ క్యాంపుల ద్వారా ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇంకా 1.55 లక్షల మంది ఇప్పటికీ వైద్య పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో, ఎవరిని సంప్రదించాలో తెలియక అవస్థలు పడుతున్నారు.

ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్
పింఛన్ తీసుకుంటున్నవారు ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్ మంజూరు చేయాలనేది చంద్రబాబు గత తొమ్మిదేళ్ల హయాంలో అనుసరించిన పద్ధతి. ఇపుడు మరలా అదే పునరావృతమైనట్లు కనిపిస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వింతంతువులకు కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోతుండడంతో అధికారులు ప్రస్తుతం ఉన్న పింఛనుదారుల్లో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో కొత్త పించన్లు మంజూరు చేస్తున్నారు. అయితే వికలాంగుల పింఛన్లు అలా ఖాళీ ఏర్పడిన సందర్భంలోనూ గ్రామాల్లో ఉండే జన్మభూమి కమిటీల రాజకీయాలతో ఆయా ఫించన్లను కొత్తగా వికలాంగులకు కాకుండా వృద్ధులకో, వితంతువులకో మంజూరు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి.

తగ్గిన వికలాంగ పింఛన్లు
రాష్ర్టంలో రెండున్నరేళ్లలో వికలాంగుల పింఛన్ల సంఖ్య పెరగకపోగా తగ్గింది. అదెలాగ అనుకుంటున్నారా?  రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు 5.37లక్షల మంది వికలాంగులకు పింఛన్లు అందేవి. ప్రస్తుతం 5.36 లక్షల మంది వికలాంగులకు మాత్రమే ఫ్రభుత్వం నెలవారీ పింఛన్లు అందజేస్తోంది.అంటే వెయ్యికి పైగా వికలాంగ పింఛన్లు తగ్గిపోయాయన్నమాటేగా.. గత నెలలో.. అంటే సెప్టెంబర్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం 5.36 లక్షల మందికి మాత్రమే పింఛన్లు విడుదల చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement