రిమ్స్‌లో వికలాంగుల సర్టిఫికెట్ల మంజూరు
కడప అర్బన్:
జిల్లాలోని వికలాంగులు తమ వైకల్య ధ్రువీకరణ పత్రాలను తీసుకునే ప్రక్రియను రిమ్స్‌లో గురువారం ప్రారంభించారు. కడపలోని డీఆర్‌డీఏ కార్యాలయం సిబ్బంది రిమ్స్‌లో ఉదయం 9 గంటల నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గురువారం చాపాడు, వల్లూరు, సిద్ధవటం, రాజంపేట, ఓబులవారిపల్లె మండలాల నుంచి వికలాంగుల ధ్రువీకరణ పత్రాల మంజూరును కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిని రిమ్స్‌కు రావాలని ఆయా మండలాల అభివృద్ధి అధికారుల ద్వారా సూచనలు చేశారు. వీరిలో కొంతమంది వచ్చి ఆయా విభాగాల ద్వారా పరీక్షలు చేయించుకుని వెళ్లారు.
– పోటీపరీక్షలు, ఉద్యోగాల నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతను కల్పిస్తామని, వారు కూడా ఆయా మండల అభివృద్ధి అధికారి వద్ద కచ్చితంగా తమ పేరును నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
– కేటాయించిన తేదీల్లో (గురు, శుక్ర )వారాల్లో మాత్రమే ఉదయం 9 గంటలలోపు రిమ్స్ ఓపీ విభాగం వద్దకు చేరుకోవాలన్నారు. గతంలో లాగా ప్రతిరోజు కాకుండా, వారానికి రెండు రోజులు చొప్పున గురు, శుక్రవారాల్లో మాత్రమే ఈ సర్టిఫికెట్లను ఇవ్వనున్నారు.