handicapped student
-
దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక బోధన నైపుణ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విద్యా బోధన అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫస్ట్ ఇన్‌క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సకల సౌకర్యాలతో డిజిటల్ విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్డీటీ అనంతపురం) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన ‘ఫస్ట్ ఇన్‌క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలోని ఆరు జిల్లాల (అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప) నుంచి 300 మంది దివ్యాంగ, సాధారణ విద్యార్థులతో కలిపి విజువల్ కోడింగ్, ఆక్సిస్బల్ కోడింగ్, రోబోటిక్, వెబ్ డిజైన్, యానిమేషన్ గేమ్స్ డెవలప్మెంట్ వంటి 100 డిజిటల్ నైపుణ్యాల ప్రాజెక్టులను ప్రదర్శించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫె సర్ ఎం.రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్ దశరథ్, చక్షుమతి ఫౌండేషన్ ప్రతినిధి రామ్‌కమల్, సైబర్ స్క్వేర్ సీఈవో ఎన్.పి.హరిష్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏపీ ప్రతినిధి పాల్గొన్నారు. -
‘ప్రత్యేక అవసరాల’ పిల్లలకు ప్రవేశాలు ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. వైకల్యాన్ని సాకుగా చూపి తమ పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం లేదని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన తల్లిదండ్రుల నుంచి సమగ్ర శిక్ష, విద్యా శాఖ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు సమగ్ర శిక్ష ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలలు, అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలపై ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. దివ్యాంగ విద్యార్థులనూ సాధారణ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని, సమాన హక్కులు కల్పించాలని సమగ్ర శిక్ష ఉత్తర్వుల్లో ఉంది. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 93 వేల మంది దివ్యాంగ విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి చదివే వయసుగలవారున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో కొన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రవేశాలిచ్చేందుకు నిరాకరించడంతో సమగ్ర శిక్ష రాష్ట్రాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల ప్రయివేటు పాఠశాలలపై కూడా ఇదే తరహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖను సమగ్ర శిక్ష ఆదేశించింది. వారి ప్రవేశాలను అడ్డుకుంటే చర్యలు కొన్ని పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులందాయి. ఇలాంటి ప్రయివేటు పాఠశాలలపైన, ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ప్రధానోపాధ్యాయులపైనా విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో ఉన్న 93 వేల మంది దివ్యాంగ పిల్లల్లో పాఠశాల వయసువారే అధికం. ప్రభుత్వ స్థాయిలో 672 భవిత సెంటర్లలో సుమారు 900 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్‌ను నియమించి పిల్లలకు ప్రాథమిక స్థాయిలో సౌకర్యాలు కల్పించి ఎలిమెంటరీ విద్యనందిస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లోనూ 652 మంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ దివ్యాంగుల కోసం పనిచేస్తున్నారు. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ దివ్యాంగ విద్యార్థుల ప్రవేశాలకు మార్గదర్శకాలు ► ఆరు నుంచి 18 ఏళ్ల వయసు గల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై వివక్ష చూపకుండా తప్పనిసరిగా వయసు ప్రకారం ఆయా తరగతుల్లో ప్రవేశం కల్పించాలి. ► వైకల్యాన్ని సాకుగా చూపి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ► విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా వీరికి ప్రవేశాలు కల్పించొచ్చు. ► నూరు శాతం వైకల్యం గల పిల్లలకు హాజరు నుంచి మినహాయింపునివ్వాలి. -
గుడ్మాణింగ్ టీచర్
క్లాసులోకి రాగానే పిల్లలందరూ ఆమెకు ‘గుడ్మాణింగ్’ చెబుతారు. పిల్లలతో పాటు తొంభై ఏళ్లు దాటిన ఆమె వయసు కూడా ఆమెకు గుడ్మాణింగ్ చెబుతున్నట్లే ఉంటుంది. చేతికర్ర కూడా ఆమెను నడిపిస్తున్నట్లు ఉండదు. ఆమే చేతికర్రను నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ వయసులో లక్ష్మికి ఎక్కడిది ఆ శక్తి! ఆ చురుకుదనం!! లక్ష్మీ కల్యాణ సుందరం వయసు 91. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దేవుణ్ని ప్రార్థిస్తారావిడ. ఆ ప్రార్థనలో లక్ష్మి.. దేవుణ్ణి కోరే కోరిక ఎప్పుడూ ఒకేలా ఉంటుంది! తొంభై దాటిన వయసులో దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప, కోరుకోవడానికి ఇంకా ఏం మిగిలి ఉంటుందని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆమె గురించి పూర్తిగా తెలిస్తే ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఈ వయసులోనూ ఆమె ఎలా పని చేయగలుగుతున్నారు!.. అని. అవును, లక్ష్మి జాబ్ చేస్తున్నారు! బెంగళూరులోని ఒక మానసిక వికలాంగ విద్యార్థుల పాఠశాలలో ఆమె టీచర్. ఇరవై నాలుగేళ్లుగా ఆమె అక్కడి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మిగిలిపోయిన శక్తి భర్త చనిపోయినప్పుడు తన 67వ ఏట ఉద్యోగంలో చేరారు లక్ష్మి. విశ్రాంతి తీసుకోవలసిన వయసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు ఆమె. ‘‘ఎలా చెయ్యగలుగుతున్నారు మీరు?’’ అని అడిగినప్పుడు ఆమె చెప్పే సమాధానం కూడా కప్పు కాఫీలోని ఒక చప్పరింపు ఇచ్చే చురుకుదనాన్ని ఇస్తుంది! ‘‘నేనెప్పుడూ పని చేయలేదు. ఆ శక్తి అంతా నాలో అలాగే ఉండిపోయింది’’ అంటారు నవ్వుతూ. ‘నేనెప్పుడూ పని చేయలేదు’ అనే ఆ మాటలో.. ‘నాకెప్పుడూ పని చేసే అవకాశం రాలేదు’ అని చెప్పడమూ ఉంది! పద్నాల్గవ ఏట కల్యాణసుందరంతో వివాహం అయింది లక్ష్మికి. బయటికి వెళ్లాలని, రకరకాల మనుషుల్ని కలవాలని ఆమెకు ఉండేది. బాగా చదువుకున్నారు కానీ, బయటికి వెళ్లి చదువుకోలేదు. ఉద్యోగార్హతలు సంపాదించారు కానీ బయటికి వెళ్లి సంపాదించలేదు. డాక్టర్ అయి, అనారోగ్యాలను తొలగించాలని ఉండేది. అదీ అవలేదు. అప్పట్లో ఆడపిల్లను ఇల్లు దాటనిచ్చేవాళ్లే కాదు. చివరికి భర్తే పోతూ పోతూ తన జ్ఞాపకాల లోకం నుంచి బయటపడక తప్పని పరిస్థితిని ఆమెకు కల్పించి వెళ్లాడు. టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు లక్ష్మి. బయటికి అడుగేయాలి టీచర్‌గా చేస్తున్నప్పటికీ డాక్టర్‌గా చేయాలన్న తన కల సగం పూర్తయినట్లుగానే భావిస్తారు లక్ష్మి. డాక్టర్ అయి ఉంటే వైద్యసేవలు అందించేవారు. టీచర్‌గా ఇప్పుడు ‘స్పెషల్ చిల్డ్రన్’ మనసుల్ని వికసింపజేస్తున్నారు. తనకు ఎంతగానో సంతృప్తిని ఇస్తున్న బాధ్యత ఇది. తననే కాదు, స్వయంశక్తితో నిలబడడం కోసం ఇంటి నుంచి బయటికి వచ్చి పనిచేసే ఏ మహిళను చూసినా ఆమె మనసుకు తృప్తిగానే ఉంటుంది. తన ఇంట్లోనే ఒక పెద్ద మహిళావని ఉండటం కూడా ఆమెకు మరింతగా సంతృప్తినిచ్చే విషయం. లక్ష్మికి ముగ్గురు ఆడపిల్లలు. ఐదుగురు మనవరాళ్లు, ఇద్దరు మునిమనవరాళ్లు. చిన్న మునిమనవరాలు ప్రతి ఒక్కళ్లనీ కొట్టేస్తుంటుందని మురిపెంగా చెప్పుకుంటారు. ఇంత సంతృప్తికరమైన జీవితంలోనూ ఆమె ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు దేవుణ్ని ప్రార్థిస్తూ.. ‘దేవుడా.. రేపు ఉదయం నన్ను నిద్ర లేవనివ్వకు’ అని కోరుకుంటారు. ఉదయం లేవగానే తన కాఫీని తనే పెట్టుకుని తాగుతారు. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం తన పనుల్ని, తన ఉద్యోగాన్నీ తనకు తోడుగా ఉంచుకోదలచారు లక్ష్మీ కల్యాణసుందరం. -
చేతులు లేకున్నా..
రేగిడి : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల పరిధిలోని నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న రెండు చేతులు లేకపోయినప్పటికీ చదువులో తన ప్రతిభను చాటుకుంటోంది. ద్వితీ య సంవత్సరం ఇంటర్మీడియెట్‌లో 725 మార్కులు ఎంపీసీ గ్రూపులో సాధించిం ది. ఈమె రాజాం ఉమెన్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్నను వావిలవలస గ్రామానికి చెందిన సామాజిక వేత్త పాలూరి సిద్ధార్థ.. దాతల సహకారంతో చదివిస్తున్నారు. చదువుపై మమకారం ఉండడంతో ఇంటర్మీడియెట్‌లో మంచి మార్కులు సాధించడం పట్ల ఎంఈవో ప్రసాదరావుతోపాటు పాలూరి సిద్ధార్థ స్వప్నను అభినందించారు.