క్లాసులోకి రాగానే పిల్లలందరూ ఆమెకు ‘గుడ్మాణింగ్’ చెబుతారు. పిల్లలతో పాటు తొంభై ఏళ్లు దాటిన ఆమె వయసు కూడా ఆమెకు గుడ్మాణింగ్ చెబుతున్నట్లే ఉంటుంది. చేతికర్ర కూడా ఆమెను నడిపిస్తున్నట్లు ఉండదు. ఆమే చేతికర్రను నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ వయసులో లక్ష్మికి ఎక్కడిది ఆ శక్తి! ఆ చురుకుదనం!!
లక్ష్మీ కల్యాణ సుందరం వయసు 91. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దేవుణ్ని ప్రార్థిస్తారావిడ. ఆ ప్రార్థనలో లక్ష్మి.. దేవుణ్ణి కోరే కోరిక ఎప్పుడూ ఒకేలా ఉంటుంది! తొంభై దాటిన వయసులో దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప, కోరుకోవడానికి ఇంకా ఏం మిగిలి ఉంటుందని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆమె గురించి పూర్తిగా తెలిస్తే ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఈ వయసులోనూ ఆమె ఎలా పని చేయగలుగుతున్నారు!.. అని. అవును, లక్ష్మి జాబ్ చేస్తున్నారు! బెంగళూరులోని ఒక మానసిక వికలాంగ విద్యార్థుల పాఠశాలలో ఆమె టీచర్. ఇరవై నాలుగేళ్లుగా ఆమె అక్కడి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.
మిగిలిపోయిన శక్తి
భర్త చనిపోయినప్పుడు తన 67వ ఏట ఉద్యోగంలో చేరారు లక్ష్మి. విశ్రాంతి తీసుకోవలసిన వయసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు ఆమె. ‘‘ఎలా చెయ్యగలుగుతున్నారు మీరు?’’ అని అడిగినప్పుడు ఆమె చెప్పే సమాధానం కూడా కప్పు కాఫీలోని ఒక చప్పరింపు ఇచ్చే చురుకుదనాన్ని ఇస్తుంది! ‘‘నేనెప్పుడూ పని చేయలేదు. ఆ శక్తి అంతా నాలో అలాగే ఉండిపోయింది’’ అంటారు నవ్వుతూ. ‘నేనెప్పుడూ పని చేయలేదు’ అనే ఆ మాటలో.. ‘నాకెప్పుడూ పని చేసే అవకాశం రాలేదు’ అని చెప్పడమూ ఉంది! పద్నాల్గవ ఏట కల్యాణసుందరంతో వివాహం అయింది లక్ష్మికి.
బయటికి వెళ్లాలని, రకరకాల మనుషుల్ని కలవాలని ఆమెకు ఉండేది. బాగా చదువుకున్నారు కానీ, బయటికి వెళ్లి చదువుకోలేదు. ఉద్యోగార్హతలు సంపాదించారు కానీ బయటికి వెళ్లి సంపాదించలేదు. డాక్టర్ అయి, అనారోగ్యాలను తొలగించాలని ఉండేది. అదీ అవలేదు. అప్పట్లో ఆడపిల్లను ఇల్లు దాటనిచ్చేవాళ్లే కాదు. చివరికి భర్తే పోతూ పోతూ తన జ్ఞాపకాల లోకం నుంచి బయటపడక తప్పని పరిస్థితిని ఆమెకు కల్పించి వెళ్లాడు. టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు లక్ష్మి.
బయటికి అడుగేయాలి
టీచర్‌గా చేస్తున్నప్పటికీ డాక్టర్‌గా చేయాలన్న తన కల సగం పూర్తయినట్లుగానే భావిస్తారు లక్ష్మి. డాక్టర్ అయి ఉంటే వైద్యసేవలు అందించేవారు. టీచర్‌గా ఇప్పుడు ‘స్పెషల్ చిల్డ్రన్’ మనసుల్ని వికసింపజేస్తున్నారు. తనకు ఎంతగానో సంతృప్తిని ఇస్తున్న బాధ్యత ఇది. తననే కాదు, స్వయంశక్తితో నిలబడడం కోసం ఇంటి నుంచి బయటికి వచ్చి పనిచేసే ఏ మహిళను చూసినా ఆమె మనసుకు తృప్తిగానే ఉంటుంది. తన ఇంట్లోనే ఒక పెద్ద మహిళావని ఉండటం కూడా ఆమెకు మరింతగా సంతృప్తినిచ్చే విషయం.
లక్ష్మికి ముగ్గురు ఆడపిల్లలు. ఐదుగురు మనవరాళ్లు, ఇద్దరు మునిమనవరాళ్లు. చిన్న మునిమనవరాలు ప్రతి ఒక్కళ్లనీ కొట్టేస్తుంటుందని మురిపెంగా చెప్పుకుంటారు. ఇంత సంతృప్తికరమైన జీవితంలోనూ ఆమె ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు దేవుణ్ని ప్రార్థిస్తూ.. ‘దేవుడా.. రేపు ఉదయం నన్ను నిద్ర లేవనివ్వకు’ అని కోరుకుంటారు. ఉదయం లేవగానే తన కాఫీని తనే పెట్టుకుని తాగుతారు. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం తన పనుల్ని, తన ఉద్యోగాన్నీ తనకు తోడుగా ఉంచుకోదలచారు లక్ష్మీ కల్యాణసుందరం.
Comments
Please login to add a commentAdd a comment