ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా విపత్తు అనంతరం విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు మరింత క్షీణించి ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వెనుకబడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేసింది. ఈ దిశగా సబ్జెక్టు నిపుణులు, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రతినిధులు విజయకేతనం పేరుతో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు.
40 రోజులపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు కనీసం 50 శాతం మార్కులు సాధించేలా కార్యాచరణ రూపొందించారు.
ఏప్రిల్‌లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా విజయకేతనం కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయడానికి డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సంసిద్ధులయ్యారు. ఈనెల 20వ తేదీ నుంచి వచ్చేనెల 31 వరకు అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు విద్యార్థులను ఆశావహ దృక్పథంతో పరీక్షలకు సమాయత్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 487 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 37,066 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాగే సుమారు 270 ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 14,800 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ విజయకేతనం కార్యాచరణ అమలు చేయాలని అధికారులు సూచించారు.
విజయకేతనంలో ప్రధాన అంశాలు
► 30 నుంచి 40 శాతం మంది విద్యార్థులు ఒక సబ్జెక్టులో 50 నుంచి 100 ప్రశ్నలు మాత్రమే చదవగలుగుతున్నారు. వారికి తక్కువ పనిభారాన్ని ఇవ్వడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేలా చేయడం.
► వీరితో రోజుకు రెండు ప్రశ్నలు, 10 బిట్లు చదివిసా్తరు. టఏ రోజు ఏ ప్రశ్న చదవాలి అన్నది తేదీ వారీగా కార్యాచరణ రూపొందించారు. ఏ రోజు అభ్యసన అదే రోజు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.
► విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలి.
► ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా స్వచ్ఛందంగా పాఠశాలకు వచ్చి టైమ్ టేబుల్ అమలు చేసేలా హెచ్‌ఎంలు చూడాలి.
► ఉపాధ్యాయుల్లో ఒత్తిడి భావం కలగకుండా ప్రేరణ కలిగించాలి.
► ప్రశ్నలను అప్పజెప్పించుకోవడంతో పాటు విద్యార్థులతో చూడకుండా రాయించాలి.
► ప్రత్యేకంతో ప్రతి సబ్జెక్టులో విజయకేతనం పేరుతో పుస్తకాలు పెట్టించాలి.
► తరగతి గదిలో విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే బాగా చదివే విద్యార్థులను లీడర్స్‌గా నియమించుకుని వెనుకబడిన విద్యార్థుల బాధ్యతలను (అప్పజెప్పించుకోవడం, రాయించడం) అప్పగించాలి.
► వచ్చేనెలలో ఎఫ్‌ఏ 4 పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఆ సిలబస్‌ను కార్యాచరణ ప్రణాళికలో ముందుగా ఇచ్చారు.
► అలాగే ఎఫ్‌ఏ 4 పరీక్షలతో పాటు ప్రీ పబ్లిక్ పరీక్షల తేదీల్లో వీలును బట్టి కార్యాచరణను మార్చుకున్నా వచ్చేనెల 31 నాటికి 40 రోజుల కార్యాచరణను విధిగా పూర్తిచేయాలి.
► సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు ఇద్దరు ఒక్కో డివిజన్‌ను దత్తత తీసుకొని కార్యాచరణ అమలు తీరును పరిశీలించాలి.
విజయకేతనం ఫలితం 'పది'లం
Published Sun, Feb 26 2023 5:02 AM | Last Updated on Sun, Feb 26 2023 9:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment