7 వేల టీచర్ పోస్టులకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న పోస్టులకూ ప్రభుత్వం ఎసరు పెడుతోంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) ఫలితాలు విడుదలై నెలలు దాటుతున్నా నియామకాలు చేపట్టని ప్రభుత్వం.. అంతకుముందే రేషనలైజేషన్ పేరిట ఏడువేలకుపైగా సెకండరీగ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు కోత పెట్టబోతోంది. జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తిచేశారు.
రేషనలైజేషన్‌లో భాగంగా..
పాఠశాలల రేషనలైజేషన్లో భాగంగా కిలోమీటర్ పరిధిలో 30 మందికన్నా తక్కువమంది ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. అలా దాదాపు 3,500కుపైగా పాఠశాలల్ని ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని భావించారు. రాజకీయ నేతలనుంచి అభ్యంతరాలొచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలు, రైల్వేట్రాక్‌లు, వాగులు, నదులు దాటి వెళ్లాల్సినచోట మినహాయిస్తున్నారు. అయినప్పటికీ మూతపడే స్కూళ్ల సంఖ్య 2 వేలకుపైగానే. ఫలితంగా పలు విలీన స్కూళ్లల్లోని టీచర్ పోస్టులు మిగులు పోస్టులుగా మారుతున్నాయి.
ఆ మేరకు ప్రతి జిల్లాలో వందలాది ఎస్జీటీపోస్టులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. ఉదాహరణకు రాష్ట్రంలో అతిచిన్న జిల్లా అయిన విజయనగరం జిల్లాలో 441 ఎస్జీటీ పోస్టులు మిగులు ఉన్నట్లుగా చూపించారు. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో 877 పోస్టులు, కృష్ణా జిల్లాలో 720 పోస్టులు, కర్నూలులో 234.. ఇలా ప్రతి జిల్లాలో సగటున 500 వరకు ఎస్జీటీ పోస్టులు అదనంగా ఉన్నట్లు లెక్కగట్టారు. ఈ పోస్టులన్నిటికీ కోతపెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 7వేలకుపైగా టీచర్‌పోస్టులు రద్దు కానున్నాయి.
కోత పెరిగే చాన్స్..
ఏడు వేల టీచర్ పోస్టుల లెక్క కేవలం పంచాయతీరాజ్ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ప్రైమరీ తరగతుల వరకు మాత్ర మే.మున్ముందు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోని పోస్టుల్నీ రేషనలైజేషన్ చేస్తే కోత పెరగనుంది. మున్సిపల్, ప్రభుత్వ ఎయిడెడ్, విభాగాల స్కూళ్లూ కలిపితే ఒక్క విద్యాశాఖలోనే 10 వేలకుపైగా పోస్టులు మిగులు జాబితాలో చేరిపోనున్నాయి.
ఉపాధ్యాయ సంఘాల ఆందోళన..
తాజా వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. మిగులు పోస్టుల్లో ఉన్న టీచర్లను ఇతర శాఖల్లోకి మళ్లించే ప్రమాదముందని భయపడుతున్నాయి. పంచాయతీరాజ్‌శాఖ పరిధి స్కూళ్లలోని అదనపు టీచర్లను పంచాయతీ కార్యదర్శులుగా నియమించే యోచనుందని, దీనిపై నివేదిక సమర్పించాలని ఆ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికారుల్ని ఆదేశించడం గమనార్హం. ఈ పరిణామాలు అందరిలో కలకలం రేపుతున్నాయి.