సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీని కోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో త్వరితంగా నోటిఫికేషన్ల విడుదలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రాథమికంగా 12 వేల నుంచి 15 వేల వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యాశాఖలోని దాదాపు 18 వేల మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో 10 వేల మందికి పైగా పై స్థానాలకు వెళ్లడంతో కింది పోస్టులు ఖాళీ అయ్యాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లోకి కూడా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుత డీఎస్సీలో ఈ ఖాళీలు కూడా చేరనున్నాయి. పోస్టుల వారీగా ఖాళీల సమగ్ర సమాచారాన్ని ఆయా జిల్లాల నుంచి రప్పించేందుకు అధికారులకు ఆదేశాలు పంపనున్నామని అధికారులు తెలిపారు. అలాగే, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఆ శాఖ నుంచి తెప్పిస్తున్నారు.
జనవరి మొదటి వారంలో టెట్..ఆఖర్లో డీఎస్సీ నోటిఫికేషన్
టీచర్ పోస్టుల భర్తీకి ముందుగా టీచర్ అర్హత పరీక్షను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో టీచర్ అర్హత పరీక్ష (టెట్)ను, టీచర్ నియామక పరీక్ష (టీఆర్టీ)ని కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించారు. అయితే, ఈసారి రెండింటినీ కలపకుండా వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం.. టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించాలి. 2018లో టెట్‌ను ఒకసారి నిర్వహించారు. ఈ ఏడాదిలో ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర కారణాలవల్ల దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఏటా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టెట్, డీఎస్సీల నిర్వహణకు అడుగులు వేస్తున్నారు. డీఎస్సీ కన్నా ముందుగా టెట్ నోటిఫికేషన్‌ను జనవరి మొదటి వారంలో ఆ తరువాత నెలాఖరున డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి.
ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరి
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు వచ్చే ఏడాది నుంచి, ఆ తరువాతి ఏళ్లలో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండేలా టెట్, డీఎస్సీలలో సంబంధిత అంశాలపై ప్రశ్నలు పొందుపర్చనున్నారు. టెట్ పేపర్–1, 2 రెండింటిలోనూ ఇంగ్లీషు ప్రావీణ్యంపై ప్రశ్నలున్నాయి. పేపర్–2ఏలో భాషాంశాలు, కమ్యూనికేషన్ ఇతర సమగ్ర నైపుణ్యాలు పరీక్షిస్తున్నారు. కాగా, డీఎస్సీ–2018లో కొన్ని ప్రత్యేక పోస్టులకు ఆంగ్ల నైపుణ్యాలపై ఒక పేపర్‌గా పెట్టారు. ఈసారి ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ఎంపికయ్యే టీచర్లలో ఆంగ్ల నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక పేపర్ పెట్టనున్నారు. అలాగే, టెట్‌లో ఇప్పుడు అడుగుతున్న అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చనున్నారు. డీఎస్సీలో అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రత్యేక పేపర్ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
అభ్యర్థుల ఎదురుచూపు
గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తిచేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో నిర్వహించిన టెట్‌లలో అర్హత సాధించలేని వేలాది మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్‌పై దృష్టిసారించారు. డీఎడ్ అభ్యర్థులు రెండు బ్యాచ్‌లు కలిపి 80వేల మంది, బీఎడ్ అభ్యర్థులు 30వేల మందితో పాటు గతంలోని అభ్యర్థులూ వేలల్లోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment