♦ 25 వేల ఉద్యోగాల్లో ఉపాధ్యాయ పోస్టులు లేనట్టే...
♦ క్రమబద్ధీకరణ తరువాతే లెక్చరర్ ఖాళీల భర్తీ
♦ గత డీఎస్సీ బాధితుల కోసం న్యాయసలహా తీసుకోనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం త్వరలో ప్రకటించి, నోటిఫికేషన్లు జారీచేయనున్న పోస్టుల్లో ఉపాధ్యాయ పోస్టులు లేనట్టే తెలుస్తోంది. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పూర్తయిన వెంటనే ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు డీఎస్సీ ప్రకటించే పరిస్థితి కన్పించడం లేదు.
త్వరలో నోటిఫికేషన్లు జారీచేసే 25 వేల పోస్టుల్లో ఉపాధ్యాయపోస్టుల భర్తీ ఉండకపోవచ్చని ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉందని తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇదే విషయాన్ని చెప్పారు. వాస్తవంగా ప్రస్తుతం రాష్ట్రంలో 17 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. రేషనలైజేషన్ ద్వారా నాలుగైదు వేల పోస్టులు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తే మిగిలిన వాటిల్లోనూ చాలా వరకు పోస్టులు తగ్గిపోనున్నాయి.
ఈ నేపథ్యంలో అన్నింటిపై స్పష్టత వచ్చాకే డీఎస్సీ విషయాన్ని ఆలోచిద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గత డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం ఎలా చేయాలన్న విషయం పరిశీలిస్తున్నారు. 1998 నుంచి మొదలుకొని 2012 డీఎస్సీలలో అభ్యర్థులకు సంబంధించి కోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని డీఎస్సీల్లో కలిపి దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు అన్నింటిపై న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకొని ముందుకు సాగాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధ్దీకరణ...
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 4 వేల మందికిపైగా కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎంతమంది కాంట్రాక్టు లెక్చరర్లు క్రమబద్ధీరణ పరిధిలోకి వస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 5 ఏళ్ల సర్వీసు ఉండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ , రోస్టర్ ప్రకారం నియమితులైన వారినే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం క్రమబద్ధీకరణ నిబంధనలను పొందుపరిచినట్లు సమాచారం.
దాని ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్లలో చాలా మందికి అవకాశం రావడం కష్టమేనని డిగ్రీ కాలేజీ వర్గాలు పేర్కొంటున్నాయి. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో నియమితులైన అనేక మంది లెక్చరర్లు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియమితులు కాలేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా తక్కువ మందికే రెగ్యులరైజేషన్ అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నాయి. వీరి క్రమబద్ధీకరణ తరువాతే లెక్చరర్ పోస్టుల ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టిపెట్టనుంది.
.. ఆ తరువాతే డీఎస్సీ!
Published Thu, Jun 11 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement