వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్‌లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
భారత్‌లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్‌లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలు
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.
పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?
మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment