
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు (వంట నూనెలు, వంటకు వినియోగించనివి) ఆగస్ట్ నెలలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 33 శాతం పెరిగి 18.66 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. సుంకాలు తగ్గడం, డిమాండ్ పుంజుకోవడం దిగుమతులు గణనీయంగా పెరగడానికి దారితీసినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షర్స్ అసోసియేషన్ (ఎస్‌ఈఏ) తెలిపింది. 2022 ఆగస్ట్ నెలలో వెజిటబుల్ నూనెల దిగుమతులు 14 లక్షల టన్నులుగా ఉన్నాయి. (ఎస్‌బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!)
2022-23 మొదటి పది నెలల్లో (నూనెల సీజన్ నవంబర్-అక్టోబర్) నూనెల దిగుమతులు 24 శాతం పెరిగి 141.21 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 113.76 లక్షల టన్నులుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్ నెలలో దిగుమతులను పరిశీలిస్తే.. 18.52 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, నాన్ ఎడిబుల్ నూనెలు 14,008 టన్నులుగా ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు 11.28 లక్షల టన్నులు ఉండడం గమనించొచ్చు.
‘‘మొదటి పది నెలల్లో 141 లక్షల టన్నుల దిగుమతులను పరిశీలిస్తే.. అక్టోబర్‌తో ముగిసే నూనెల సంవత్సరంలో మొత్తం దిగుమతులు 160–165 లక్షల టన్నులకు చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు’’అని ఎస్‌ఈఏ పేర్కొంది.దేశీయంగా నూనెల లభ్యత తగినంత ఉందని, అయినప్పటికీ ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగినట్టు ఎస్‌ఈఏ తెలిపింది. 2016-17 నూనెల సంవత్సరంలో భారత్ అత్యధికంగా 151 లక్షల టన్నుల వెజిటబుల్ నూనెలను దిగుమతి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment