anti-dumping duty
-
చైనా ఉక్కు దిగుమతులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు పరిశ్రమను ఆదుకోవడంలో భాగంగా పలు రకాల చైనా దిగుమతులపై ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. టన్ను ఉక్కుపై 185.51 డాలర్లు (రూ.13,622) చొప్పున డ్యూటీని విధిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ శాఖ, ఐదేళ్ల వరకు ఈ సుంకం కొనసాగుతుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు చైనా భారత్‌లో ఉక్కును విక్రయిస్తుందని ఆరోపిస్తూ.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, ఉషా మార్టిన్, గెర్డావ్ స్టీల్ ఇండియా, వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, జైస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు సంయుక్తంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్)కు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాయ్ బార్స్, స్ట్రయిట్ లెంత్ రాడ్స్ వంటి పలు ఉత్పత్తులపై టన్నుకు 44.89 నుంచి 185.51 డాలర్ల శ్రేణిలో యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 56,690 టన్నులుగా ఉన్నటువంటి వీటి దిగుమతులు.. 2016–17 నాటికి 1,80,959 టన్నులకు పెరిగాయి. మొత్తం ఉక్కు దిగుమతులు 1,32,933 టన్నుల నుంచి 2,56,004 టన్నులకు పెరిగిపోయాయి. ఇదే సమయంలో డిమాండ్ కూడా పెరిగింది. -
చైనా ఉక్కు దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం!
న్యూఢిల్లీ: చైనా నుంచి చౌక ధరల్లో వెల్లువెత్తుతున్న కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులపై ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించే అవకాశాలున్నాయి. వాహన, నిర్మాణ రంగంలో ఉపయోగపడే కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులు చైనా నుంచి వెల్లువెత్తుతున్న విషయమై ఇటీవలనే ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. చైనా నుంచి ఈ తరహా ఉక్కు ఉత్పత్తులు భారీగా భారత్‌లోకి వస్తున్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని సెయిల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్, ఉషా మార్టిన్ కంపెనీలు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ-డంపింగ్ అండ్ అల్లైడ్ డ్యూటీస్(డీజీఏడీ)కి దరఖాస్తు చేశాయి. చైనా నుంచి ఈ దిగుమతులు డంప్ అవుతున్నాయనడానికి డీజీఏడీకి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. ఈ డంపింగ్‌తో దేశీయ ఉక్కు పరిశ్రమకు వాటిల్లే నష్టాల గురించి పరిశోధనను కూడా డీజీఏడీ జరుపుతోంది. గతంలో జరిగిన డంపింగ్‌కు కూడా సుంకాలు విధించాలని కంపెనీలు కోరుతున్నాయి. చైనాతో సహా పలు దేశాల నుంచి వెల్లువెత్తే పలు చౌక ఉత్పత్తులపై భారత్ ఇప్పటికే యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది.