చైనా ఉక్కు దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం!
న్యూఢిల్లీ: చైనా నుంచి చౌక ధరల్లో వెల్లువెత్తుతున్న కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులపై ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించే అవకాశాలున్నాయి. వాహన, నిర్మాణ రంగంలో ఉపయోగపడే కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులు చైనా నుంచి వెల్లువెత్తుతున్న విషయమై ఇటీవలనే ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. చైనా నుంచి ఈ తరహా ఉక్కు ఉత్పత్తులు భారీగా భారత్‌లోకి వస్తున్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని సెయిల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్, ఉషా మార్టిన్ కంపెనీలు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ-డంపింగ్ అండ్ అల్లైడ్ డ్యూటీస్(డీజీఏడీ)కి దరఖాస్తు చేశాయి.
చైనా నుంచి ఈ దిగుమతులు డంప్ అవుతున్నాయనడానికి డీజీఏడీకి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. ఈ డంపింగ్‌తో దేశీయ ఉక్కు పరిశ్రమకు వాటిల్లే నష్టాల గురించి పరిశోధనను కూడా డీజీఏడీ జరుపుతోంది. గతంలో జరిగిన డంపింగ్‌కు కూడా సుంకాలు విధించాలని కంపెనీలు కోరుతున్నాయి. చైనాతో సహా పలు దేశాల నుంచి వెల్లువెత్తే పలు చౌక ఉత్పత్తులపై భారత్ ఇప్పటికే యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది.