హడావుడి నిర్ణయం ఎందుకు?
రక్షణ, రైల్వేల్లో ఎఫ్‌డీఐపై నిలదీసిన విపక్షాలు
రాజ్యసభలో చేతులు కలిపిన తృణమూల్, లెఫ్ట్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), వామపక్షాలు చేతులు కలిపాయి. ఇందుకు రాజ్యసభ వేదికైంది. రైల్వేల్లో వంద శాతం, రక్షణ రంగంలో 49 శాతం మేరకు ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ఉభయ పక్షాలు గురువారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనిని హడావుడి నిర్ణయంగా ఆరోపించాయి. దేశప్రయోజనాలకు ఈ నిర్ణయం విఘాతం కలిగిస్తుందని హెచ్చరించాయి. సభ గురువారం సమావేశమవగానే టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రెయిన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి దీనిపై తక్షణం చర్చించాలని పట్టుపట్టారు. అయితే ఈ అంశాన్ని తరువాత చేపడదామని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పారు. ఇదే సమయంలో సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి తమ వైరిపక్షమైన టీఎంసీ సభ్యునికి బాసటగా నిలిచారు.
ఈ నేపథ్యంలో ఓబ్రెయిన్ మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన అంశమని, సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ జరపనున్న అమెరికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. ఎఫ్‌డీఐ విషయంలో యూపీఏ సర్కారు 4వ గేరులో వెళితే.. ప్రస్తుత ప్రభుత్వం ఐదవ గేరులో దూసుకుపోతోందని విమర్శించారు. అన్ని సమస్యలకు ఎఫ్‌డీఐ ఒక్కటే పరిష్కారం కాదన్నారు. బీమా, రక్షణ, రైల్వేస్‌లోకి ఎఫ్‌డీఐని అనుమతించవద్దు... దేశాన్ని విక్రయించవద్దని కోరారు. రైల్వేలకు చెందిన ఆపరేషన్స్ విభాగంలోకి ఎఫ్‌డీఐని అనుమతించేది లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, రైల్వే మంత్రి పి.సదానందగౌడ గురువారం పార్లమెంటు వెలుపల మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. కేవలం మౌలిక సదుపాయాలు, ఇతరత్రా విభాగాల్లోకి మాత్రమే ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నట్టు విశదీకరించారు.