27న మమత ప్రమాణం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా మమతా బెనర్జీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మమత పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పార్థ ఛటర్జీ ప్రతిపాదించగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమర్ధించారు. అనంతరం ఆమె గవర్నర్ త్రిపాఠిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మే 20 చాలా ప్రాముఖ్యమైందని, 2011న ఇదే రోజు తృణమూల్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిందని ఆమె విలేకర్లతో చెప్పారు. ఈ నెల 27న సీఎంగా మమత ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తృణమూల్ విజయానికి పంచమంత్రం
కోల్‌కతా: బెంగాల్లో తృణమూల్‌కు అఖండ విజయం సులువుగా దక్కలేదు. 2011లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి మమతా బెనర్జీ బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేందుకు శ్రమించారు. కేంద్రంతో పోట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా సంక్షేమాన్ని మరవలేదు. కులసమీకరణాల్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు.
1. అభివృద్ధి.. గత ఐదేళ్లలో బెంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగింది.ఉపాధి హామీ పథకంలో పూర్తి స్థాయిలో అమలైంది. బెంగాల్లో గ్రామీణ ప్రజలు ఈ పథకంలో ఎక్కువ లబ్ది పొందారు. ఈ పథకంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ గత నాలుగేళ్లుగా దేశంలో మొదటి స్థానాల్లో నిలిచింది.గత నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన రాష్ట్రాల్లో బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. చిన్న గ్రామాలు సైతం తారురోడ్లతో మెరిసిపోయాయి. విద్యపై కూడా మమత అధికంగా దృష్టిపెట్టారు. సబుజ్ సతి పథకంలో 9 నుంచి 12 తరగ తి విద్యార్థినులకు సైకిళ్లు అందచేశారు. ఆర్థికంగా వెనబడ్డ అమ్మాయిలకు కన్యశ్రీ పథకంలో ఏడాదికి రూ. 750 నుంచి రూ.25 వేల వరకూ ఉపకార వేతనాలు అందచేశారు.
2. సామాజిక సమీకరణాలు.. ఈ సారి బెంగాల్లో కుల సమీకరణాలకు మమత తెరలేపారు. అతిపెద్ద దళిత కులం మతువాతో పాటు నమశుద్రలు, బెంగాల్ ముస్లింల మద్దతును మమత అభ్యర్థించారు. సీపీఎం ఓటు బ్యాంకైన గ్రామీణ బెంగాలీ ముస్లింల్ని మమత తనవైపుకు తిప్పుకున్నారు.
3. లెఫ్ట్ భావజాలం (పేదల పక్షపాతి)
లెఫ్ట్ పార్టీలు అనుసరించిన పేదల సంక్షేమ మంత్రాన్నే మమత అనుసరించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి లెఫ్ట్‌ను మట్టికరిపించి మమత అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్నే అనుసరించారు. 2012లో ప్రత్యేక ఆర్థిక మండలి పాలసీని రద్దు చేశారు.
4. సంక్షేమం ఖర్చు మూడింతలు పెంపు
మమత అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేశాయి. అప్పులు తగ్గి రాష్ట్రం ఆర్థికంగా మెరుగుపడింది. దీంతో పేదల కోసం మమత మరింత ఖర్చుపెట్టారు. సంక్షేమ ఖర్చును మూడింతలు పెంచారు. సీపీఎంకు పట్టున్న పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించారు.
5. నామమాత్రంగా కూటమి ప్రభావం
సీపీఎం, కాంగ్రెస్‌ల్లో హైకమాండ్ సంస్కృతి ఆ కూటమిని దారుణంగా దెబ్బతీసింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేని నేతలు కూడా నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభావాన్ని నామమాత్రం చేసింది. దీంతో ఓటర్లను ఈ కూటమి ప్రభావితం చేయలేకపోయింది.