రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 49%కి పెంపు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. మిలిటరీ హార్డ్‌వేర్ అవసరాల్లో 70 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ఈ చర్య ఉద్దేశం. భారతీయుల యాజమాన్యం, అజమాయిషీలోని భారతీయ కంపెనీలు మాత్రమే 49 శాతంలోపు ఎఫ్‌డీఐకి అనుమతి కోరాలని కేంద్రం నిబంధన విధించింది.
అంతకుమించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు రక్షణపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ అనుమతి పొందాల్సి ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందుబాటులోకి తెచ్చే ఇలాంటి ప్రతిపాదనలను కేసుల వారీగా కమిటీ పరిశీలిస్తుందని పారిశ్రామిక విధానం, అభివృద్ధి విభాగం (డీఐపీపీ) ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా పెంచిన ఎఫ్‌డీఐ పరిమితిలో ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌పీఐలు, ఎన్నారైలు, ఫారిన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులన్నీ కలిసే ఉంటాయి.