అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్‌గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదు గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందే
ఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్.. స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాద్‌లో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరా
ఒసేయ్ గీతా.. నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి కొత్త అట్టలు వేసుకుని వాడుకో
మొన్న దసరాకే లాగు చొక్కా కొన్నాను.. మళ్ళీ సంక్రాంతికి కొనాలంటే ఎలా..మళ్ళీ వచ్చే సారి చూద్దాంలే
చుట్టాలొచ్చారు.. పప్పు.. గుడ్డు వండి అప్పడాలు వేయించాలి
ఒరేయ్ చింటూ సైకిల్ బాగా కడిగి..తుడిస్తే నీకు సాయంత్రం ఓ అరగంట తొక్కనిస్తా
ఢిల్లీ వెళ్ళాలంటే మాటలా రైల్లో మూడురోజులు పడుతుంది మరి
ఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టాండర్ర
ఈసారి పెళ్లి బంతిలో మొదట వేసే లడ్డూను జేబులో దాచేసి ఇంకో లడ్డూ అడగాలి
పెళ్లవ్వగానే ఆయన వెళ్ళిపోయారు. లెటర్స్ వస్తున్నాయి కానీ ఆయన్ను చూస్తే బావుణ్ణు.. ఉత్తరాల్లో మనిషి కనిపిస్తే ఎంత బావుణ్ణు
అసలు ఈ పట్ట పగలు ఫుల్ చార్జి పే చేసి ఫోన్ ఎందుకు చేయాలి..రాత్రి పది తరువాత ఐతే హాఫ్ చార్జి ఉండేదిగా
ఒరేయ్ నాగులూ నాన్న ప్యాంట్ కాస్త సైజ్ చేసి వాడుకోరా నీకు సరిపోతుంది
అమెరికాలో జేబులో పెట్టుకునే ఫోన్లు ఉన్నాయట తెలుసా?
ఎన్నైనా చెప్పు..రాజ్ దూత్ అంబాసిడర్..ఈ రెండూ భూమి ఉన్నంత వరకూ ఉంటాయ్
బ్యాంకులో ఖాతా ఉండడం అంటే మాటలా.. అమ్మో ఆయనకు ఎంత పరపతి..
మేం బ్లాక్ అండ్ వైట్ టివి మాత్రమే ఇస్తాం..కలర్ టీవీ ఇవ్వలేం.. సంబంధం క్యాన్సిల్ ఐనా ఫర్లేదు.. మేం తూగలేము
రామారావు అప్పుడే బజాజ్ చేతక్ కోసం మొడువేలు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశాడట.. అంటే ఆయన బయటి ఆదాయం ఎంత ఉందో మరి
ఎదురింటి లక్ష్మి గోద్రెజ్ పఫ్ ఫ్రిజ్ కొనింది.. మొగుడు బానే సంపాదిస్తున్నాడు
నేను ఎంత రాత్రయినా కానీ మీ అన్నయ్య వచ్చాకే వంట చేస్తాను.. మాకు గ్యాస్ పొయ్యి ఉందిగా వదినా..
ఇదీ మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థిక మేధావి లేకుంటే భారతదేశ పరిస్థితి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన్నుంచి 1990ల వరకూ దేశం ఇలాగే ఉండేది. ఏ మూల చూసినా నిరుద్యోగం. వెనుకబాటు.. ఒక చిన్న ఉద్యోగం కోసం పోరాటం.. ఇంటిల్లిపాదీ ఆ ఉన్న కొద్దిపాటి పొలంపైనే జీవనం. మూడు నెలలు పని ఉంటే మిగతా తొమ్మిది నెలలూ ఖాళీగా ఉండడమే. ఎకరాకు 18-20 బస్తాల ధాన్యం పండితే గొప్ప. అసలు ఇంత పెద్ద దేశానికి మన్మోహన్.. పీవీ నరసింహారావు వంటివాళ్లు ప్రధానులు.. అర్థికమంత్రులు కాకపోయి ఉంటే దేశం ఆకలితో అల్లాడిపోయేది. ఒరిస్సాలోని కలహండి ఒక్కటే కాదు దేశం నలుమూలలా ఆకలి చావులు ఉండేవి.
దేశంలో ఇన్ని పరిశ్రమలు.. ఇంత ఉత్పత్తి.. ఇన్ని లక్షల ఉద్యోగాలు.. ఈ స్థాయి ఆదాయం ఉండేదే కాదు. ఇప్పుడు మన కళ్లముందు ఉన్న భారత దేశం అనే చిత్తరువు మన్మోహన్.. పీవీ అనే విజనరీ చిత్రకారులు తమ మనో నేత్రంతో ఊహించి గీసిన చిత్తరువే ఈ ఆధునిక భారతదేశం. వేలాది ఆటోమొబైల్ పరిశ్రమలు.. పోర్టులు.. టూరిజం..ప్రైవేటు బ్యాంకులు.. చెప్పులు.. వస్త్రాలు.. మొబైల్ ఫోన్లు ..దేశంలో వేసిన రహదారులు.. ఎయిర్పోర్ట్ లు..ప్రైవేటు విమానయాన సంస్థలు.. విద్యుత్ ప్రాజెక్టులు... రైల్వే లైన్లు.. ఐస్ క్రీములు.. ఆఖరుకు ఫ్లేవర్డ్ కండోమ్స్.. కోట్లలో ఉద్యోగాల కల్పన.. ఇవన్నీ ఆ ఇరువురి చలవే..
అన్నిటికీ మించి భారత సాఫ్ట్‌వేర్ రంగం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. దానిద్వారా ఉత్పన్నమైన సంపద దేశ రియల్ ఎస్టేట్.. నిర్మాణ రంగాన్ని సమున్నతంగా నిలిపింది.. ఇలా ఆ దర్శనికులు ఆనాడు శ్రీకారం చుట్టి మొక్కగా వేసిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయి. అంతర్జాతీయంగా మనను సగౌరవంగా నిలబెట్టింది. దేశానికి ఎంతోమంది ప్రధానులుగా పని చేసినా పీవీ.. మన్మోహన్ అనే జోడుగుర్రాలు మాత్రమే దేశాన్ని పేదరికం స్థాయి నుంచి మరో మెట్టు పైకి ఎక్కించారు.. ఇప్పుడు భారత్ పేద దేశం కాదు.. ఎన్నో రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక మహా మేరు పర్వతమిది.. దీనికి ఇంధనం.. శక్తి నింపింది ఆ ఇద్దరే . మరోమారు ఆ మౌనముని మన్మోహన్ సింగ్‌కు అంజలి ఘటిస్తూ..
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment