సంస్కరణలు తేవాలి
ఐఎంఎఫ్ కోటా వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేదిగా ఉండాలి: మోదీ
► వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం పెరగాలి
► భారత్, ఐఎంఎఫ్ సంయుక్త సదస్సు ‘అడ్వాన్సింగ్ ఏషియా’లో ప్రసంగం
► 2017 అక్టోబర్‌లో మరిన్ని సంస్కరణలు తెస్తాం: ఐఎంఎఫ్
న్యూఢిల్లీ:
అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని వాస్తవంగా ప్రతిబింబించేలా అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (ఐఎంఎఫ్) కోటాపరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. బహుళ పక్ష సంస్థల్లో భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ‘‘కోటా సంస్కరణలు 2010 నుంచీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తీరా ఇన్నాళ్లకు అమల్లోకి వచ్చినా... అవి వాస్తవ స్థితిని ప్రతిబింబించేలా లేవు. కోటా సంస్కరణలతో ఆయా దేశాలకు చట్టబద్ధంగా, సముచితంగా దక్కాల్సిన ప్రాతినిధ్యం దక్కాలి. దాన్ని కల్పించేవిగానే ఈ సంస్కరణల్ని చూడాలి తప్ప మరిన్ని అధికారాలిచ్చేస్తున్నట్టుగా పరిగణించకూడదు. పేద దేశాల ఆశయాలు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించగలిగితేనే ఇలాంటి బహుళపక్ష సంస్థల్ని అవి గౌరవిస్తాయి’’ అని మోదీ చెప్పారు. ‘అడ్వాన్సింగ్ ఏషియా’ అంశంపై భారత్, ఐఎంఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 అక్టోబర్‌లో కోటా పరంగా మరో విడత మార్పులు చేపడతామన్న ఐఎంఎఫ్ నిర్ణయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో అమల్లోకి వచ్చిన సంస్కరణలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వర్ధమాన దేశాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారాయన.
ఆర్థిక స్థిరత్వానికి స్వర్గధామం భారత్...
ఇటీవలి సంస్కరణల ఫలితంగా... ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.44 శాతం నుంచి 2.7 శాతానికి, ఓటింగ్ వాటాలు 2.34 శాతం నుంచి 2.6 శాతానికి పెరిగాయి. అలాగే భారత్ సహా వర్ధమాన దేశాలు బ్రెజిల్, రష్యా, చైనా కూటమిగా ఉన్న ‘బ్రిక్’... తొలిసారి ఐఎంఎఫ్‌లోని పది అతిపెద్ద సభ్య దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్సింగ్ ఏషియా సదస్సు, మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా స్థూల ఆర్థిక స్థిరత్వం కోరుకునేవారికి భారత్ స్వర్గధామమని మోదీ చెప్పారు. అధిక వృద్ధికి, అందరికీ ఆర్థిక సేవల కల్పనకు ఉద్దేశించిన.. ‘మార్పు కోసం సంస్కరణల’ ప్రక్రియ ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘పొరుగు దేశాల ప్రయోజనాలు దెబ్బతీసి.. దానిద్వారా లాభపడాలని మేం ఎన్నడూ ప్రయత్నించలేదు. మేమెప్పుడూ మా కరెన్సీ విలువను కూడా ఉండాల్సిన స్థాయికన్నా తగ్గించలేదు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అధిక ఆర్థిక వృద్ధి సాధ్యం కాదన్నది అపోహేనని మేం రుజువు చేశాం. స్థూల ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకున్నాం. ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా కట్టడి చేయగలిగాం. ఆర్థిక స్థిరీకరణను సాధిస్తున్నాం. అటు విదేశీ మారక నిల్వలను కూడా పెంచుకోగలుగుతున్నాం’’ అని మోదీ వివరించారు.
మెరిసే తార భారత్: ఐఎంఎఫ్ చీఫ్ లగార్డ్
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ మెరిసే తారగా వెలుగుతోందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో కొనసాగుతున్న సంస్కరణల ప్రక్రియను ఆమె ప్రశంసించారు. వేగం కాస్త మందగించినా.. వచ్చే నాలుగేళ్లలో ప్రపంచ ఎకానమీ వృద్ధిలో మూడింట రెండొంతుల భాగం భారత్ నుంచే రాగలదని లగార్డ్ పేర్కొన్నారు. భారత్ సహా ఇతర ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకుంటూ, వృద్ధి అనుకూల ద్రవ్య విధానాలు పాటిస్తూ... అంతర్జాతీయ ఆర్థిక సవాళ్ల ప్రభావాలను ఎదుర్కొనాలని ఆమె సూచించారు. యువత అత్యధికంగా గల మానవ వనరులతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారీ ఎకానమీగా కూడా భారత్‌ను లగార్డ్ అభివర్ణించారు. మరికొన్ని రోజుల్లో రాబోయే హోలీ పండుగను ప్రస్తావిస్తూ.. భారత్, ఆసియా సాధించిన ఘనతలను వేడుకగా జరుపుకోవాల్సి ఉందని చెప్పారు.
సెంట్రల్ బ్యాంకులకు నిబంధనావళి: రాజన్
పారిశ్రామిక దేశాలు పాటించే అసాధారణ ద్రవ్య పరపతి విధానాలు యావత్ ప్రపంచంపై ప్రభావం చూపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు అమలు చేసే ద్రవ్యపరపతి విధానాల ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయా ప్రభావాలను బట్టి వాటికి రేటింగ్ ఇవ్వాలని, ఇందుకోసం ట్రాఫిక్ లైట్లలాగా కలర్ కోడ్‌లు ఉపయోగించవచ్చని రాజన్ సూచించారు. తక్కువ ప్రతికూల ప్రభావాలు చూపే విధానాలకు ఆకుపచ్చ, తాత్కాలికమైన వాటికి నారింజ, వాంఛనీయం కాని విధానాలకు ఎరుపు రంగులతో రేటింగ్ ఇవ్వొచ్చని చెప్పారాయన. సంక్షేమ కోణంలో పాలసీ ప్రభావాలను అధ్యయనం చేయడం సరైన విధానంగా ఉండగలదని ఆయన చెప్పారు.
హెచ్1బీ వీసాలపై ఆందోళన: సీఈఏ
హెచ్1బీ వీసాలను ఎత్తివేయాలంటూ అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవిగా ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ చెప్పారు. ఎగుమతి ఆధారిత వృద్ధికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. సేవల ఎగుమతులతో భారత్ 8-10 శాతం వృద్ధి సాధించగలదని, కానీ హెచ్ 1బీ వీసాల రద్దుపై చర్చలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. అమెరికా కంపెనీలు కొన్ని విభాగాల్లో నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ వీసాలు ఉపయోగపడతాయి.
ప్రాంతీయ శిక్షణా కేంద్ర ఏర్పాటుకు ఒప్పందం..
స్థూల ఆర్థిక అంశాలపై అధికారులకు శిక్షణనిచ్చే దిశగా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్, ఐఎంఎఫ్ నిర్ణయించాయి. దక్షిణాసియా ప్రాంతీయ శిక్షణ, సాంకేతిక సహకార కేంద్రం (ఎస్‌ఏఆర్‌టీటీఏసీ) ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ సంతకాలు చేశారు.