న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలతో దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసిన రూపశిల్పి. ప్రపంచ స్థాయిలో భారత్‌ను ప్రబల ఆర్థిక శక్తిగా నిలిపిన కాకలుతీరిన ఆర్థికవేత్త. ఎవరూ ఊహించని విధంగా అత్యున్నత అందలమెక్కిన యాదృచ్ఛిక రాజకీయవేత్త. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా పదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన అదృష్టవంతుడు. కళ్లముందే అంతులేని అవినీతి జరుగుతున్నా పట్టించుకోని నిర్లిప్తుడు. చివరికి తన సొంత కార్యాలయం నుంచి ఫైళ్లు ఎటు వెళ్తున్నాయో, ఏమవుతున్నాయో కూడా తెలుసుకోలేని నిస్సహాయుడు. పదేళ్ల పాటు పెద్దగా పెదవి విప్పకుండా కాలం గడిపిన మౌని. వెరసి... ఒక ప్రధాని ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఆదర్శ నమూనా. కొన్ని విజయాలు, వాటిని ఏ దశలోనూ గుర్తుకు రానీయనంతటి భారీ అపజయాలు. అంతకుమించిన అపకీర్తులు. వాటిని కూడా తలదన్నే అవమానాలు. ఇలా మిశ్రమ అనుభూతులను మూటగట్టుకుని దేశ రాజకీయ రంగస్థలం నుంచి భారంగా నిష్ర్కమిస్తున్నారు 81 ఏళ్ల మన్మోహన్.
1991లో దేశం ఆర్థిక సంక్షోభం ముంగిట్లో నిలిచిన సమయంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ.. ఆర్థిక వేత్త మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రిని చేశారు. అది మొదలు దేశ ఆర్థిక రంగ ఉత్థాన, పతనాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన్మోహన్ కారణమయ్యారు. యూపీఏ-1 సంకీర్ణ ప్రభుత్వ సారథిగా వామపక్షాల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూనే ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. అమెరికాతో అణు ఒప్పంద సమయంలోనూ అదే పట్టుదలను ప్రదర్శించారు. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు పరిచి తన పదవీకాలంలో రికార్డు స్థాయిలో దాదాపు 8.5% జీడీపీని నమోదు చేశారు. యూపీఏ-1ను సమర్థవంతంగా పూర్తి చేయగలిగినప్పటికీ.. యూపీఏ-2 ఆయనకు అంతులేని విషాదాన్ని, మోయలేని స్కాముల భారాన్ని, అసమర్థ ప్రధాని అన్న పేరును మిగిల్చింది. కామన్‌వెల్త్ క్రీడలు, 2జీ, బొగ్గు కుంభకోణం.. ఒకదాన్ని మించి మరోటి ఆయనపై తుడుచుకోలేని మరకల్ని విదిల్చాయి. సొంత మంత్రివర్గంలోనే అలవిమాలిన అవినీతిని అరికట్టలేని అసమర్థత.. ఆయన సాధించిన విజయాలపై నీలి నీడల్ని పరిచింది. ఆనందాలను, అపనిందలను మౌనంగానే భరించి.. విజయాలను, విమర్శలను సమానంగానే స్వీకరించి.. దేశ రాజకీయ చరిత్రలో తన ప్రత్యేక మౌనముద్రను మనకు వదలి ‘7 రేస్ కోర్సు భవనాన్ని’ వీడి వెళ్తున్నారు.
మౌన ముని.. మన్మోహన్!
Published Sun, May 18 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement