ప్రపంచ వృద్ధికి భారత్ మూలస్తంభం
అంటాల్యా: ప్రపంచ వృద్ధి, స్థిరత్వానికి మూలస్తంభంగా మారే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 7.5 శాతం వృద్ధి రేటు బాటన నిలబెడతాయని అన్నారు. రానున్న సంవత్సరాల్లో ఈ రేటు మరింత మెరుగుపడుతుందని కూడా ఆయన భరోసా వ్యక్తం చేశారు. ఈ మేరకు జీ-20 దేశాల అగ్రనాయకులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు.
దేశంలో పౌరులందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసే పెద్ద కార్యక్రమాన్ని భారత్ చేపట్టిందన్నారు. ప్రజలందరికీ కనీస అవసరాలు తీర్చడానికి లక్ష్యాలను నిర్ధేశించుకుని, వీటి సాధనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించే క్రమంలో ‘నైపుణ్యతల మెరుగుదలకు’ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అలాగే మౌలిక రంగం పురోగతికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
2030 కల్లా ప్రపంచంలో పేదరిక నిర్మూలనా లక్ష్యాన్ని (ప్రపంచ సుస్థిరాభివృద్ధి- ఎస్‌డీజీ) ఆయన ఉటంకిస్తూ...ఈ అంతర్జాతీయ లక్ష్యానికి అనుగుణంగా భారత్ కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ‘వృద్ధి-పురోగతి- ప్రజా సంక్షేమం- పర్యావరణం’ అంశాల మధ్య భారత్ సమతూకం సృష్టించిందన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాలకు జీ-20 దేశాలు కూడా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తద్వారా విస్తృత ప్రాతిపదికన, త్వరతగతిన వృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అన్నారు.
వర్ధమాన దేశాల అభివృద్ధికే బ్రిక్స్ బ్యాంక్ నిధులు: ప్రధాని మోదీ
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగానే బ్రిక్స్ బ్యాంక్(న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్-ఎన్‌డీబీ) నిధులను అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారమిక్కడ పేర్కొన్నారు. వర్ధమాన దేశాల అవసరాలను తీర్చేదిశగా భారత్ దిశానిర్దేశం చేయనుందని చెప్పారు.
జీ20 దేశాల రెండు రోజుల సదస్సులో పాల్గొనే ముందు ప్రధాని మోదీ సహా బ్రిక్స్ దేశాధినేతల సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాల కూటమి(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) నేతృత్వంలో 50 బిలియన్ డాలర్ల ప్రారంభ మూలధనంతో ఎన్‌డీబీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, బ్యాంక్ కార్యకలాపాల ప్రారంభంలో పురోగతిని తాజా సమావేశంలో అధినేతలు చర్చించారు.
మరోపక్క, 100 బిలియన్ డాలర్లతో లిక్విడిటీ రిజర్వ్ ఫండ్ ఏర్పాటుపైనా ఈ సమావేశం దృష్టిసారించింది. చైనాలోని షాంగై ప్రధాన కేంద్రంగా ఏర్పాటవుతున్న ఎన్‌డీబీకి తొలి అధ్యక్షుడిగా భారతీయుడైన కేవీ కామత్‌ను ఇప్పటికే నియమించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంక్ రుణాల జారీ ప్రారంభం కానుంది. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భారత్‌కు బ్రిక్స్ చైర్మన్ హోదా లభించనుంది.
అనుసంధానంతోనే అభివృద్ధి: మిట్టల్
అనుసంధానంతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునిల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. జీ-20 దేశాధినేతాలు అందరికీ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కృషిచేయాలని కోరారు. ప్రపంచ సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆయన ఇక్కడ జరిగిన జీ-20 సదస్సులో మాట్లాడారు.
అంతర్జాతీయ వాణిజ్యం, ఇన్‌ఫ్రా పెట్టుబడుల విషయంలో నిబంధనలను సరళతరం చేయాల్సి ఉందన్నారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే.. డబ్ల్యూటీఓ ట్రేడ్ ఫెసిలియేషన్ ఒప్పందం (టీఎఫ్‌ఏ) ఆమోదం, అమలు జరగాల్సి ఉందన్నారు. భారత్ ఇప్పటికీ డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని ఆమోదించలేదని తెలిపారు. టీఎఫ్‌ఏ అమలు వల్ల అంతర్జాతీయ వాణిజ్యం ఊపందుకొని 3.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని, దీంతో 2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు.