‘క్రిటికల్ ఇల్‌నెస్’ బీమాతో ధీమా | LIA updates Critical Illnesses benefit framework | Sakshi
Sakshi News home page

‘క్రిటికల్ ఇల్‌నెస్’ బీమాతో ధీమా

Published Sun, Aug 3 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

‘క్రిటికల్ ఇల్‌నెస్’ బీమాతో ధీమా

‘క్రిటికల్ ఇల్‌నెస్’ బీమాతో ధీమా

ఆర్థిక సంస్కరణలు జెట్ స్పీడులో అమలవుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల నిర్వహణలో తీరికలేకుండా అదేస్పీడులో గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడీ తప్పడం లేదు. దీంతో కార్యకలాపాల నిర్వహణ అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ క్రమంలో గుండెపోటు, కేన్సర్, అవయవ మార్పిడి, పక్షవాతం, అంధత్వం, అచేతనం (డిజెబిలిటీ), ప్రాణాంతక అనారోగ్యం (టెర్మినల్ ఇల్‌నెస్) వంటి సమస్యలు జీవిత గమనాన్ని నిర్దేశించుకున్న మంచి లక్ష్యానికి చేరువకాకుండా చేస్తున్నాయి. దీనివల్ల అటు సంపాదించిన సొమ్ము కరిగిపోవడమే కాకుండా, కుటుంబం మొత్తం కష్టాల్లో చిక్కుకునే పరిస్థితి. ఈ తరహా పరిస్థితులు తలెత్తినప్పుడు సమర్థవంతమైన రీతిలో ఎదుర్కొనడానికి, ఆర్థిక కష్టనష్టాల నుంచి బయటపడ్డానికి కూడా మార్గం ఉంది. అదే ‘క్రిటికల్ ఇల్‌నెస్’ను (తీవ్ర అస్వస్థత) కవర్‌చేసే బీమా.
 
ప్రాధాన్యత
జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఎక్కువమందికి అవగాహన ఉంటుంది. అయితే ్ర‘కిటికల్ ఇల్‌నెస్’ బీమా పాలసీపై అవగాహన చాలా తక్కువ.  దీనివల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ‘క్రిటికల్ ఇల్‌నెస్’ అనే విభాగంలో ఉన్న వ్యాధులకు గురైనప్పుడు ఈ పాలసీ పరిధిలో ఉన్న వారు కొండంత ధైర్యంగా ఉండడానికి ఈ బీమా ఎంతో దోహదపడుతుంది.  ప్రయోజనాల విషయానికి వస్తే...  క్రిటికల్ ఇల్‌నెస్ జాబితాలోని అనారోగ్యం బారిన పడ్డారని పరీక్షల్లో వెల్లడికాగానే బీమా చేసిన మొత్తం చేతికి అందుతుంది. బీమా చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది.

జీవిత బీమా, ఆరోగ్య బీమా అందించలేని ప్రయోజనాలు క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్సులో ఉన్నాయి. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు భారీమొత్తం అందుతుంది తప్ప అదే వ్యక్తి తీవ్ర అనారోగ్యంపాలై కోలుకున్నపుడు నయా పైసా కూడా రాదు. ఇక ఆరోగ్య బీమాలో చాలా రకాల తీవ్ర అస్వస్థతలను మినహాయిస్తుంటారు. చికిత్స వ్యయాలు పూర్తిగా బీమా పరిధిలోకి రాని పరిస్థితులూ ఉంటాయి. వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం.

ప్రాణాల మీదకు వచ్చిన వ్యాధి భవిష్యత్తులో మీ భవిష్యత్తు వ్యాపార లేదా ఉద్యోగ కార్యకలాపాల బాధ్యతల నిర్వహణకుగానీ లేదా వృద్ధికి గానీ విఘాతం కలిగించకూడదు.  చికిత్స వ్యయాలతో సంబంధం లేకుండా బీమా సొమ్ము మొత్తం చేతికి అందుతుంది. అయితే ప్లాన్‌కూ ప్లాన్‌కూ వేర్వేరు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. ‘క్రిటికల్ ఇల్‌నెస్’ బీమా తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన  నాలుగు అంశాలు ఇవి...
 
1. కవరేజ్...
 మీకు బీమా కవరేజ్ ఎంత అవసరం. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ మీ నుంచి పాలసీ నిమిత్తం ఎంత మినహాయిస్తోంది. ప్రయోజనాలు ఏమి ఉన్నాయి. ఆయా అంశాలు పరిశీలించిన మీదట మీకు మరెంత పాలసీ పరమైన రక్షణ కావాలో మీరు నిర్ణయించుకోవాలి. రికవరీకి అయ్యే వ్యయాలు, చికిత్స వ్యయాలు, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వయో పరమైన ప్రయోజనాలు ఇలా ప్రతి ఒక్కదానిని ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి.
 
2. పాలసీ తరహా
 క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను విడిగా ఓ బీమా పాలసీగా తీసుకోవచ్చు. లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు రైడర్‌గానూ తీసుకోవచ్చు. పాలసీ నియమ నిబంధనలు రెండింటిలోనూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను విడిగా తీసుకుంటే బీమా మొత్తం ఎంతుండాలన్న అంశాన్ని నిర్దిష్టంగా ఎంపిక చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రైడర్లతో పోల్చితే,  స్టాండలోన్‌గా కవరేజ్ బాగుంటుంది.
 
3. చదవండి
 క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ లిస్ట్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. దాదాపు 20 తీవ్ర అస్వస్థతలను కవర్‌చేసే పాలసీలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
 
4. తగినంత బీమా
 తీవ్ర అస్వస్థత సంభవించినప్పుడు ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొనడానికి తగిన బీమా ఉందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం అవసరం.  వార్షిక పన్ను చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడమే ధ్యేయంగా ఆరోగ్య బీమా పాలసీని కొనకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement