నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా?
న్యూఢిల్లీ : దేశ కార్పొరేట్ చరిత్రలో కనివినీ రీతిలో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన వివాదంలో తలమునకలై ఉన్న రతన్ టాటా, ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. మూడు అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటని రతన్ టాటా అభివర్ణించారు. బ్లాక్మనీని నిర్మూలించడానికి ఇది ఎంతో సహకరిస్తుందంటూ డీమానిటైజేషన్ను కొనియాడారు. అయితే అమలు సరిగా లేదని వ్యాఖ్యానించారు. లోపాలను యుద్ధప్రాతిపదికన సరిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న బోల్డ్ డిమానిటైజేషన్ నిర్ణయానికి దేశమంతా మద్దతివ్వాలని టాటా పిలుపునిచ్చారు. భారతీయ చరిత్రలో డిలైసెన్సింగ్, జీఎస్టీతో పాటు బ్లాక్ మనీపై పోరాటం చేస్తూ పెద్దనోట్ల రద్దు చేయడం కూడా మూడు అత్యంత ముఖ్యమైన ఆర్థికసంస్కరణల్లో ఒకటని కొనియాడారు.
నగదు రహిత ఎకానమీ కోసం ప్రధాని మోడీ ఇటీవల మొబైల్, డిజిటల్ పేమెంట్లపై ఎక్కువగా దృష్టిసారించారని, దీనివల్ల దీర్ఘకాలికంగా పేద ప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుందని రతన్ టాటా అన్నారు. బ్లాక్మనీని నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ యుద్ధం చేస్తుందని, రేపటి తరానికి దేశ వనరులను సమృద్ధిగా అందించాలనుకునే మధ్యతరగతి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని పేర్కొన్నారు. గత నెల టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా సైరస్ మిస్త్రీని తొలగించడంపై తీవ్ర వివాదమైన సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరు ఆరోపణలపై కార్పొరేట్ చరిత్రలో మంచి పేరున్న టాటాగ్రూప్ పరువు వీధినపడింది. ఇప్పటికీ వీరి వివాదం సర్దుమణగలేదు.