అమెరికా మాదిరి సౌదీ కూడా...
అమెరికా మాదిరి సౌదీ కూడా...
Published Tue, Mar 21 2017 11:34 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
దుబాయ్ : అమెరికా మాదిరి సౌదీ అరేబియా కూడా నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలకు, విదేశీ వర్కర్లకు నిబంధనలను కఠినతరం చేసి, నిరుద్యోగితను తగ్గించుకోవాలని సౌదీ ప్లాన్ చేస్తోంది. ఎక్కువమంది సౌదీ వాసులనే ఉద్యోగులుగా నియమించుకునేందుకు కంపెనీలకు త్వరలోనే కఠినతరమైన ఆదేశాలు జారీచేయాలని నిర్ణయించినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త పాలసీ, సౌదీ గతేడాది లాంచ్ చేసిన ఆర్థిక సంస్కరణలకు ఎంతో సహకరించనున్నాయి. ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా సౌదీ తమ దేశంలో నిరుద్యోగితను 2020 నాటికి 12.1 శాతం నుంచి 9 శాతానికి తగ్గించుకోవాలని నిర్దేశించుకుంది.
కానీ కంపెనీలు మాత్రం తక్కువ జీతాలు చెల్లించే విదేశీ వర్కర్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చి కంపెనీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ రూల్స్ తో సౌదీలో పనిచేసే చాలామంది విదేశీ వర్కర్లపైన ప్రభావం పడనుంది. మరోవైపు ఆ దేశంలోని కంపెనీలపై కూడా ఈ పాలసీ ప్రతికూల ప్రభావం చూపనుంది. సౌదీ అరేబియాలో 12 మిలియన్ల విదేశీలు పనిచేస్తున్నారు. కొత్త పాలసీ కింద 500 నంఉచి 2999 వరకు వర్కర్లు పనిచేసే నిర్మాణ సంస్థలో 100 శాతం సౌదీలుంటే ప్లాటినం కేటగిరీని కంపెనీకి అందిస్తారు. రిటైల్ సెక్టార్లో 35 శాతం సౌదీలుంటే ప్రస్తుతం ప్లాటినంగా గుర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ శాతాన్ని 100కు పెంచనున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలా 60కి పైగా ఇండస్ట్రీల్లో ఈ కఠినతరమైన నిబంధలు అమలవుతాయని పేర్కొంటున్నారు.
Advertisement