రియాద్: విదేశీ కార్మికులను తగ్గించే యోచనలో పడింది సౌదీ ప్రభుత్వం. తమ దేశంలో ఏళ్ల తరబడి ఉంటున్న విదేశీయులపై ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమవుతుంది. దీనికి గాను ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త కార్మిక చట్టం నితాఖాను మరింత విస్తరించనుంది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినట్లయితే ఎనిమిది సంవత్సరాలు, ఆపై ఉన్నవారికి సమస్యలు తప్పకపోవచ్చు. ఈ తాజా మార్పుతో ఆ దేశ ప్రజలకు మరిన్ని ఉద్యోగాలతో పాటు భారీ జీత భత్యాలు అందించే ఆస్కారం దొరుకుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
తమ దేశంలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న విదేశీయులకు ఈ ఆంక్షలను వర్తింపచేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పాయింట్ల విధానంతో వారిని ఇద్దరు విదేశీ కార్మికుల కింద గణిస్తారు. ఆరువేల సౌదీ రియాల్స్ ను కానీ, అంతకు ఎక్కువ మొత్తంలో జీతం తీసుకునే వారికి కూడా ఈ విధానాన్నే వర్తింపచేయనున్నారు. ఈ విధానాన్ని విదేశీయులతో పాటు ఎక్కువ శాతం సౌదీ దేశస్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ పద్ధతి సౌదీ అరేబియాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులను నిరుత్సాహానికి లోనుచేసినట్లే అవుతుందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.