న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో కొత్త కార్మికచట్టం నితాఖా అమల్లోకి వచ్చాక 14 లక్షల మంది భారతీయు కార్మికులు క్రమబద్ధీకరణకు నోచుకున్నారని ప్రవాస వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రేమ్‌నారాయణ్ తెలిపారు. 1.40లక్షల మంది కార్మికులు భారత్‌కు తిరిగొచ్చేశారని, సరైన పత్రాలు లేనికారణంగా ఇంకా 250 మంది అక్కడ చిక్కుకుపోయారని చెప్పారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో కార్మికులకు భారత ఎంబసీ సాయం చేస్తుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో, అక్రమంగా ఉపాధి పొందుతున్న వారిని పంపేందుకు సౌదీ గతేడాది నవంబర్‌లో నితాఖా చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఈ చట్టం వల్ల మొత్తం 28 లక్షల భారతీయ కార్మికులు వెనుదిరగాల్సి ఉండగా.. 14లక్షల మందిని క్రమబద్ధీకరించారని ప్రేమ్‌నారాయణ్ చెప్పారు. భారతీయ కార్మికుల్లో ఎక్కువ మంది బ్లూకాలర్ ఉద్యోగాల్లో ఉన్నారని, చదువు రాకపోవడం వల్ల వారు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నితాఖా చట్టం వారికి మేలు చేస్తుందన్నారు.