పీవీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు దేశం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో ఎటుచూసినా నిరాశ, నిస్పృహలు నిండిన తరుణంలో ఆయన చూపిన దార్శనికత ఇప్పటికీ ఫలాలు అందిస్తూనే ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ దిశను, దశను మార్చి.. భారతీయ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన ఆయనే పీవీ నరసింహారావు. ప్రధానమంత్రిగా దేశానికి కొత్త పునరుజ్జీవానాన్ని అందించిన పీవీ 95వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పది ఆసక్తికర విషయాలివి..
-
పీవీని ఆధునిక చాణుక్యుడిగా అభివర్ణిస్తారు. దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సమయంలో ఆయన చూపిన చాణుక్యం, దార్శనికత ఆధునిక భారతానికి పునాదాలు వేశాయి. అత్యంత కఠినమైనవిగా భావించిన ఆర్థిక, రాజకీయ సంస్కరణలకు పీవీ ఆద్యుడిగా నిలిచారు.
-
పీవీ బాహుముఖ ప్రజ్ఞాశాలి. బాహుభాషా కోవిదుడు. ఆయన తొమ్మిది భారతీయ భాషలు (తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, తమిళ్, ఉర్దూ), ఎనిమిది విదేశీ భాషలు (ఇంగ్లిష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, లాటిన్, పర్షియన్) మాట్లాడగలరు.
-
ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రి పీవీ.
-
పీవీ ప్రభుత్వ హయాంలోనే రూపాయి విలువను తగ్గించి అంతర్జాతీయ వాణిజ్యానికి వీలుగా మార్చారు.
-
దేశంలో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలని మొదట భావించిన ప్రధాని పీవీనే. ఈ ఆలోచననే తదుపరి ప్రధాని వాజపేయి అమలుచేశారు.
-
హైదరాబాద్ సంస్థానంలో 1940లో నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ పీవీ కీలక పాత్ర పోషించారు.
-
1948 నుంచి 1955 మధ్యకాలంలో ఆయన, ఆయన బంధువు కలిసి ‘కాకతీయ పత్రిక’ ను నడిపారు.
-
పీవీకి ‘భారత రత్న’ ఇవ్వాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యం సహా ఎన్నో పార్టీల నాయకులు, మంత్రులు గతంలో డిమాండ్ చేశారు.
-
‘లుక్ ఈస్ట్’ పాలసీని మొదటి చేపట్టిన ప్రధాని పీవీనే. వ్యూహాత్మకంగా కీలకమైన దక్షిణాసియా దేశాలతో సంబంధాలు నెరపాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మొదటి ప్రధాని పీవీనే.
- లోక్‌సభలో మైనారిటీలో ఉన్నప్పటికీ పూర్తిగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన మొదటి ప్రధాని పీవీ నరసింహారావు.
పీవీ సాహిత్య సేవ..!
సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలుకు పీవీ చేసిన హిందీ అనువాదం ఇది. ఈ పుస్తకానికి పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
ఇన్‌సైడర్: ఆయన రచించిన ఆత్మకథాత్మక నవల. తాను ముఖ్యమంత్రి పదవి అధిష్టించి.. దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు ఈ నవలలోని చిత్రణకు చాలా దగ్గర పోలిక వుంది. నవలలోని కథానాయకుడు ఆనంద్.. పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలకు నిజమైన పేర్లు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు మాత్రం పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది.
తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో పీవీ రాసిన "గొల్ల రామవ్వ" కథ కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది.