పట్నా టూర్ అనగానే నాకు ‘చాణక్య’ చారిత్రక నవల, టీవీ సీరియల్ ఒకదానితో ఒకటిపోటీ పడుతూ కళ్ల ముందు మెదిలాయి. ‘సున్న’ తో ప్రపంచ గణితాన్ని గాడిలో పెట్టిన ఆర్యభట్ట గుర్తొచ్చాడు. ఖగోళ పరిజ్ఞానంలో మన మేధ ఎంతో పరిణతి చెందినదనే విషయం మరోసారి గుర్తొచ్చింది. అలాగే వర్తమానంలో బిహార్ అనుభవిస్తున్న పేదరికమూ, జంగిల్ రాజ్ అనే వార్తకథనాలు కూడా గుర్తొచ్చాయి. పాటలీపుత్ర నుంచి పట్నా వరకు ఈ నగరం అనుభవించిన ఆటుపోట్లన్నీ కళ్లముందు మెదిలాయి. పట్నాలో అడుగు పెట్టిన తర్వాత దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ గతంలోకి వెళ్లి విశ్లేషించుకుంటూ ముందుకు సాగాను. ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీలో చూపుడువేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఆర్యభట్ట విగ్రహం ముందు మోకరిల్లాను.
బిహార్‌లో ఆలూ
పట్నా ప్రజల జీవనశైలి నిరాడంబరంగా కనిపించింది. కూరగాయల బళ్ల మీద బంగాళదుంప రాశి, పక్కనే మరో బస్తా ఉంటాయి. కాయగూరలు నామమాత్రమే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్‌లో లాలూ ఉంటాడు’ అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పుడు లాలూ లేడు కానీ ఆలూ మాత్రం ఉంది. బిహార్ జీవనశైలిలో ఆకుపచ్చ కూరగాయల కంటే బంగాళదుంపకేప్రాధాన్యం. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో జిలేబీ, భోజనంలో మధ్యమధ్య పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినడం ఈ రెండూ కొత్తగా అనిపిస్తాయి. జీవనశైలి విలాసవంతంగా లేకపోయినప్పటికీ కళల పట్ల ఆరాధన మెండుగా ఉంది. సంగీతకార్యక్రమాలు, వేడుకల్లో నాట్య ప్రదర్శనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఊరేగింపులో వాహనాల మీద జరిగే నాట్యప్రదర్శనల్లో నర్తకి రక్షణ కోసం గ్రిల్ ఉంటుంది. బాలికల చదువు, రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రచారం బాగున్నాయనిపించింది.
ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు
పట్నా నగరం పర్యావరణానికిప్రాధాన్యం ఇస్తోంది. ఆటో రిక్షాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. వాహనాల విషయంలో పర్యావరణ స్పృహ మెండుగానే ఉంది. ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏమీ లేక΄ోవడంతో సామాన్యుల్లో ఆ ధ్యాస కనిపించదు. గంగాతీరంలో పూజలు చేసి పూలు, అగరవత్తులు తీసుకెళ్లిన పాలిథిన్ కవర్లను అక్కడే పడేస్తున్నారు. తీరమంతా ΄్లాస్టిక్ వ్యర్థాల తోరణంగా కనిపించింది. గంగానది నీరు స్వచ్ఛంగా ఉన్నాయి, నదిలో పడవ విహారం మాత్రం అద్భుతమైన అనుభూతినిచ్చింది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో నది విహారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.
గోల్‌ఘర్
పట్నాలో తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్‌ఘర్ ఒకటి. ఇది మగధరాజ్య ధాన్యాగారం. ఈ ధాన్యాగారం ఇనుప నిర్మాణం. రాజ్యంలో రైతులు పండించిన ధాన్యంలో వారి అవసరాలకు పోగా మిగిలిన వాటిని సేకరించి ఇందులో భద్రపరిచేవారు. ఒక ఏడాది కరువు, వరదలు వచ్చినా సరే రాజ్యంలో ఆకలి లేకుండా తిండి గింజలను అందుబాటులో ఉంచడం కోసమే ఈ ఏర్పాటు. ΄ాలనలో ఇంతటి ముందు చూపుకు చాణుక్యుని అర్థశాస్త్రమే మూలం. ప్రాచీన కాలంలో ఇక్కడ పర్యటించిన ఫాహియాన్, మెగస్తనీస్ వంటి విదేశీ యాత్రికులు పట్నా నగరాన్ని ప్రపంచానికి మోడల్‌గా చూపించారు. మెగస్తనీస్ అయితే ఏకంగా ‘గ్రేటెస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్’ అని రాశాడు. అంతటి చైతన్యవంతమైన, ఉచ్ఛస్థితిని చూసిన నగరం పట్నా. సామాన్యులతో మాటలు కలిపితే ఆ మూలాల ప్రభావం ఇప్పటికీ ఉందనిపిస్తుంది. వారిని చూస్తే పేదరికంతో పోరాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ మాటల్లో వారిలో సమృద్ధిగా ఉన్న రాజకీయ చైతన్యం వ్యక్తమవుతుంది.
ప్రాచీన కాలంలోకి ఎంట్రీ
పట్నా నగరం ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి జనజీవనం కొనసాగుతూ వస్తున్న ప్రదేశం. ఆర్యభట్ట, వాత్సాయనుడు, చాణుక్యుడు, సిక్కుల గురువు గురుగోవింద్‌సింగ్ వంటి మేధావులు పుట్టిన నేల. నంద, మౌర్య, గుప్త రాజవంశాల రాజధాని. ఇన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నేల మీద నడిచేటప్పుడు మనకు తెలియకుండానే నేటి నుంచి అక్షరాలలో చూసిన నాటికి వెళ్లిపోతాం. ఇక్కడ పర్యటించడం రియల్లీ ఏ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్.
పరిణిత శిల్పకళ
ప్రాచీన పట్నా జీవనశైలిని చూడాలంటే బిహార్ మ్యూజియంలో అడుగుపెట్టాలి. మొదటగా ఆకర్షించేది యక్షిణి శిల్పం. గంగానది తీరాన దిదర్‌గంజ్ గ్రామం నుంచి సేకరించిన ఈ శిల్పం శిల్పం అద్దంలా మెరుస్తుంటుంది. శిల్పచాతుర్యాన్ని ఫొటోలో చూడాల్సిందే తప్ప వర్ణించడం అసాధ్యం. రీజనల్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖనాలు మధుబని ఆర్ట్‌లో కృష్ణుడు, గోపికల ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పటంలో ఒక గ్రంథం ఇమిడి ఉంటుంది. బొమ్మలు వేయడానికి చిత్రకారులు వాడిన బేసిక్ కలర్స్ నుంచి సెకండరీ కలర్స్ వాడకం వరకు చిత్రవర్ణాల పరిణామ క్రమం అర్థమవుతుంది. చిత్రాలను, శిల్పాలను పరిశీలించినప్పుడు అప్పటి కాలంలో చిత్రకళ కంటే శిల్పకళ ఉచ్ఛస్థితిలో పరిణతి చెందినట్లు అనిపించింది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment