
జాతీయ, అంతర్జాతీయ పర్యటనలకు నగరవాసుల ఆసక్తి
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మధ్య ఆసియా దేశాలు
హిమాచల్‌ప్రదేశ్, కూర్గ్, తదితర ప్రాంతాలకు సైతం డిమాండ్
ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన ట్రావెల్స్ యాజమాన్యాలు
పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా సంస్థల ప్యాకేజీలు
వేసవి విహారానికి నగరం సన్నద్ధమవుతోంది. నచ్చిన ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక ప్రియులు ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల సందర్శనకు బయలుదేరుతారు. కొందరు కుటుంబాలతో సహా కలిసి పర్యటిస్తే, మరికొందరు సోలో టూర్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక ఏజెన్సీలు పర్యాటకుల అభిరుచికి తగినవిధంగా విభిన్న వర్గాలకు చెందిన ప్యాకేజీలను అందజేస్తున్నాయి. జాతీయ పర్యటనల్లో ఎక్కువ మంది హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, ఊటీ, కూర్గ్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుండగా, అంతర్జాతీయ పర్యటనల్లో ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారినట్లు టూరిజం సంస్థలు పేర్కొంటున్నాయి. తక్కువ బడ్జెట్‌లో యూరప్‌లో పర్యటించిన అనుభూతిని కలిగించే కజఖిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కమెనిస్తాన్ తదితర దేశాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది చల్లటిప్రదేశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆ తరువాత ఆధ్యాతి్మక, చారిత్రక ప్రదేశాలకు సైతం డిమాండ్ ఉందని పర్యాటక సంస్థలు చెబుతున్నాయి. ఈ మేరకు హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, కర్ణాటకలోని హిల్‌స్టేషన్‌గా పేరొందిన కూర్గ్, తమిళనాడులోని ఊటీకి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ వస్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆ తరువాత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరొందిన హంపి, విరూపాక్ష ఆలయం, విఠల ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలు. రాతి దేవాలయాలు, శిలలతో కూడిన శిల్పాలకు ప్రసిద్ధి చెందిన మహాబలిపురం. వారణాసి, అయోధ్య, ఢిల్లీ, జైపూర్ వంటి ప్రదేశాలకు సైతం ఎక్కువ మంది తరలి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అంచనా. ప్రైవేటు సంస్థలతో పాటు ఐఆర్‌సీటీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు సైతం ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి.

ఏటా రెండు లక్షల మంది..
జాతీయ, అంతర్జాతీయ పర్యటనలకు ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తునట్లు అంచనా. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ సుమారు 15,000 మంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, బంధువుల వద్దకు వెళ్లేవాళ్లు కాకుండా కనీసం 5 వేల మంది పర్యాటకులు ఉన్నట్లు అంచనా. అలాగే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతి సంవత్సరం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రతి రోజూ సుమారు 3 లక్షల మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా వారిలో 30 వేల మందికి పైగా కేవలం పర్యాటకప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లేవాళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఆహ్లాదం.. ఆనందం..
ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాల పర్యటనలకు వెళ్లేవారిలో దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా తదితర దేశాల తరువాత మధ్య ఆసియా దేశాలకు ఎక్కువమంది వెళ్తున్నారు. కజికిస్తాన్‌లోని ఎత్తైన పర్వతాలు, రిసార్ట్‌లతో ఆకట్టుకునే ప్రాంతాలు, అమెరికాలోని గ్రాండ్ కాన్యన్‌ను తలపించే అందమైన ప్రాంతం చారిన్ కాన్యన్, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన బైకనూర్ కాస్మోడ్రోమ్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అలాగే ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరాలు, మధ్యయుగపు ఇస్లామిక్ కట్టడాలతో నిండి ఉన్న బుఖారా, మౌసోలియమ్స్, ఖివా వంటి ప్రాంతాలను పర్యాటకులు ఎంపిక చేసుకుంటున్నారు. నగర పర్యాటకులను ఆకట్టుకుంటున్న మరో అందమైన దేశం అజర్‌బైజాన్. తక్కువ బడ్జెట్‌లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఈ దేశంలో రాజధాని బాకు ఆధునిక ఆర్కిటెక్చర్‌తో చారిత్రక ప్రదేశాలతో నిండి ఉంటుంది. షెకీ మరో పురాతన నగరం. ఇది ప్యాలెస్‌ల నగరంగా పేరొందింది. అలాగే ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, వినోదభరితమైన పార్కులతో కూడిన గాబాలా నగరం కూడా అజర్‌బైజాన్‌లోనే ఉంది.