న్యూఢిల్లీ: దీపావళిని 'దీపాల పండుగ' అని కూడా అంటారు. దీపావళి నాడు దేశంలోని ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. ఇరుగుపొరుగువారికి స్వీట్లు పంచుతారు. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని నగరాల్లో జరిగే దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి ఐదు నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య (ఉత్తరప్రదేశ్)
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య దీపావళి ప్రత్యేక వేడుకలకు కేంద్రంగా మారింది. ఇక్కడ దీపోత్సవ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రేక్షకులను ఇవి మంత్ర ముగ్ధులను చేస్తాయి.
వారణాసి (ఉత్తరప్రదేశ్)
వారణాసిలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్‌లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్‌లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అందరినీ అలరింపజేస్తాయి.
కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)
కోల్‌కతాలో దీపావళితో పాటు కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను వేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. కోల్‌కతాలో జరిగే దీపావళి వేడుకల్లో ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది.
గోవా
గోవాలో దీపావళిని ప్రత్యేక శైలిలో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇందు కోసం ముందుగా భారీ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. వీటిని దీపావళి రాత్రి వేళ దహనం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాణసంచా వెలిగిస్తారు.
ముంబై (మహారాష్ట్ర)
ముంబైలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్‌లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలోకి పేలుతున్న పటాకులు చూపరుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా దీపావళి వేడుకలు జరగడం విశేషం.
ఇది కూడా చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!
Comments
Please login to add a commentAdd a comment