తిరువనంతపురం: భారత్‌లో రానున్న సంవత్సరాలలో వేసవి ఉగ్రరూపం చూపిస్తుందని వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. ముందస్తుగా వేసవి కాలం రావడంతో పాటు వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగి ప్రమాదకరంగా మారుతాయని తెలిపింది. ప్రపంచంలో వేసవి తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పులకు వేలాది మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది.
‘‘క్లైమేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’’ అన్న పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రూపొందించింది. కేరళ ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరువనంతపురంలో వరల్డ్ బ్యాంకు రెండు రోజులు నిర్వహించనున్న భారత వాతావరణం, అభివృద్ధి భాగస్వామ్యుల సదస్సులో ఈ నివేదికను విడుదల చేయనుంది. ఈ సారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగుతుందని, ప్రజల ఆయుష్షు పరిమితిని తగ్గించే అవకాశం ఉందని, ఆర్థికంగా సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75% మంది అంటే దాదాపుగా 38 కోట్లమంది మండుటెండల్లో చెమటోడుస్తూ పని చేస్తారని, వారందరి ప్రాణాలకు వడగాడ్పులు ముప్పుగా మారుతాయని నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పుల వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో 3.4 కోట్ల మంది భారత్‌లో ఉంటారని బ్యాంక్ అంచనా వేసింది.
ఇదీ చదవండి: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్
Comments
Please login to add a commentAdd a comment