
పెట్టుబడులకు అడ్డంకులు తొలగిస్తాం
సంస్కరణలు కొనసాగిస్తున్నాం
- భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
- అమెరికా ఇన్వెస్టర్లకి ప్రధాని మోదీ ఆహ్వానం
న్యూయార్క్: ఆర్థిక సంస్కరణలు కొనసాగిస్తూ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని, ఆటంకాలు తొలగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై గల ఆందోళనలను పరిష్కరిస్తామని, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావాలని అమెరికా ఇన్వెస్టర్లను ఆయన ఆహ్వానించారు. రెండోసారి అమెరికా పర్యటనలో భాగంగా ఆర్థిక రంగానికి చెందిన టాప్ కంపెనీల సీఈవోలతో గురువారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్కరణల అజెండాను వారికి వివరించారు. ఇన్‌ఫ్రా తదితర కీలక రంగాల్లో పెట్టుబడుల రాకకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు గడిచిన 15 నెలలుగా చేపట్టిన వివిధ చర్యలను ఆయన ప్రస్తావించారు. భారత్ వృద్ధి అవకాశాలను, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారీ అవకాశాలను గురించి ప్రధాని వివరించారు.
భారత ఆర్థిక వృద్ధి మరింతగా మెరుగుపడుతుందంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధితో పాటు మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీల అంచనాలను ఈ సందర్భంగా ప్రధాని ఉటంకించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. భారత్‌లో వ్యాపారాల నిర్వహణ, పెట్టుబడులు పెట్టడంపై గల ఆందోళనలను తొలగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని, ఉండకూడని ఆటంకాలు ఉండబోవని ఇన్వెస్టర్లకు మోదీ హామీ ఇచ్చారు. సీఈవోలకు ఇంకా సందేహాలేమైనా ఉంటే వాటన్నింటినీ కూలంకషంగా పరిశీలించి, పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అమెరికాలోని టాప్ 10 ఆర్థిక సంస్థల నుంచి 8 కంపెనీల సీఈవోలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డైమన్, బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీవ్ ష్క్వార్జ్‌మన్, వార్‌బర్గ్ పింకస్ సహ సీఈవో చార్లెస్ కే, కేకేఆర్ కో-చైర్మన్ హెన్రీ క్రేవిస్ తదితర దిగ్గజాలు వీరిలో ఉన్నారు.
ఆందోళనలు ఏకరువు..
భారత్‌లో ఇంకా బ్యూరోక్రసీ సమస్యలు ఉన్నాయని, కీలక రంగాల్లో నియంత్రణ ఎత్తివేత ఆశించినంత వేగంగా జరగడం లేదని ఇన్వెస్టర్లు మోదీకి తెలిపారు. దివాలా చట్టాలు, డీరెగ్యులేషన్‌తో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులకు సంబంధించి ట్యాక్సేషన్ విధానాలు మొదలైన వాటిపై తమకున్న సందేహాలను వారు ప్రస్తావించారు. భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్న సంగతి వాస్తవమేనన్న సీఈవోలు.. ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ప్రశంసించారు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు అవసరమన్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తలపెట్టిన భారీ ప్రాజెక్టుల గురించి వివరించారు. 5 కోట్ల గృహాల నిర్మాణం, రోజంతా నిరంతరాయ విద్యుత్ సరఫరా, 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సాధించడం తదితర లక్ష్యాలను ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 500 పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించనున్నట్లు తెలిపారు. మోదీతో భేటీ నిర్మాణాత్మకంగా జరిగిందని జేపీ మోర్గాన్ సీఈవో జేమ్స్ డైమన్ చెప్పారు. ఆయన సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికే భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టిందని, వీటిని కొనసాగించాలని అమెరికా సంస్థలు కోరుకుంటున్నాయన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై తాము ఆశావహంగానే ఉన్నామని ఎన్‌వై స్టేట్ కామన్ రిటైర్‌మెంట్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విక్కీ ఫులర్ తెలిపారు.
డిజిటల్ ఇండియాకు గూగుల్ తోడ్పాటు
న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాక గురించి అమెరికాలోని భారతీయులతో పాటు గూగుల్ సిబ్బంది కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని యూట్యూబ్‌లో ఆయన పేర్కొన్నారు. భారత్, సిలికాన్ వ్యాలీకి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని, సిలికాన్ వ్యాలీలోని అనేక టెక్ కంపెనీలకు భారత్ చిరకాలంగా నిపుణులను అందిస్తూ వస్తోందని సుందర్ తెలిపారు. భారతీయులు రూపొందించిన అనేక ఉత్పత్తులు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం 120 కోట్ల మంది ప్రజలను డిజిటల్ మాధ్యమంతో అనుసంధానించే బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టడం ద్వారా భారత్ విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సుందర్ సహా పలువురు టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ కానున్న నేపథ్యంలో సుందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.