
పీవీకి భారతరత్న ఇవ్వండి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేయనుంది.
* కేంద్రానికి సిఫారసు చేయనున్న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం
* ‘పద్మ’ అవార్డుల పరిశీలనలో 37 మంది పేర్లు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశానికి విశేష సేవలందించిన పీవీని భారత రత్నగా గుర్తించాలని కమిటీ అభిప్రాయపడింది.
అలాగే ‘పద్మ’ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం 37 మంది పేర్లను కూడా ఈ కమిటీ పరిశీలించింది. తెలంగాణ చరిత్రకారుడు లింగాల పాండురంగారెడ్డి, ప్రముఖ దంతవైద్యుడు ఎం.ఎస్. గౌడ్, సామాజిక కార్యకర్త మహ్మద్ అమర్, ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్, ప్రముఖ మెజీషియన్ సామల వేణు, ఫ్లూట్ గాయకుడు జయప్రదరామ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
‘పద్మ’ అవార్డులకు సంబంధించి వచ్చిన అన్ని పేర్లకు కమిటీ దాదాపు ఆమోదముద్ర వేసింది. ఈ ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించనున్నారు. పద్మ అవార్డులు ఆశిస్తున్న వారిలో ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే పేర్లను మాత్రమే కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.