దలైలామాకు భారత రత్న?
తవాంగ్ : టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్ అత్యుత్తమ పురస్కారం భారత రత్నను ఇవ్వాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కోరుతోంది. దలైలామాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంతక సేకరణ క్యాంపెయిన్ ను కూడా ప్రారంభించింది. ఓ వైపు దలైలామా భారత్ పర్యటనకు చైనా తీవ్ర అభ్యంతరం చెబుతున్నా... ఆయన శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ చేరారు. ఆయన రావడానికి ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 6న ఆర్ఎస్ఎస్ ఈ క్యాంపెయిన్ ను లాంచ్ చేసింది.
ఇప్పటికీ 5000 సంతకాలు సేకరించామని, 25వేల సంతకాలు పొందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు ఈ అభ్యర్థనను తీసుకెళ్తామని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. టెంపుల్టన్ ప్రైజ్-2012కి కూడా ఆయన ఎంపికయ్యారు. భారత రత్న పురస్కారం, నోబెల్ శాంతి బహుమతి కంటే భిన్నమైనదని, అంతర్జాతీయంగా మంచి మెసేజ్ ను అందించడానికి ఇది తోడ్పడుతుందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. దలైలామా భారతరత్నకు అర్హుడని, ఆయన భారత్ సంతతికి చెందిన వారని తెలిపింది.