ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ ఇవ్వండి
న్యూఢిల్లీ: దివంగత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. హాకీ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో అడాల్ఫ్ హిట్లర్‌లాంటి నియంతనే మెప్పించిన అలనాటి హాకీ హీరో... భారత్‌కు ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ (1928, 1932, 1936) స్వర్ణ పతకాలు అందించారు. జాతీయ క్రీడ హాకీకి విశేష సేవలందించిన మేజర్ ధ్యాన్‌చంద్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గుర్తించాలని గోయెల్ పేర్కొన్నారు. లేఖ రాసిన విషయం నిజమేనని ఆయన ధ్రువీకరించారు.
‘ఔను... ప్రధానికి లేఖ రాశాం. హాకీకి ఎనలేని కృషి చేసిన మేజర్‌కు ‘భారతరత్న’తో ఘన నివాళి అర్పించాలని అందులో పేర్కొన్నాం’ అని గోయెల్ వెల్లడించారు. 2013లో తొలిసారిగా క్రీడల విభాగంలో భారత ప్రభుత్వం క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఈ పురస్కారం అందించింది. కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన టెస్టు మ్యాచ్ ముగిసిన గంటల వ్యవధిలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం సచిన్‌కు ఈ అవార్డును ప్రకటించింది. అయితే క్రికెట్ దిగ్గజం కంటే ముందుగా ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాల్సిందని క్రీడల మంత్రి అభిప్రాయపడ్డారు.
2011లో 82 మంది ఎంపీలు ధ్యాన్‌చంద్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని పట్టుబట్టినా... అవార్డుల అర్హుల నియమావళిలో క్రీడారంగం లేదని ప్రభుత్వం తోసిపుచ్చింది. ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29)ని పురస్కరించుకొని ఆ రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ధ్యాన్‌చంద్ కుమారుడు అశోక్ కుమార్ సహా 100 మంది మాజీ క్రీడాకారులు అప్పట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.