న్యూఢిల్లీ: అస్సాంకు చెందిన ప్రఖ్యాత సంగీ త కళాకారుడు దివంగత భూపేన్ హజారికాకు మోదీ సర్కారు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆయన కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులు, పార్శీలు, జైన్లు, క్రైస్తవులు మేఘాలయ, మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. ముస్లిమేతర వలసదారులైన వీరందరికీ భారతపౌరసత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కేంద్రం భారతపౌరసత్వ బిల్లు తెచ్చింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా భారతరత్నను తిరస్కరించాలని అమెరికాలో ఉంటున్న హజారికా కొడుకు తేజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇతర కుటుంబసభ్యుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పురస్కారాన్ని వెనక్కి ఇవ్వడమనేది పెద్ద విషయమని, కుటుంబసభ్యులు ఉమ్మడిగా నిర్ణయించాల్సిన వ్యవహారమని హజారికా సోదరుడు సమర్ వ్యాఖ్యానించారు. బిల్లును వ్యతిరేకిస్తూ, తనకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రముఖ మణిపూర్ దర్శకుడు అరిబం శ్యామ్ శర్మ ఇటీవల ప్రకటించారు. నిరసనలు ప్రధాని మోదీనీ తాకాయి. శనివారం అస్సాంలో ఎన్నికల ప్రచార సభకొచ్చిన మోదీకి స్థానికులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. అయినా, బిల్లును మోదీ సమర్థించారు. సామాజిక వేత్త నానాజీ దేశ్‌ముఖ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతోపాటు హజారికాకు భారతరత్న ఇవ్వనున్నట్లు గణతంత్రదినోత్సవంనాడు కేంద్రసర్కారు ప్రకటించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment