Bhupen Hazarika
-
62 ఏళ్లపాటు అలరించిన అమృత గానం ఆయనది
ట్రెండింగ్.. ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?. పైన హార్మోనియం వాయిస్తున్నట్లు ఓ చిత్రం కనిపించిందా?. ఆ చిత్రంలో ఉంది ఎవరో కాదు.. భారత దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసుడు.. భూపేన్ హజారికా. ఇవాళ ఆయన జయంతి. అందుకే గూగుల్ అలా డూడుల్‌తో గౌరవించింది. భూపేన్ హజారికా.. సుధాకాంత(కోకిల)గా పాపులర్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు. ఆరు దశాబ్దాలపాటు తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరించారాయన. వందల కొద్దీ పాటలు పాడి గాయకుడిగానే కాకుండా ఫిల్మ్‌మేకర్‌గా, రచయితగా కూడా సాహిత్య లోకానికి సేవలందించారు. మరోవైపు ఎమ్మెల్యేగానూ ఆయన రాజకీయ రంగంలో రాణించారు. అంతేనా.. నటుడిగా కూడా వందల చిత్రాల్లో అస్సామీ ఆడియెన్స్‌ను అలరించారు ఆయన. ఇద్దరూ గానకోకిలలే.. లతా మంగేష్కర్తో హజారికా (పాత చిత్రం) ► హజారికా.. సెప్టెంబర్ 8, 1926లో అస్సాంలో జన్మించారు. బ్రహ్మపుత్ర తీరం వెంట ఆయన బాల్యం గడిచింది. ఆ తీరం వెంటే జానపద కథలు, గేయాలు వినుకుంటూ పెరిగారాయన. విశేషం ఏంటంటే.. హజారికా తన పదేళ్ల వయసులోనే తొలి పాటను రికార్డ్ చేశారు. ► అస్సాంకు చెందిన ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాల ప్రోత్సాహంతో హజారికా రాటుదేలారు. ► 1946లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంఏ పూర్తి చేశారు. న్యూయార్క్‌లో కొంతకాలం జీవించిన ఆయన.. 1952 కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీహెచ్డీ అందుకున్నారు. ► హజారికా గాన ప్రస్థానం గువాహతి ఆల్ఇండియా రేడియో నుంచి మొదలైంది. బెంగాలీ పాటలను హిందీలోకి అనువదించి.. గాత్రం అందించారు. ► ఆయన అందించిన సాహిత్యం.. గాత్రంలో నవరసాలు పండేవి. ► రుడాలి, మిల్ గయి మాంజిల్ ముఝే, సాజ్, దార్మియారీ, గజగామిని, దామన్, క్యూన్ తదితర చిత్రాల్లో ఆయన పాడిన సూపర్ హిట్ సాంగ్స్ కల్ట్ క్లాసిక్‌గా మిగిలాయి. ► ఈశాన్య భారతం నుంచి.. అస్సాం జానపద సాహిత్యాన్ని యావత్ దేశానికి పరిచయం చేసింది ఈయనే. ► రాజకీయాల మీద ఆసక్తితో ఆయన అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు 1967లో పోటీ చేశారు. నౌబోయిచా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే.. తిరిగి 2004లోనూ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తరపు నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► సంగీతానికి, సంప్రదాయానికి ఆయన అందించిన సేవలకుగానూ.. సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ► 1998 నుంచి ఐదేళ్లపాటు సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా ఆయన పని చేశారు. ► 2011లో అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఐదు నెలలపాటు చికిత్స పొందుతూ.. చివరికి అవయవాల పని ఆగిపోవడంతో నవంబర్ 5వ తేదీన కన్నుమూశారు. అస్సాంకు గౌరవం తీసుకొచ్చిన ఆయన అంత్యక్రియలకు లక్షల మంది హాజరయ్యారు. ► మరణాంతరం.. 2012లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ► 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న గౌరవం ఆయనకు దక్కింది. ► అస్సామీ భాషలో మానవత్వం, సోదరభావం పెంపొందించేలా ఆయన పాటలు రాసి.. పాడారు. ► తన జీవితంలో తొలినాళ్లలో.. కోయిబర్టా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని సంగీత విద్వాంసుడిగా అంగీకరించని అగ్రవర్ణ కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన. అయితే ఈ చర్యకు బదులుగా.. ఆయన ప్రేమించిన బ్రహ్మణ యువతిని ఆయనకు దూరం చేశారు. చివరికి.. కుల-వ్యతిరేక సమాజంపై ఆయన ప్రతీకారం తీరింది. అదెలాగంటే.. ఓ బ్రహ్మణ యువతిని వివాహం చేసుకోవడం ద్వారానే!. ► ముంబైకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ రుతుజా మాలి, హజారికా 96వ జయంతి సందర్భంగా ఈ డూడుల్‌ను క్రియేట్ చేశారు. -
భారత రత్న పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్‌కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్ సింగ్‌కు రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో అందజేశారు. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు. ‘ప్రణబ్ దా’ అని సన్నిహితులు ప్రేమగా పిలుచుకునే ప్రణబ్ ముఖర్జీ.. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతి. కాంగ్రెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్ భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నానాజీ దేశ్‌ముఖ్‌కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా. -
భారతరత్న అందుకున్న ప్రణబ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం భారతరత్న పురస్కారాల ప్రదానోత్స కార్యక్రమం జరిగింది. 2019కి గాను దేశ అత్యున్నత పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాలకు ప్రకటించిన విషయం తెలిసిందే. నానాజీ, భూపేన్ హజారికాలకు కేంద్రం మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ రోజు జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భూపేన్ హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. -
కేంద్రంపై నిరసన.. భారతరత్న వెనక్కి?
న్యూఢిల్లీ: అస్సాంకు చెందిన ప్రఖ్యాత సంగీ త కళాకారుడు దివంగత భూపేన్ హజారికాకు మోదీ సర్కారు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆయన కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులు, పార్శీలు, జైన్లు, క్రైస్తవులు మేఘాలయ, మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. ముస్లిమేతర వలసదారులైన వీరందరికీ భారతపౌరసత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కేంద్రం భారతపౌరసత్వ బిల్లు తెచ్చింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా భారతరత్నను తిరస్కరించాలని అమెరికాలో ఉంటున్న హజారికా కొడుకు తేజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇతర కుటుంబసభ్యుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పురస్కారాన్ని వెనక్కి ఇవ్వడమనేది పెద్ద విషయమని, కుటుంబసభ్యులు ఉమ్మడిగా నిర్ణయించాల్సిన వ్యవహారమని హజారికా సోదరుడు సమర్ వ్యాఖ్యానించారు. బిల్లును వ్యతిరేకిస్తూ, తనకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రముఖ మణిపూర్ దర్శకుడు అరిబం శ్యామ్ శర్మ ఇటీవల ప్రకటించారు. నిరసనలు ప్రధాని మోదీనీ తాకాయి. శనివారం అస్సాంలో ఎన్నికల ప్రచార సభకొచ్చిన మోదీకి స్థానికులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. అయినా, బిల్లును మోదీ సమర్థించారు. సామాజిక వేత్త నానాజీ దేశ్‌ముఖ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతోపాటు హజారికాకు భారతరత్న ఇవ్వనున్నట్లు గణతంత్రదినోత్సవంనాడు కేంద్రసర్కారు ప్రకటించడం తెల్సిందే. -
భువిపై మెరిసిన రత్నం భూపేన్
‘‘భూమిని చీల్చుకుంటూ నేలంతా పరుచుకొని పారుతున్న నీకు, లక్షలాది ప్రజల హాహాకారాలు వినపడలేదా? నైతికతా, మానవతా ధ్వంసమైన చోట... చేష్టలుడిగి చూస్తున్నావా? నిర్లక్ష్యంగా, నిశ్శబ్దంగా, దారీతెన్నూలేకఎందుకా పరుగు నీకు గంగా’’ ‘‘వేనోళ్ళ ఘోషిస్తోన్న నీ చరితెక్కడ? సామాజిక అశాంతిపట్ల ఎందుకీ మౌనం’’ ... అని బ్రహ్మపుత్రానదిని నిలదీసిన కవి, గాయకుడు, సంగీత విజ్ఞానఖనీ, సామాజిక సేనాని వేరెవ్వరో కాదు గాన గంధర్వుడు భూపేన్ హజారికా. మిత్రులూ, సన్నిహి తులూ, అభిమానులూ, శ్రేయోభిలాషులూ భూపేన్‌దా అని ప్రేమగా పిలుచుకునే నాటి జనగాననిధీ, నేటి భారత రత్న భూపేన్ హజారికా ప్రశ్నలో సామాజిక బాధ్యత ఉంది. నదీనదాలను ప్రశ్నించడమే కాదు ప్రపంచ ప్రజల మనసులను తన గానామృత జలపాతంలో ముంచెత్తిన సంగీత సామ్రాజ్య రారాజు భూపేన్ దా. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే లక్షలాది ప్రజల గుండెల్లో ఒదిగిపోయిన భూపేన్ హజారికా జీవితంలో ఏ కోణాన్ని తడిమి చూసినా ప్రజలఘోషే పల్లవై పలుకుతుంది. ఆయనలోని సంగీతం, సామాజిక చైతన్యం అతడిని అరుదైన సంగీతోద్యమ సేనానిగా నిలిపాయి. గొప్ప మానవతావాది అయిన భూపేన్ హజారికా అస్సాంలోని సదియా గ్రామంలో 1926, సెప్టెంబర్ 8వ తేదీన నీలకంఠ హజారికా, శాంతి ప్రియ హజారికాలకు జన్మించారు. హజారికా తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అస్సాంలో షెడ్యూల్డ్ కులాలలో ఒకటైన కాయిబర్త కులానికి చెందినవాడు హజారికా. తండ్రి నీలకంఠ హజారికా ఆ ప్రాంతంలో సామాజిక ఉద్యమాలలో, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. దానితోపాటు భూపేన్‌దా తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశం ఉన్నవారే. ఆయన మేనమామకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది. భూపేన్‌దా తండ్రి 1929లోనే గౌహతిలోని బరాల్ ముఖ్ ప్రాంతానికి బదిలీ అయ్యారు. అక్కడి నుంచి 1935లో తేజ్‌పూర్‌కు వెళ్ళిన తర్వాత అక్కడ భూపేన్‌దా రాజకీయ ఓనమాలు దిద్దారు. ప్రముఖ నాటక రచయిత, కవి, అస్సాం ప్రప్రథమ సినీదర్శకులు జ్యోతిప్రసాద్ అగర్వాల్ పరిచయంతో పదేళ్ళ వయస్సులోనే 1936లో సెలోనా కంపెనీకి చెందిన అరోరా స్టూడియోలో భూపేన్‌దా పాడిన తొలి పాటను రికార్డు చేశారు. పన్నెండేళ్ళ వయస్సులోనే జ్యోతిప్రసాద్ అగర్వాల్ నిర్మించిన ‘ఇంద్రమాలతి’ సినిమాలో భూపేన్‌దా గొంతు నుంచి జాలు వారిన రెండు పాటలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. అది మొదలు 2011లో తుదిశ్వాస వీడేవరకూ ఆయన గాత్రమే ఊపిరిగా బతికారు. అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ లాంటి విభిన్నభాషల్లోని వేనవేల పాటల్లోకి ఆయన గొంతు తర్జుమా అయ్యింది. వైవిధ్యాన్ని ఆరాధించే ప్రతి సంగీత ప్రియుడి ఇంటా ఆయన గొంతు ప్రతిధ్వనించింది. పాటే ప్రాణంగా బతికిన అలాంటి గొప్ప సంగీత స్వాప్నికుడిని ఇంటర్వూ్య చేసే మహావకాశం ఒక జర్నలిస్టుగా నాకు దక్కింది. 1994 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి ఆయన జ్యూరీ మెంబర్‌గా వచ్చారు. హజారికా బాల్యం, యవ్వనం, జీవితం అంతా కవిత్వం, గాత్రంతో నిండి ఉంటాయి. తల్లిదండ్రులే తనకు తొలి స్ఫూర్తి అంటారు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న సమాజం నుంచి చాలా నేర్చుకున్నానని స్వయంగా చెపుతారు. బడికెళ్ళి రాగానే ప్రతి రోజూ సాయంకాలం ఇంటి దగ్గర ఉండే లారీ డ్రైవర్లతో కూర్చొని వాళ్ళు పాడే పాటలు, వారి టేప్ రికార్డర్లలో పెట్టుకునే పాటలు వింటూ గడపడం భూపేన్ దా దినచర్యలో భాగమైంది. భూపేన్ దా జీవితంలో మరో ముఖ్యమైన మలుపు బిష్ణురఖాను కలుసుకోవడం. బిష్ణురఖా సోషలిస్టు రాజకీయాలు కలిగిన కవి, గాయకుడు. పేదలు, శ్రామికులు, పీడితుల గురించి బిష్ణురఖా పాడేపాటలు భూపేన్ దా సైద్ధాంతిక దృక్పథానికి బాటలు వేశాయి. అదేవిధంగా తనను గాయకుడిగా సినీరంగానికి పరిచయం చేసిన జ్యోతి ప్రసాద్ అగర్వాల్ నుంచే హజారికాకు మార్క్సిస్టు సిద్ధాంతంతో పరిచయమైంది. భూపేన్‌దా తల్లిదండ్రులకు తమ కొడుకు జర్నలిస్టు కావాలని ఉండేది. కానీ ఆయన ప్రపంచం సంగీతమే. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు కలకత్తాలో బీఏ డిగ్రీ, బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాను సాధించారు. చాలా కొద్దికాలం గౌహతీలోని రేడియో కేంద్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్కాలర్షిప్ రావడంతో జర్నలిజంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి 1949 లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. ఆయన కొలంబియాలో చదువుతున్న సమయంలో నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమం ఉధృతంగా సాగు తోంది. ఆ ఉద్యమంలో నల్లజాతి గాయకుడు పాల్ రాబ్సన్ ఒక ధిక్కార స్వరం. భూపేన్ హజారికాను పాల్ రాబ్సన్ సంగీతం, పాటలు అమి తంగా ఆకర్షించాయి. దీంతో నల్లజాతి ప్రజా ఉద్యమంలో హజారికా కూడా భాగమయ్యారు. పాల్ రాబ్సన్ ప్రదర్శనల మీద అమెరికా పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండేది. చాలాసార్లు పాల్రాబ్సన్తో పాటు, ప్రదర్శనలను చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా అరెస్టు చేసేవాళ్ళు. అదే సందర్భంలో భూపేన్ హజారికా కూడా రెండు సార్లు అరెస్టయ్యారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. ఆమే స్వయంగా జోక్యం చేసుకొని భూపేన్ హజారికాను విడుదల చేయించినట్టు, భూపేన్ స్వయంగా నాతో ఇంటర్వూ్యలో చెప్పారు. ఆ తరువాత కూడా ఆయన తన విప్లవ రాజకీయాల నుంచి వెనుదిరగలేదు. భారతదేశంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించారు. 1953వ సంవ త్సరంలో అమెరికా నుంచి భారత దేశానికి తిరిగిరాగానే ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న భారత ప్రజానాట్య మండలి (ఇఫ్టా)తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. 1955లో గౌహతీలో జరిగిన ఇఫ్టా అఖిల అస్సాం మూడవ మహాసభలకు ఆహ్వన సంఘం కార్యదర్శిగా పనిచేశారు. అస్సాంలో.. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల పర్వతాలు, అడవులు, నదులు, సముద్రం ఆయన పాటల్లో ప్రతిధ్వనించేవి. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికుల దయనీయ స్థితిని ప్రతిబింబిస్తూ తాను రాసిన ‘‘ఏక్ కలి దో పత్తియా’’ అనే పాట ఆయన్ను శ్రామికజనపక్షపాతిగా నిలబెట్టాయి. పల్లకీలు మోసే బోయీలపై రాసిన ‘‘డోల.. హో.. డోల’’ పాట వారి చెమట చుక్కల విలువను ఇనుమడిస్తుంది. ఇలా ఆయన రాసి, పాడిన ప్రతి పాటా జనప్రియమై, ప్రజల నీరాజనాలందుకుంది. కవిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినిమా దర్శకుడిగా పదుల సినిమాల నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ బిరుదులను సొంతం చేసుకున్న భూపేన్దాకి మర ణానంతరం 2019లో భారత రత్న అవార్డునిచ్చారు. ప్రపంచ ప్రజల మదిలో తనదైన స్థానం సంపాదించుకున్న భూపేన్ దా నిగర్వి. 1994లో నేను ఇంటర్వూ్య చేసిన సందర్భంలో ఎ.ఆర్.రెహమాన్‌పై మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. ఎ.ఆర్.రెహమాన్ కృషిని ఆయన ప్రశంసిస్తూనే, శాస్త్రీయ సంగీతంతోనే సంతృప్తి పడకుండా, ప్రజల నాలుకల మీద నాట్యమాడే సంగీత ఝరులను ఒడిసిపట్టుకోగలిగితే రెహమాన్ మంచి సంగీత దర్శకుడవుతాడని చెప్పారు. భూపేన్ హజారికా జీవితంలో మరొక ముఖ్యమైన ఘట్టం ప్రముఖ చలనచిత్ర దర్శకురాలు, రచయిత కల్పనా లజ్మితో పరిచయం. 1980 ప్రారంభంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన తుదిశ్వాస విడిచే వరకూ ఇద్దరూ మంచి మిత్రులుగా కొనసాగారు. వీరిద్దరూ 1986లో ‘ఏక్ ఫల్’’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం అందించారు. ఈ ఇరువురి కాంబినేషన్లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. సినీ ప్రపంచంలో తమదైన ముద్రవేసారు. కల్పనా లజ్మి, భూపేన్ దా కలిసే జీవించారు. కలిసే స్వప్నించారు. ఆ ఇద్దరి కలల కొనసాగింపుగా వచ్చిందే ‘రుడాలి’ సినిమా. అదే భారతదేశ చలన చిత్ర రంగంలో సంచలనం రేపింది. మాధురీ దీక్షిత్ నటించిన ‘దామిని’ సినిమా కూడా వేనోళ్ళ కొనియాడబడింది. వీరిద్దరి సహజీవనం మీద ఎన్నో పుకార్లు వచ్చాయి. ఎన్నెన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా కల్పనా లజ్మీ, భూపేన్లు ఒకరికోసం ఒకరన్నట్టుగా బతికారు. రాజకీయంగా భూపేన్ దా నిర్వహించిన పాత్ర మరువలేనిది. 1967–72 మధ్యలో అస్సాం శాసన సభలో ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అనేక ఉద్యమాలతో భూపేన్ దాకు సత్సంబంధాలుండేవి. ఈశాన్య రాష్ట్రాలను ఢిల్లీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే వాదనను భూపేన్ అవకాశం వచ్చినప్పుడల్లా వినిపించారు. సాయుధ తిరుగుబాట్లను ప్రత్యక్షంగా సమ ర్థించకపోయినా, అటువంటి పరిణామాలకు ప్రభుత్వాలదే బాధ్యతని తేల్చి చెప్పిన ధీశాలి. అస్సాంలో అస్సాం గణపరిషత్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన నిరసన గళాన్ని విడువలేదు. ఆ ప్రభుత్వం కూడా అస్సాం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని బహిరంగంగా చెప్పారు. నవంబర్ 5, 2011న కన్నుమూసిన భూపేన్‌దాకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నివాళి అర్పించారు. గౌహతిలో నవంబర్ 9వ తేదీన జరిగిన అంత్యక్రియల్లో దాదాపు 5 లక్షల మంది పాల్గొనడం ‘భారతరత్న’ కంటే చాలా ముందు సంగీత సామ్రాజ్యాధిపతికి భారత ప్రజలిచ్చిన ఘనమైన నివాళి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
భూపేన్ హజారికాపై వ్యాఖ్యలకు ఖర్గేపై కేసు
మోరిగావ్: అస్సాంకు చెందిన దివంగత గాయకుడు భూపేన్ హజారికాపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. భూపేన్ హజారికాకు కేంద్రం ఇటీవలే భారత రత్న ప్రకటించగా, ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సేవకుడు శివకుమార స్వామికి భారత రత్న ఇవ్వకుండా ఓ గాయకుడికి (హజారికా), ఆరెస్సెస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన వ్యక్తి (నానాజీ దేశ్‌ముఖ్)కు అవార్డు ఇచ్చారని ఖర్గే విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో అస్సాం ప్రజల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. -
భారత రత్నాలు
-
ప్రణబ్‌దా భారతరత్న
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు నాలుగేళ్ల తరువాత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. ప్రణబ్ ముఖర్జీ 2012–17 మధ్య కాలంలో భారత 13వ రాష్ట్రపతిగా పనిచేయగా, దేశ్‌ముఖ్, హజారికాలు మరణానంతరం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్ ముఖర్జీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో దేశ్‌ముఖ్ ఒకరు కాగా, ఈశాన్య భారత్ నుంచి సినీరంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖుల్లో హజారికా ఒకరు. దేశ ప్రజలకు తాను చేసిన దానికన్నా ప్రజలే తనకు ఎక్కువిచ్చారని ప్రణబ్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ‘ నాకిచ్చిన ఈ గొప్ప గౌరవాన్ని దేశ ప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతా భావం, విధేయతతో స్వీకరిస్తున్నా. నేను ఎప్పటికీ చెప్పేదాన్నే మళ్లీ చెబుతున్నా. ఈ గొప్ప దేశ ప్రజలకు నేను చేసిన దానికన్నా నాకే వారు ఎక్కువిచ్చారు’ అని ట్వీట్ చేశారు. చివరగా 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణబ్, దేశ్‌ముఖ్, హజారికాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి మార్గంపై చెరగని ముద్ర: మోదీ ప్రణబ్ ముఖర్జీ, దేశ్‌ముఖ్, హజారికాల సేవల్ని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్లు చేశారు. దశాబ్దాల పాటు నిస్వార్థంగా ప్రజాసేవచేసిన ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞుల్లో గొప్పవారని, దేశ అభివృద్ధి మార్గంపై ఆయన చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ‘ప్రణబ్‌దాకు భారతరత్న రావడం పట్ల సంతోషంగా ఉంది. ఆయన తెలివి, ప్రజ్ఞకు సాటిగా నిలిచేవారు కొందరే ఉన్నారు’ అని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో విశేష కృషిచేసిన దేశ్‌ముఖ్..గ్రామీణుల సాధికారతా విషయంలో గొప్ప మార్పులకు నాందిపలికారని కొనియాడారు. ‘అణగారిన, వెనకబడిన వర్గాల పట్ల కరుణ, విధేయత కనబరచిన దేశ్‌ముఖ్ నిజమైన భారతరత్న’ అని పేర్కొన్నారు. ఇక హజారికా సేవల్ని ప్రశంసిస్తూ ఆయన గేయాలు తరాలకు అతీతంగా గౌరవం పొందాయని అన్నారు. ‘హజారికా పాటలు న్యాయం, సమైక్యత, సోదరభావం అనే సందేశాలిస్తాయి. భారత సంగీత సంప్రదాయాల్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారు. భూపేన్ హజారికాకు భారతరత్న దక్కడం ఆనందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రజాసేవ చేసిన తమలో ఒకరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం పట్ల కాంగ్రెస్ గర్విస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హజారికా, దేశ్‌ముఖ్‌లకు కూడా ఈ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి సరసన ప్రణబ్.. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2010లో మరణించే వరకు దేశ్‌ముఖ్ ఆరెస్సెస్‌తో సంబంధాలు కొనసాగించారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకల్పనలో, 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. రుద్రాలీ, దార్మియాన్, గాజాగామిని, డామన్ లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు అస్సాం సినిమాలకు హజారికా సంగీతం సమకూర్చారు. బెంగాల్ నుంచి ప్రణబ్‌కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. భారతరత్న పొందిన ప్రణబ్ ముఖర్జీకి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచిన ప్రణబ్ భారతరత్నకు ఎంపికవడం బెంగాల్ ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి అన్నారు. అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎంలు కూడా ప్రణబ్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయన ఈ దేశానికి గొప్ప పుత్రుడు మాత్రమే కాదని, గొప్ప మానవతావాది కూడా అని తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు. సమాజ సేవకుడిగా.. నానాజీ దేశ్‌ముఖ్.. సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన, బలహీన వర్గాల ఉద్ధరణకు నడుంబిగించి.. ఆ దిశగా గణనీయమైన మార్పును తీసుకొచ్చారు. గ్రామీణ స్వరాజ్యంతోపాటు దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో మార్పులకోసం తీవ్రంగా శ్రమించారు. 1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నానాజీ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్ అమృత్‌రావ్ దేశ్‌ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్‌గా జీవితాన్ని ప్రారంభించారు. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించి వచ్చే డబ్బులతో చదువుకున్నారు. బాలా గంగాధర్ తిలక్ స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. బిర్లా కాలేజీ (నేటి బిట్స్)లో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జన్‌సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. ఆ తర్వాత బీజేపీలోనూ కీలక నేతగా బాధ్యతలు నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికీ రావొద్దని భావించి.. పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషిచేశారు. దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ఆయన ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించి.. చాలా ఏళ్లపాటు తనే సొంతగా నిర్వహించారు. పుట్టింది మహారాష్ట్రలోనైనా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోనే నానాజీ విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. 1977లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్చేసింది. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో నానాజీ కూడా ఒకరు. 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు. బ్రహ్మపుత్ర కవి.. సుధాకాంత భూపేన్ హజారికా నేపథ్యమిదీ.. ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారికా..బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీ, హిందీలోకి తర్జుమా అయ్యాయి. అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో ఆయన పాటలకు విపరీత ఆదరణ లభించింది. తన గాత్రంతో కొన్ని తరాలను ఉర్రూతలూగించారు. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి. 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో హజారికా జన్మించారు. పది మంది సంతానంలో పెద్దవాడైన హజారికా బాల్యం నుంచే తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. పదేళ్ల వయసులో ఓ కార్యక్రమంలో అస్సామీ భక్తి గీతాలు ఆలపిస్తుండగా ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాలా, సినీ దర్శకుడు విష్ణుప్రసాద్ రాభా దృష్టిలో పడ్డారు. తరువాత 1939లో అగర్వాలా సినిమాలో రెండు పాటలు పాడారు. 13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. 1946లో బెనారస్ హిందూ వర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన హజారికా కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. ఆ తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఉపకారవేతనం లభించడంతో 1949లో న్యూయార్క్ వెళ్లారు. అక్కడ ప్రముఖ హక్కుల కార్యకర్త పాల్ రాబ్సన్తో ఏర్పడిన పరిచయం ఆయన జీవితంపై చాలా ప్రభావం చూపింది. కొలంబియా యూనివర్సిటీలోనే తనకు పరిచయమైన ప్రియంవదా పటేల్‌ను 1950లో వివాహమాడారు. 1953లో స్వదేశం తిరిగొచ్చారు. 1967–72 మధ్యలో అసోం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో బీజేపీ తరఫున గువాహటి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1998–2003 వరకు సంగీత నాటక అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరించారు. 2011 నవంబర్ 5న ముంబైలో కన్నుమూశారు. బ్రహ్మపుత్ర తీరంలో జరిగిన ఆయన అంత్యక్రియలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు. -
ఆఖరి కోరిక తీరకుండానే కల్పనా లాజ్మి..
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి నుంచి పుట్టే కళలు, మనిషిని అనుకరిస్తాయా? లేదా కళలనే మనిషి అనుకరిస్తాడా? అనే తాత్విక చర్చ ఎప్పటికీ ముగియనప్పటికీ, ఇటు కళలను, జీవితాన్ని వేరు చేయకుండా జీవించిన కల్పనా లాజ్మి జీవితం ఆదివారం నాడు ముగిసిన విషయం తెల్సిందే. ఆమె తీసిన సినిమాల్లోని స్త్రీ పాత్రల్లా ఆమె జీవితం కూడా వివాదాస్పదంగానే గడిచింది. 17 ఏళ్ల వయస్సులోనే 28 ఏళ్ల వయస్సు కలిగిన ప్రముఖ అస్సాం జానపద గాయకుడు భూపేన్ హజారికాతో ఆమె జీవితాన్ని పంచుకున్నారు. భార్యను, పుత్రుడిని దూరం చేసుకున్న హజారికాకు జీవితాంతం అంటే, 2011, నవంబర్‌లో ఆయన మరణించే వరకు ఆయనతో ఉన్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. భూపేన్ హజారికాను ‘పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే’ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులతోపాటు సంగీత్ నాటక్ ఫెల్లోషిప్ అవార్డుతో ఈ సమాజం సత్కరించింది. అదే ఆయనతోనే జీవితాన్ని పంచుకున్న కల్పనా లాజ్మికి మాత్రం విమర్శలను, ఛీత్కారాలనే ఇచ్చింది. 2006లో ఛింగారి చిత్రంతో తెరమరుగైన కల్పనా లాజ్మి సినిమా స్క్రిప్టు రైటర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా ఎంతో రాణించినప్పటికీ ఆమెకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. అయితే ఆమె తీసిన రుడాలి (1993)లో డింపుల్ కపాడియా, దమన్ (2001)లో రవీనా టాండన్‌లకు జాతీయ ఉత్తమ నటి అవార్డులు లభించాయి. లాజ్మి తీసిన తొలి చిత్రం ఏక్ ఫల్ (1986) కమర్శియల్‌గా హిట్టవడమే కాకుండా దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఏక్ ఫల్‌కు, రుడాలికి సంగీత దర్శకత్వం వహించిన హజారికాకు ఆమెకన్నా ఎక్కువ పేరు వచ్చింది. ఆమె ఆఖరి సినిమా ఛింగారి సినిమా హిట్ కాలేదు. పేరూ తేలేదు. ఓ మాతృమూర్తిగా జీవితంలో మహిళలుపడే కష్టాలే ప్రధాన ఇతివృత్తంగా ఆమె సినిమాలు సాగుతాయి. సమాజంలోని నిజమైన పాత్రలే ఆమె సినిమాల్లో ప్రతిబింబించాయి. కిడ్నీ క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైనందుకు లాజ్మి ఏనాడు బాధ పడలేదు. అయితే తన ఆఖరి కోరిక తీరడం లేదనే ఆమె ఎక్కువ బాధ పడ్డారు. భూపేన్ హజారికా మరణించిన నాటి నుంచి ఆయన జీవితంపై బయోపిక్ సినిమాను నిర్మించడమే ఆమె ఆకరి కల. ఎంతో కష్టపడి స్క్రిప్టు కూడా రాసుకున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి ఆమె అనారోగ్యం సహకరించలేదు. త్వరలో కోలుకొని ఏనాటికైనా బయోపిక్ తీస్తానన్న నమ్మకంతోనే ఆమె ఎంతోకాలం బతికారు. ఇక అది సాధ్యం కాదని గ్రహించారేమో! ‘భూపేన్ హజారికా: యాజ్ ఐ నో హిమ్’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చారు. ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 8వ తేదీన ముంబైలో కల్పనా లాజ్మి తల్లి లలితా లాజ్మి, దగ్గరి బంధువు శ్యామ్ బెనగల్, పలువురు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తు ఆమె ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారు. -
భూపేన్.. నవాజుద్దీన్
సుప్రసిద్ధ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా జీవితాన్ని ఆయన సన్నిహితురాలు, బాలీవుడ్ దర్శకురాలు కల్పనా లాజ్మీ తెరకెక్కించనుంది. ఈ చిత్రంలో హజారికా పాత్ర కోసం ఆమె నవాజుద్దీన్ సిద్ధికీని సంప్రదించినట్లు సమాచారం. సిద్ధికీ ప్రస్తుతం స్క్రిప్టు చదవడంలో బిజీగా ఉంటే, లాజ్మీ స్క్రీన్‌ప్లే రూపకల్పనలో తలమునకలుగా ఉన్నారు.ఇందులో లాజ్మీ పాత్రను బెంగాలీ భామ శర్వాణీ ముఖర్జీ పోషించనుంది. -
గంగమ్మకు సుస్తీ!
సంపాదకీయం: ‘ఈ దేశంలో ఇన్ని అన్యాయాలూ, దుర్మార్గాలూ చోటుచేసుకుంటుంటే ఇంకా ఎలా ప్రవహించగలుగుతున్నావ్ తల్లీ’ అని గంగానదిని ఉద్దేశించి అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా ఒక గీతంలో ప్రశ్నిస్తాడు. మనుషుల్లో నిలువెల్లా పెరిగిన స్వార్థం, దుండగం, దుర్మార్గం ఆ నది పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ దేశ సంప్రదాయంలో, విశ్వాసంలో వేల ఏళ్లుగా పెనవేసుకుపోయిన ఆ నదీమతల్లి దుర్భర కాలుష్య కాసారంగా మారుతున్నదన్న హెచ్చరికలు చాన్నాళ్లక్రితమే వినిపించాయి. ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన న్యూ కేజిల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఐఐటీ నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఆ నదీ జలాలు అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవులకు నిలయంగా మారాయని తేలింది. ఏడు ప్రాంతాల్లో గంగా జలాలను, అక్కడి మట్టిని సేకరించిన నిపుణులు వాటిల్లో ప్రాణాంతకమైన ఎన్డీఎం-1 వైరస్ ఉన్నదని తేల్చారు. మే, జూన్ మాసాల్లో రిషికేశ్, హరిద్వార్‌లను లక్షలాదిమంది భక్తులు సందర్శించినప్పుడు మిగిలిన సమయాల్లోకంటే ప్రమాదకర వైరస్ల జాడ 60 రెట్లు ఎక్కువగా ఉన్నదని వారు నిర్ధారించారు. గంగానది హిమవన్నగాల్లో పుట్టి అయిదు రాష్ట్రాల్లోని 29 నగరాలను, ఇతర జనావాస ప్రాంతాలనూ ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. దాదాపు 2,500 కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళా ఖాతం చేరే ఈ నదికి తీరం పొడవునా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఎన్నో! ఇవికాక ఢిల్లీ, ఘజియాబాద్వంటి ప్రాంతాలు నిత్యమూ విడుదలచేసే మురుగు నీరు యమునా నదిని ముంచెత్తుతుంటే అదంతా చివరకు కలిసేది గంగలోనే. గంగా కార్యాచరణ పథకం పేరుతో కోట్లాది రూపాయలు వ్యయంచేసి అమలుచేసిన పథకం ఈ కాలుష్యాన్ని ఆవగింజంత కూడా తొలగించలేకపోయింది. గంగా నదీ పరీవాహ ప్రాంతంలోని పలు నగరాల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ దహనవాటికలు, మరుగుదొడ్లు నిర్మించాలని తలపెట్టారు. పరిశ్రమలను సైతం కాలుష్యశుద్ధి యంత్రాలను సమకూర్చుకునేలా చూడాలని అనుకున్నారు. కానీ, ఆచరణలోకొచ్చేసరికి అంతా అటకెక్కింది. నిధులన్నీ ఎటుపోయాయోగానీ కాలుష్యం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇక వేలాది ఆస్పత్రులు నిత్యం రోగులకు వాడే సిరంజ్‌లు, బ్యాండేజ్లన్నీ అందులోనే కలుస్తాయి. ఈ కారణాలన్నిటివల్లా గంగా తీరప్రాంతంలోని గ్రామాల ప్రజల్లో కాన్సర్‌వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి సర్వే చెప్పింది. గంగా పరీవాహక ప్రాంత పర్యావరణ ప్రణాళిక పేరుతో బొంబాయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖర్గపూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీల సంయుక్త సహకారంతో రూపొందించిన కన్సార్షియం పట్టణప్రాంత మురుగు నీటినుంచి గంగానదీ జలాల రక్షణకు ఈమధ్యే ఒక అధ్యయనం చేసింది. నదీ తీరంలో ఉండే వస్త్ర పరిశ్రమలు, రంగుల పరిశ్రమలు, చర్మకార పరిశ్రమలు తమ వ్యర్థాలను శుద్ధిచేయకుండానే గంగలో విడుస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. క్షాళన చేయడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చుకోవడం ఖర్చుతో కూడుకున్న పనిగా భావించి పరిశ్రమలు ఊరుకుంటుంటే స్థానిక సంస్థలు, కాలుష్య నివారణ సంస్థవంటి ప్రభుత్వ సంస్థలు చూసీచూడనట్టు వదిలేస్తున్నాయని అధ్యయనం వేలెత్తిచూపింది. పరిశ్రమాధిపతులకుండే రాజకీయ సంబంధాలవల్ల ప్రభుత్వాలు సైతం కఠినమైన విధానాలను రూపొందించలేకపోతున్నాయని తెలిపింది. ఇవన్నీ కలసి గంగానదిని కాలకూట విషంగా మారుస్తున్నాయని వివరించింది. చివరకు భూగర్భ జలాలు కూడా కాలుష్యభరితమవుతున్నాయి. జీవజలాలుగా ఉండాల్సినవి ఇలా ప్రాణాంతక జలాలుగా పరిణమించడానికి తమ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని పాలకులింకా గుర్తించడంలేదు. ప్రమాదకర సూక్ష్మక్రిములు, వాటి జన్యువులు ఇప్పటికే చాలామంది పేగుల్లో చొరబడ్డాయని న్యూకేజిల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఐఐటీ తాజా అధ్యయనంలో తేలిన అంశం. ఇది స్థానికంగా ఉండే సమస్యని కొట్టిపారేయడానికి వీల్లేదు. కుంభమేళా వంటి సందర్భాల్లో దేశ, విదేశాలనుంచి వచ్చిన లక్షలమంది భక్తులు వచ్చినప్పుడు ప్రమాదకర సూక్ష్మక్రిములు గాలిద్వారా, నీటిద్వారా అత్యంత వేగంగా ఒకరినుంచి ఒకరికి పాకుతాయి. వారిద్వారా నలుమూలలకూ విస్తరిస్తాయి. వ్యాధులు సోకినప్పుడు వాడే యాంటీబయాటిక్స్‌తో మనుషుల్లో ఉండే వైరస్లు, బ్యాక్టీరియాలు వాటిని తట్టుకునే శక్తిని సంతరించుకుంటున్నాయి. ఫలితంగా ఏ ఔషధానికీ లొంగని కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా, ఫలితంగా కొత్త ఔషధాలు ఎన్ని తయారవుతున్నా ఈ వ్యాధుల ముందు బలాదూరవుతున్నాయి. తమ నిరంతర గమనంతో ప్రవహించినంతమేరా పచ్చదనాన్ని పరుస్తున్న నదులు చివరకు మనిషి దురాశ కారణంగా ఇలా ప్రాణాంతకంగా మారుతున్నాయి. పాలనా వ్యవస్థ చేష్టలుడిగి చూస్తున్న తీరువల్ల సాంకేతిక నిపుణుల అధ్యయనాలు, కోట్లాది రూపాయలతో అమలుచేస్తున్న ప్రణాళికలు వ్యర్థమైపోతున్నాయి. గంగమ్మ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ స్వామి నిగమానంద సరస్వతి మూడేళ్లక్రితం ఇదే నెలలో ఆమరణ దీక్ష ప్రారంభించి తనువుచాలించారు. ఇప్పుడు వెలుగుచూసిన తాజా నివేదిక అయినా పాలకుల కళ్లు తెరిపించాలి. నిత్యం స్మరించుకునే నదులే ఇలా కాలుష్యకాసారాలు కావడమంటే దేశంపట్లా, జాతిపట్లా చేస్తున్న అపచారమని, ద్రోహమని వారు తెలుసుకోవాలి. పటిష్టమైన విధానాలను రూపొందించి, అన్ని స్థాయిల్లోనూ జవాబుదారీతనాన్ని నిర్ధారించి కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ ఉత్పాతాన్ని ఆపడం సాధ్యంకాదని గుర్తించాలి.