సంపాదకీయం: ‘ఈ దేశంలో ఇన్ని అన్యాయాలూ, దుర్మార్గాలూ చోటుచేసుకుంటుంటే ఇంకా ఎలా ప్రవహించగలుగుతున్నావ్ తల్లీ’ అని గంగానదిని ఉద్దేశించి అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా ఒక గీతంలో ప్రశ్నిస్తాడు. మనుషుల్లో నిలువెల్లా పెరిగిన స్వార్థం, దుండగం, దుర్మార్గం ఆ నది పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ దేశ సంప్రదాయంలో, విశ్వాసంలో వేల ఏళ్లుగా పెనవేసుకుపోయిన ఆ నదీమతల్లి దుర్భర కాలుష్య కాసారంగా మారుతున్నదన్న హెచ్చరికలు చాన్నాళ్లక్రితమే వినిపించాయి. ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన న్యూ కేజిల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఐఐటీ నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఆ నదీ జలాలు అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవులకు నిలయంగా మారాయని తేలింది. ఏడు ప్రాంతాల్లో గంగా జలాలను, అక్కడి మట్టిని సేకరించిన నిపుణులు వాటిల్లో ప్రాణాంతకమైన ఎన్‌డీఎం-1 వైరస్ ఉన్నదని తేల్చారు. మే, జూన్ మాసాల్లో రిషికేశ్, హరిద్వార్‌లను లక్షలాదిమంది భక్తులు సందర్శించినప్పుడు మిగిలిన సమయాల్లోకంటే ప్రమాదకర వైరస్‌ల జాడ 60 రెట్లు ఎక్కువగా ఉన్నదని వారు నిర్ధారించారు.
గంగానది హిమవన్నగాల్లో పుట్టి అయిదు రాష్ట్రాల్లోని 29 నగరాలను, ఇతర జనావాస ప్రాంతాలనూ ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. దాదాపు 2,500 కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళా ఖాతం చేరే ఈ నదికి తీరం పొడవునా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఎన్నో! ఇవికాక ఢిల్లీ, ఘజియాబాద్‌వంటి ప్రాంతాలు నిత్యమూ విడుదలచేసే మురుగు నీరు యమునా నదిని ముంచెత్తుతుంటే అదంతా చివరకు కలిసేది గంగలోనే. గంగా కార్యాచరణ పథకం పేరుతో కోట్లాది రూపాయలు వ్యయంచేసి అమలుచేసిన పథకం ఈ కాలుష్యాన్ని ఆవగింజంత కూడా తొలగించలేకపోయింది.
గంగా నదీ పరీవాహ ప్రాంతంలోని పలు నగరాల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ దహనవాటికలు, మరుగుదొడ్లు నిర్మించాలని తలపెట్టారు. పరిశ్రమలను సైతం కాలుష్యశుద్ధి యంత్రాలను సమకూర్చుకునేలా చూడాలని అనుకున్నారు. కానీ, ఆచరణలోకొచ్చేసరికి అంతా అటకెక్కింది. నిధులన్నీ ఎటుపోయాయోగానీ కాలుష్యం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇక వేలాది ఆస్పత్రులు నిత్యం రోగులకు వాడే సిరంజ్‌లు, బ్యాండేజ్‌లన్నీ అందులోనే కలుస్తాయి. ఈ కారణాలన్నిటివల్లా గంగా తీరప్రాంతంలోని గ్రామాల ప్రజల్లో కాన్సర్‌వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి సర్వే చెప్పింది.
గంగా పరీవాహక ప్రాంత పర్యావరణ ప్రణాళిక పేరుతో బొంబాయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖర్గపూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీల సంయుక్త సహకారంతో రూపొందించిన కన్సార్షియం పట్టణప్రాంత మురుగు నీటినుంచి గంగానదీ జలాల రక్షణకు ఈమధ్యే ఒక అధ్యయనం చేసింది. నదీ తీరంలో ఉండే వస్త్ర పరిశ్రమలు, రంగుల పరిశ్రమలు, చర్మకార పరిశ్రమలు తమ వ్యర్థాలను శుద్ధిచేయకుండానే గంగలో విడుస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. క్షాళన చేయడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చుకోవడం ఖర్చుతో కూడుకున్న పనిగా భావించి పరిశ్రమలు ఊరుకుంటుంటే స్థానిక సంస్థలు, కాలుష్య నివారణ సంస్థవంటి ప్రభుత్వ సంస్థలు చూసీచూడనట్టు వదిలేస్తున్నాయని అధ్యయనం వేలెత్తిచూపింది. పరిశ్రమాధిపతులకుండే రాజకీయ సంబంధాలవల్ల ప్రభుత్వాలు సైతం కఠినమైన విధానాలను రూపొందించలేకపోతున్నాయని తెలిపింది. ఇవన్నీ కలసి గంగానదిని కాలకూట విషంగా మారుస్తున్నాయని వివరించింది. చివరకు భూగర్భ జలాలు కూడా కాలుష్యభరితమవుతున్నాయి. జీవజలాలుగా ఉండాల్సినవి ఇలా ప్రాణాంతక జలాలుగా పరిణమించడానికి తమ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని పాలకులింకా గుర్తించడంలేదు.
ప్రమాదకర సూక్ష్మక్రిములు, వాటి జన్యువులు ఇప్పటికే చాలామంది పేగుల్లో చొరబడ్డాయని న్యూకేజిల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఐఐటీ తాజా అధ్యయనంలో తేలిన అంశం. ఇది స్థానికంగా ఉండే సమస్యని కొట్టిపారేయడానికి వీల్లేదు. కుంభమేళా వంటి సందర్భాల్లో దేశ, విదేశాలనుంచి వచ్చిన లక్షలమంది భక్తులు వచ్చినప్పుడు ప్రమాదకర సూక్ష్మక్రిములు గాలిద్వారా, నీటిద్వారా అత్యంత వేగంగా ఒకరినుంచి ఒకరికి పాకుతాయి. వారిద్వారా నలుమూలలకూ విస్తరిస్తాయి. వ్యాధులు సోకినప్పుడు వాడే యాంటీబయాటిక్స్‌తో మనుషుల్లో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియాలు వాటిని తట్టుకునే శక్తిని సంతరించుకుంటున్నాయి. ఫలితంగా ఏ ఔషధానికీ లొంగని కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా, ఫలితంగా కొత్త ఔషధాలు ఎన్ని తయారవుతున్నా ఈ వ్యాధుల ముందు బలాదూరవుతున్నాయి. తమ నిరంతర గమనంతో ప్రవహించినంతమేరా పచ్చదనాన్ని పరుస్తున్న నదులు చివరకు మనిషి దురాశ కారణంగా ఇలా ప్రాణాంతకంగా మారుతున్నాయి. పాలనా వ్యవస్థ చేష్టలుడిగి చూస్తున్న తీరువల్ల సాంకేతిక నిపుణుల అధ్యయనాలు, కోట్లాది రూపాయలతో అమలుచేస్తున్న ప్రణాళికలు వ్యర్థమైపోతున్నాయి.
గంగమ్మ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ స్వామి నిగమానంద సరస్వతి మూడేళ్లక్రితం ఇదే నెలలో ఆమరణ దీక్ష ప్రారంభించి తనువుచాలించారు. ఇప్పుడు వెలుగుచూసిన తాజా నివేదిక అయినా పాలకుల కళ్లు తెరిపించాలి. నిత్యం స్మరించుకునే నదులే ఇలా కాలుష్యకాసారాలు కావడమంటే దేశంపట్లా, జాతిపట్లా చేస్తున్న అపచారమని, ద్రోహమని వారు తెలుసుకోవాలి. పటిష్టమైన విధానాలను రూపొందించి, అన్ని స్థాయిల్లోనూ జవాబుదారీతనాన్ని నిర్ధారించి కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ ఉత్పాతాన్ని ఆపడం సాధ్యంకాదని గుర్తించాలి.
గంగమ్మకు సుస్తీ!
Published Thu, Feb 20 2014 2:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement