సాక్షి, న్యూఢిల్లీ : మనిషి నుంచి పుట్టే కళలు, మనిషిని అనుకరిస్తాయా? లేదా కళలనే మనిషి అనుకరిస్తాడా? అనే తాత్విక చర్చ ఎప్పటికీ ముగియనప్పటికీ, ఇటు కళలను, జీవితాన్ని వేరు చేయకుండా జీవించిన కల్పనా లాజ్మి జీవితం ఆదివారం నాడు ముగిసిన విషయం తెల్సిందే. ఆమె తీసిన సినిమాల్లోని స్త్రీ పాత్రల్లా ఆమె జీవితం కూడా వివాదాస్పదంగానే గడిచింది. 17 ఏళ్ల వయస్సులోనే 28 ఏళ్ల వయస్సు కలిగిన ప్రముఖ అస్సాం జానపద గాయకుడు భూపేన్ హజారికాతో ఆమె జీవితాన్ని పంచుకున్నారు. భార్యను, పుత్రుడిని దూరం చేసుకున్న హజారికాకు జీవితాంతం అంటే, 2011, నవంబర్‌లో ఆయన మరణించే వరకు ఆయనతో ఉన్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు.
భూపేన్ హజారికాను ‘పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే’ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులతోపాటు సంగీత్ నాటక్ ఫెల్లోషిప్ అవార్డుతో ఈ సమాజం సత్కరించింది. అదే ఆయనతోనే జీవితాన్ని పంచుకున్న కల్పనా లాజ్మికి మాత్రం విమర్శలను, ఛీత్కారాలనే ఇచ్చింది. 2006లో ఛింగారి చిత్రంతో తెరమరుగైన కల్పనా లాజ్మి సినిమా స్క్రిప్టు రైటర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా ఎంతో రాణించినప్పటికీ ఆమెకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. అయితే ఆమె తీసిన రుడాలి (1993)లో డింపుల్ కపాడియా, దమన్ (2001)లో రవీనా టాండన్‌లకు జాతీయ ఉత్తమ నటి అవార్డులు లభించాయి. లాజ్మి తీసిన తొలి చిత్రం ఏక్ ఫల్ (1986) కమర్శియల్‌గా హిట్టవడమే కాకుండా దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఏక్ ఫల్‌కు, రుడాలికి సంగీత దర్శకత్వం వహించిన హజారికాకు ఆమెకన్నా ఎక్కువ పేరు వచ్చింది. ఆమె ఆఖరి సినిమా ఛింగారి సినిమా హిట్ కాలేదు. పేరూ తేలేదు.
ఓ మాతృమూర్తిగా జీవితంలో మహిళలుపడే కష్టాలే ప్రధాన ఇతివృత్తంగా ఆమె సినిమాలు సాగుతాయి. సమాజంలోని నిజమైన పాత్రలే ఆమె సినిమాల్లో ప్రతిబింబించాయి. కిడ్నీ క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైనందుకు లాజ్మి ఏనాడు బాధ పడలేదు. అయితే తన ఆఖరి కోరిక తీరడం లేదనే ఆమె ఎక్కువ బాధ పడ్డారు. భూపేన్ హజారికా మరణించిన నాటి నుంచి ఆయన జీవితంపై బయోపిక్ సినిమాను నిర్మించడమే ఆమె ఆకరి కల. ఎంతో కష్టపడి స్క్రిప్టు కూడా రాసుకున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి ఆమె అనారోగ్యం సహకరించలేదు. త్వరలో కోలుకొని ఏనాటికైనా బయోపిక్ తీస్తానన్న నమ్మకంతోనే ఆమె ఎంతోకాలం బతికారు.
ఇక అది సాధ్యం కాదని గ్రహించారేమో! ‘భూపేన్ హజారికా: యాజ్ ఐ నో హిమ్’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చారు. ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 8వ తేదీన ముంబైలో కల్పనా లాజ్మి తల్లి లలితా లాజ్మి, దగ్గరి బంధువు శ్యామ్ బెనగల్, పలువురు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తు ఆమె ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment