Kalpana Lajmi
-
ఆఖరి కోరిక తీరకుండానే కల్పనా లాజ్మి..
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి నుంచి పుట్టే కళలు, మనిషిని అనుకరిస్తాయా? లేదా కళలనే మనిషి అనుకరిస్తాడా? అనే తాత్విక చర్చ ఎప్పటికీ ముగియనప్పటికీ, ఇటు కళలను, జీవితాన్ని వేరు చేయకుండా జీవించిన కల్పనా లాజ్మి జీవితం ఆదివారం నాడు ముగిసిన విషయం తెల్సిందే. ఆమె తీసిన సినిమాల్లోని స్త్రీ పాత్రల్లా ఆమె జీవితం కూడా వివాదాస్పదంగానే గడిచింది. 17 ఏళ్ల వయస్సులోనే 28 ఏళ్ల వయస్సు కలిగిన ప్రముఖ అస్సాం జానపద గాయకుడు భూపేన్ హజారికాతో ఆమె జీవితాన్ని పంచుకున్నారు. భార్యను, పుత్రుడిని దూరం చేసుకున్న హజారికాకు జీవితాంతం అంటే, 2011, నవంబర్‌లో ఆయన మరణించే వరకు ఆయనతో ఉన్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. భూపేన్ హజారికాను ‘పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే’ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులతోపాటు సంగీత్ నాటక్ ఫెల్లోషిప్ అవార్డుతో ఈ సమాజం సత్కరించింది. అదే ఆయనతోనే జీవితాన్ని పంచుకున్న కల్పనా లాజ్మికి మాత్రం విమర్శలను, ఛీత్కారాలనే ఇచ్చింది. 2006లో ఛింగారి చిత్రంతో తెరమరుగైన కల్పనా లాజ్మి సినిమా స్క్రిప్టు రైటర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా ఎంతో రాణించినప్పటికీ ఆమెకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. అయితే ఆమె తీసిన రుడాలి (1993)లో డింపుల్ కపాడియా, దమన్ (2001)లో రవీనా టాండన్‌లకు జాతీయ ఉత్తమ నటి అవార్డులు లభించాయి. లాజ్మి తీసిన తొలి చిత్రం ఏక్ ఫల్ (1986) కమర్శియల్‌గా హిట్టవడమే కాకుండా దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఏక్ ఫల్‌కు, రుడాలికి సంగీత దర్శకత్వం వహించిన హజారికాకు ఆమెకన్నా ఎక్కువ పేరు వచ్చింది. ఆమె ఆఖరి సినిమా ఛింగారి సినిమా హిట్ కాలేదు. పేరూ తేలేదు. ఓ మాతృమూర్తిగా జీవితంలో మహిళలుపడే కష్టాలే ప్రధాన ఇతివృత్తంగా ఆమె సినిమాలు సాగుతాయి. సమాజంలోని నిజమైన పాత్రలే ఆమె సినిమాల్లో ప్రతిబింబించాయి. కిడ్నీ క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైనందుకు లాజ్మి ఏనాడు బాధ పడలేదు. అయితే తన ఆఖరి కోరిక తీరడం లేదనే ఆమె ఎక్కువ బాధ పడ్డారు. భూపేన్ హజారికా మరణించిన నాటి నుంచి ఆయన జీవితంపై బయోపిక్ సినిమాను నిర్మించడమే ఆమె ఆకరి కల. ఎంతో కష్టపడి స్క్రిప్టు కూడా రాసుకున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి ఆమె అనారోగ్యం సహకరించలేదు. త్వరలో కోలుకొని ఏనాటికైనా బయోపిక్ తీస్తానన్న నమ్మకంతోనే ఆమె ఎంతోకాలం బతికారు. ఇక అది సాధ్యం కాదని గ్రహించారేమో! ‘భూపేన్ హజారికా: యాజ్ ఐ నో హిమ్’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చారు. ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 8వ తేదీన ముంబైలో కల్పనా లాజ్మి తల్లి లలితా లాజ్మి, దగ్గరి బంధువు శ్యామ్ బెనగల్, పలువురు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తు ఆమె ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారు. -
దర్శకురాలు కల్పనా లాజ్మి కన్నుమూత
బాలీవుడ్ దర్శకురాలు కల్పనా లాజ్మి కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిర్మాతగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా లో బడ్జెట్‌తో రియలిస్టిక్ చిత్రాలను రూపొందించారామె. కల్పన తెరకెక్కించినవన్నీ దాదాపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలే. దర్శకుడు గురు దత్‌కి మేనకోడలు కల్పనా లాజ్మి. అలాగే మరో ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనగల్ కూడా కల్పనకు బంధువే. ‘రుడాలి, దర్మియాన్, దమన్, చింగారి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారామె. ‘రుడాలి’ సినిమాకు డింపుల్ కపాడియాకు, ‘దమన్’ సినిమాకుగాను రవీనా టాండన్‌కు నేషనల్ అవార్డులు లభించాయి. ‘చింగారి’ (2006) తర్వాత కల్పన సినిమాలు తీయలేదు. చివరి రోజుల్లో తన మెడికల్ బిల్స్ అన్నీ ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్స్, నటుడు ఆమిర్‌ఖాన్, దర్శకుడు రోహిత్ శెట్టి చూసుకునేవారని సమాచారం. కల్పనా లాజ్మి మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ప్రముఖ దర్శకురాలు
ముంబై: భారతీయ చలన చిత్రదర్శకురాలు , రచయిత కల్పనా లాజ్మి (61) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి ఆందోళకరంగా మారడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూత్రపిండాల క్యాన్సర్‌తో బాధపడుతున్న కల్పనాను సోమవారం ముంబైలోని కోకిలబెన్ ఆసుపత్రికి తరలించినట్టు ఆమె తల్లి వెల్లడించారు. మహిళా ఆధారిత చలన చిత్రాలతో చిత్రాలతో పాపులర్ అయ్యారు కల్పన . ముఖ్యంగా దామన్-ఎ విక్టిమ్ ఆఫ్ మారిటల్ వయోలెన్స్ , రుడాలి మూవీలకు జాతీయ అవార్డులను కూడా గెల్చుకున్నారుమరోవైపు ఆమె వైద్య ఖర్చులపై బాలీవుడ్ నటుటు అమీర్కాన్, రోహిత్ షెట్టి, ఇండియన్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ శ్రద్ధ తీసుకుంటోంది. అలాగే అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నాయకులుకూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కాగా ప్రముఖ చిత్రకారుడు లలితా లాజ్మి కుమార్తె కల్పన చిత్రనిర్మాత, బాలీవుడ్ నటుడు గురుదత్ కు మేనకోడలు కూడా. ప్రముఖ చిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ ద్వారా సహాయక దర్శకుడిగా పరిచయమైన ఆమె 1986 లో ఆమె దర్శకురాలిగా తొలి చిత్రం షబ్బనా అజ్మీ , నసీరుద్దిన్ షా కలిసి నటించిన ఏక్ పల్. -
భూపేన్.. నవాజుద్దీన్
సుప్రసిద్ధ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా జీవితాన్ని ఆయన సన్నిహితురాలు, బాలీవుడ్ దర్శకురాలు కల్పనా లాజ్మీ తెరకెక్కించనుంది. ఈ చిత్రంలో హజారికా పాత్ర కోసం ఆమె నవాజుద్దీన్ సిద్ధికీని సంప్రదించినట్లు సమాచారం. సిద్ధికీ ప్రస్తుతం స్క్రిప్టు చదవడంలో బిజీగా ఉంటే, లాజ్మీ స్క్రీన్‌ప్లే రూపకల్పనలో తలమునకలుగా ఉన్నారు.ఇందులో లాజ్మీ పాత్రను బెంగాలీ భామ శర్వాణీ ముఖర్జీ పోషించనుంది.