Actor Sarath Babu Dies At 71 Last Wish Not Fulfilled - Sakshi
Sakshi News home page

Sarath Babu: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు

Published Tue, May 23 2023 8:02 AM | Last Updated on Tue, May 23 2023 1:15 PM

Actor Sarath Babu Dies At 71 Last Wish Not Fulfilled - Sakshi

కథానాయకుడు, ప్రతినాయకుడు, సహాయ నటుడు... ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయిన అందాల నటుడు శరత్‌బాబు (71) ఇక లేరు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కిత్స తీసుకుని, బెంగళరు వెళ్లారు. అయితే మళ్లీ అస్వస్థతకు గురి కావటంతో బెంగళరులోని ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గత నెల 20న ఆయన్ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

శరత్‌బాబు శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ (సెప్సిస్‌) వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతినగా, వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. చివరికి మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌తో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!

అదే చివరి కోరిక..
క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తమిళంలో శరత్‌బాబు చేసిన చివరి చిత్రం ‘వసంత ముల్లై’ (2023). ఈ నెల 26న విడుదలకు సిద్ధమైన ‘మళ్ళీ పెళ్లి’లో శరత్‌బాబు కీలక పాత్ర చేశారు. తెలుగులో ఆయనకు ఇదే చివరి సినిమా. వ్యక్తిగతంగా హార్సిలీ హిల్స్‌లో స్థిరపడాలనేది శరత్‌బాబు కోరిక. అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. అయితే నిర్మాణం పూర్తి కాలేదు. చివరికి శరత్‌ కోరిక నెరవేరలేదు.

అదే చివరిరోజైంది...
నటుడుగా బిజీగా ఉన్న సమయంలోనే శరత్‌బాబుకు హార్సిలీహిల్స్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. 1980ల్లోనే హార్సిలీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సోసైటీలో సభ్యత్వం పొందారు. ఈ సభ్యత్వంతో 16–4–1985లో ఆయనకు కొండపై మానస సరోవరం పక్కన ఇంటి నివేశనస్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో అప్పట్లోనే ఇంటి నిర్మాణం ప్రారంభించినా పూర్తి చేయకపోవడంతో గోడల వరకే నిర్మాణం ఆపేశారు.

ఈ ఇంటిని కొనుగోలు చేస్తామని, విక్రయించాలని పలువురు కలిసినా విక్రయించడానికి సుముఖత వ్యక్తం చేసేవారు కాదు. ఇంటి నిర్మాణం పూర్తి చేయించకపోవడం, అలాగే వదిలేయడంతో దాన్ని సంరక్షించే బాధ్యతను స్థానిక వ్యక్తికి అప్పగించారు. అతను తరచూ ఫోన్‌లో శరత్‌బాబుతో మాట్లాడేవారు. శరత్‌బాబు ఏటా హార్సిలీహిల్స్‌ వచ్చి అసంపూర్తిగా ఉన్న ఇంటిని చూసుకుని, స్థానికులతో ముచ్చటించేవారు.

ఆయన చివరగా 2021 మార్చి, 24న హర్సిలీహిల్స్‌ వచ్చారు. ఆరోజు తనకు పరిచయం ఉన్న స్థానికులతో మాట్లాడారు. పలు చిత్రాల్లో నటిస్తున్నానని, ఆ చిత్ర నిర్మాణాలు పూర్తయ్యాక హార్సిలీహిల్స్‌కు వచ్చేసి కుటుంబంతో ఇక్కడే ఉండిపోతానని అప్పుడు చెప్పారు. ఆ రోజు సాయంత్రం తిరిగి వెళ్లాక శరత్‌బాబు హార్సిలీహిల్స్‌ రాలేదు. ఆదే చివరిరోజైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement