
సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని AIG హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఏప్రిల్ 20న అనారోగ్యానికి గురైన శరత్ బాబును ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
శరత్ బాబు సినీ ప్రస్థానం
శరత్ బాబు మాతృభాష తెలుగులోనే కాదు.. తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబు ఆదరణ పొందారు. గతేడాది రిలీజైన పవన్ కల్యాణ్ మూవీ నటించిన వకీల్ సాబ్‌లో ఓ అతిథి పాత్రలో కనిపించిన ఆయన.. వందలాది చిత్రాల్లో విభిన్నపాత్రలతో ఆకట్టుకున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆయన జన్మించారు.
శరత్ బాబు తండ్రికి పెద్ద హోటల్ ఉండేది.. అతనిలాగే కుమారుడు బిజినెస్ చూసుకుంటాడని తండ్రి భావించారు. కానీ శరత్ బాబుకు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలన్న కోరిక ఉండేది. కానీ మిత్రులు, లెక్చరర్స్ ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రయత్నించారు. పేపర్‌లో రామవిజేత అనే సంస్థ కొత్త నటీనటులు కావాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ద్వారానే శరత్ బాబుకు హీరోగా అవకాశం లభించింది. అలా శరత్ తొలిసారి నటించిన చిత్రం రామరాజ్యం. ఆ తర్వాత బంగారు మనిషి, అమెరికా అమ్మాయి, దొరలు-దొంగలు వంటి చిత్రాల్లో నటించారు.
రమాప్రభతో పరిచయం.. పెళ్లి
అప్పటికే కమెడియన్‌గా ఉన్న రమాప్రభతో శరత్ బాబుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి..పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. పద్నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను శరత్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు.