సంపాదకీయం: దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న చుట్టూ ఎప్పటిలానే వివాదం అలుముకుంది. రిపబ్లిక్ డే ముందు లేదా స్వాతంత్య్ర దినో త్సవం సమీపిస్తుండగా ఫలానావారి పేరు భారతరత్న పురస్కారానికి పరిశీలిస్తున్నారని మీడియాలో వెల్లడి కాగానే ‘అన్నివిధాలా అర్హత లున్న మా నాయకుడికి ఇవ్వరేమ’ని నిలదీసేవారు ఎక్కువవుతు న్నారు. ఆ పురస్కారం అందుకున్న ఫలానా వ్యక్తి కంటే మా నేత ఎందులో తీసిపోయాడని అడుగుతున్నారు.
సహజంగానే ఎన్నికల రుతువులో ఇలాంటి పురస్కారాల ప్రస్తావన వస్తే ఈ ప్రశ్నలు మరింత బిగ్గరగా వినబడతాయి. ఇచ్చేవారికి సైతం ఇలాంటి ప్రయోజనాలే ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు మరింత పదునుదేరతాయి. ప్రతిభాపాటవా లను, అంకితభావాన్ని చాటుకోవడానికి అనేకానేక రంగాలున్న ప్పుడు... అందులోనూ మనది సువిశాలమైన దేశమైనప్పుడు ఆ అత్యున్నత పురస్కారానికి అర్హులుగా పరిగణించవలసినవారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. అందులో వింతేమీ లేదు.
భారతరత్న పురస్కారాల కోసం అయిదు బంగారు పతకాలను తయారుచేయమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రిజర్వ్‌బ్యాంకు మింట్‌ను కోరిందన్న వార్తలతో ఈసారి వివాదానికి బీజంపడింది. అంతేకాదు... మాజీ ప్రధాని వాజపేయికి, ఆయనతోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఆ పురస్కారాన్ని ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నట్టు కథనాలు వెలువడ్డాక మా నేత పేరును కూడా పరిశీలిం చాలని కోరేవారి సంఖ్య యధాప్రకారం పెరిగింది. నేతాజీ కుటుంబీకు లుగానీ, ఆయన సిద్ధాంతాల స్ఫూర్తితో పనిచేస్తున్న ఫార్వర్డ్‌బ్లాక్‌గానీ ఆయనకు ఆ బిరుదునివ్వడానికి ప్రయత్నించినప్పుడల్లా గట్టిగా వ్యతి రేకిస్తున్నారు.
ఎందరినో ఆ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశాక ఆయన గుర్తుకొచ్చారా అని నిలదీస్తున్నారు. ఈసారి కూడా వారు ఆ ప్రశ్నే వేశారు. బ్రిటిష్ వలసపాలకులను ఈ దేశంనుంచి వెళ్లగొట్టడా నికి సైన్యాన్ని నిర్మించి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ, జపాన్‌ల సాయాన్ని సైతం పొందా లని నిర్ణయించి, ఆ పనిలో ఉండగానే అనూహ్యంగా కనుమరుగైన నేతాజీకి 1992లో భారతరత్న ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. అయితే, ఆయన మరణం గురించి అధికారికంగా ప్రకటించని స్థితివున్న కార ణంగా అది ఆగిపోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు నేతాజీ పేరు ఆ పురస్కారానికి వినబడుతున్నది.
ఈ దేశాన్ని చాలా దశా బ్దాలు కాంగ్రెసే ఏలినందున గాంధీ-నెహ్రూ కుటుంబానికుండే పేరు ప్రతిష్టలు ఎక్కడ మసకబారుతాయోనన్న బెంగతో నేతాజీ లాంటివారి త్యాగశీలతను పరిగణనలోకి తీసుకోలేదన్నది బహిరంగ రహస్యం. హాకీ క్రీడాకారుడు స్వర్గీయ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్న సిఫార్సులు అందాయని, వాటిని ప్రధాని కార్యాలయానికి పంపామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. కనుక ఆయన పేరు కూడా ఉండొచ్చని అర్ధమవుతున్నది. ఇక కేంద్రంలో అధి కారంలో ఉన్నది బీజేపీ గనుక సంఘ్ పరివార్‌నుంచి కూడా వేర్వేరు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయ వంటివారి పేర్లున్నాయి. దళిత నాయకుడు దివంగత కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని బీఎస్‌పీ అధినేత మాయావతి కన్నా ముందు కాంగ్రెస్ డిమాండు చేసిందంటున్నారు. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా చాటిన ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలన్న డిమాండు ఎప్పటి నుంచో ఉన్నది.
నిరుడు ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావుతోపాటు ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటిం చినప్పుడు దేశమంతా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. అయితే, సచిన్‌ను ఎంపిక చేయడానికి ఉరకలు, పరుగులతో సాగిన ప్రయ త్నాలు వెల్లడయ్యాక అందరూ ఆశ్చర్యపోయారు. 80మంది ఎంపీలు సిఫార్సుచేసిన ధ్యాన్‌చంద్ పేరు వెనక్కిపోయి, సచిన్ పేరు హఠాత్తుగా ఖరారైందని ఆ కథనం వెల్లడించింది. క్రికెట్ క్రీడలో 24 ఏళ్లపాటు కొనసాగి ఈ దేశానికి సచిన్ ఆర్జించిపెట్టిన ఖ్యాతిపైగానీ, ఆయన ప్రతి భాపాటవాలపైగానీ రెండో మాట లేదు. కానీ, ప్రభుత్వం అనుసరించిన విధానం కూడా ఆ ప్రతిభాపాటవాలకు దీటుగా ఉండాలి. యూపీ ఏ సర్కారు ఆ విషయంలో విఫలమైందనే చెప్పాలి. ప్రజాదరణ ఉన్న క్రికెట్‌లోకాక హాకీలో దిగ్గజం కావడమే ధ్యాన్‌చంద్‌కు అనర్హత అయిందా అన్న ప్రశ్న వేసినవారూ ఉన్నారు.
దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడంలో మనం ఎలాంటి విధివిధానాలను పాటిస్తున్నాం... ఏ విలువలకు పట్టంగడుతున్నామన్న స్పృహ పాలకులకు ఉన్నట్టులేదు. సజీవుడిగా ఉన్నప్పుడే ఆ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడైన వినోబాభావేకు 1982లో ఆయన మరణించాకగానీ భారతరత్న రాలేదు. మరణించిన మూడున్నర దశాబ్దాల తర్వాతగానీ నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గుర్తుకురాలేదు. అందుకు భిన్నంగా ఎంపికైన వారిలో ఎంతోమంది వివాదాస్పద వ్యక్తులున్నారు.
ఇన్నాళ్లూ అనుస రించిన విధానాల కారణంగా ఆ పురస్కారానికుండే గౌరవప్రపత్తులకు భంగం వాటిల్లిన మాట వాస్తవం. ఎన్డీయే ప్రభుత్వమైనా దీనికి భిన్నంగా ఉండాలి. ఒక కొత్త ఒరవడికి నాంది పలకాలి. అర్హులను గుర్తించడానికి భిన్నరంగాల్లో లబ్ధప్రతిష్టులైన వ్యక్తులతో కమిటీని ఏర్పర్చడంతోపాటు, ఆ పురస్కారాలు పొందడానికి గల అర్హతలే మిటో నిర్దిష్టంగా పేర్కొంటే... ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేప డితే భారతరత్న ప్రతిష్టను మరింత పెంచినవారవుతారు. ఇప్పుడు న్నట్టుగా ఎంపిక బాధ్యతను ప్రధానికే వదిలేస్తే ఎప్పటిలా వివాదాలు తప్పవని గుర్తించాలి.
భారతరత్న వివాదం!
Published Thu, Aug 14 2014 1:21 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement