highest award
-
సోరోస్‌కు మెడల్ హాస్యాస్పదం: మస్క్
వాషింగ్టన్ : బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు అమెరికా అత్యున్నత పురస్కారాన్ని అందించడాన్ని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. వివాదాస్పద నేపథ్యమున్న వ్యక్తికి అధ్యక్షుడు బైడెన్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రదానం చేయడం హాస్యాస్పదమన్నారు. నిక్కీ హేలీ, సెనేటర్ టిమ్ షీహీ సహా పలువురు రిపబ్లికన్ నేతలు ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రధాని మోదీని జార్జ్ సోరోస్ ఇటీవల బహిరంగంగా విమర్శించడం తెలిసిందే. ఆయనతో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత పురస్కారమైన మెడల్ ఆఫ్ ఫ్రీడంను బైడెన్ ప్రదానం చేశారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ, ఫుట్‌బాల్ స్టార్ లయొనెల్ మెస్సీ, నటుడు డెంజల్ వాషింగ్టన్ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు తీసుకునేందుకు వేదికనెక్కిన హిల్లరీకి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సోరోస్ తరపున ఆయన కుమారుడు అవార్డును స్వీకరించారు. ఈ గౌరవం తననెంతగానో కదిలించిందని సోరోస్ ఒక ప్రకటనలో తెలిపారు. వలసదారునైన తనకు అమెరికాలో స్వేచ్ఛ లభించిందన్నారు. -
మోదీకి డొమినికా జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశాన్ని కలావికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్నహస్తంతో తెరిపినపడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకునేందుకు సిద్ధపడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోదీకి ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా గురువారం ప్రకటించింది. భారత ప్రభుత్వ ఉదార గుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గయానాలోని జార్జ్‌టౌన్ పట్టణంలో నవంబర్ 19 నుంచి 21వ తేదీదాకా జరిగే ఇండియా–కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోదీకి ఈ అవార్డ్‌ను అందజేస్తారు. ‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఆదేశాలతో భారతసర్కార్ మాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. మా స్థాయికి అది పెద్ద సాయం కావడంతో వాటిలో కొన్నింటిని మా పొరుగు దేశాలకూ సాయంగా అందించగలిగాం. ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక రంగాల్లోనూ భారత్ మాకు ఎంతో సాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణమార్పు నిరోధక చర్యలు చేపట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకను గుణంగా ముందడుగు వేయడంలో మాకు వెన్నంటి నిలిచింది’’ అని ఆ దేశ ప్రధాని కార్యాలయం కొనియాడింది. -
హెచ్‌సీఎల్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాను .. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన ’షెవాలీర్ డి లా లెజియన్ డి హానర్’ (’నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’) లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, భారత్ .. ఫ్రాన్స్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రోష్ని తెలిపారు. తమకు కీలక మార్కెట్లలో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నామని ఆమె పేర్కొన్నారు. -
మోదీకి భూటాన్‌లో అరుదైన గౌరవం
థింపూ: భూటాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనకు శుక్రవారం ఉదయం భూటాన్ రాజధాని థింపూ చేరుకున్న మోదీకి ప్రధాని త్సెరింగ్ టొబ్గే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపూ దాకా 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి భారత్, టిబెట్ పతాకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోదీ స్వయంగా రాసిన పాటకు భారత సంప్రదాయ దుస్తుల్లో గర్బా నృత్యం చేశారు. దాన్ని మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. రాజు వాంగ్‌చుక్‌తో భేటీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్సెరింగ్‌లతో మోదీ సమావేశమయ్యారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను తొలిసారిగా మోదీకి రాజు ప్రదానం చేశారు. భారత్, భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోందని మోదీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఉంటుందన్నారు. ఈ సుందర దేశంలోకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగతం పలికిన భూటాన్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్, భూటాన్ మైత్రి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ‘మా పెద్దన్న మోదీ జీకి భూటాన్‌లోకి స్వాగతం’అని త్సెరింగ్ టొబ్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అనంతరం ప్రధానుల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై అధికార ప్రతినిధులు సంతకాలు చేశారు. రెండు దేశాల నడుమ కొక్రాఝర్– గెలెఫు, బనార్హట్–సంత్సెల మధ్య రైల్వే లైనుపై ఎంవోయూకు తుదిరూపం ఇచ్చారు. 21, 22వ తేదీల్లోనే మోదీ భూటాన్‌లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల ఒక రోజు వాయిదా పడింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. నేడు డిజొంగ్ మఠ సందర్శన భూటాన్‌లోని శక్తిమంతమైన తషిఛో డిజొంగ్ బౌద్ధ మఠాన్ని మోదీ శనివారం సందర్శించనున్నారు. థింపూలో భారత్ సహకారంతో ఏర్పాటైన అత్యాధునిక మాతా శిశు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. గత వారం భూటాన్ ప్రధాని త్సెరింగ్ భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. -
కడప వైద్యుడికి అత్యున్నత పురస్కారం
పోరుమామిళ్ల: వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల రాఘవేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ వెంకటరత్నకుమార్ అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీలో అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ డెంటిస్ట్రీ ఆఫ్ పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ప్రపంచంలో దంత వైద్యంలో అత్యున్నత పురస్కారం ‘ది హ్యారీ డబ్లు్య.ఎఫ్.డ్రస్సెల్’ అవార్డు సాధించారు. ఈ విద్య అభ్యసించిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి డాక్టర్‌గా వెంకటరత్నకుమార్ నిలిచారు. కోర్సు పూర్తి చేసి అవార్డును సొంతం చేసుకోవడమే కాక అమెరికాలోని వాషింగ్టన్ ‘రివార్డ్స్ డెంటల్ క్లినిక్’లో దంత వైద్యుడిగా రూ.1.25 కోట్ల వేతన ప్యాకేజీతో నియమితులయ్యారు. కాగా, రత్నకుమార్ 2014లో కడప రిమ్స్‌లో దంత వైద్యంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. రత్నకుమార్ తండ్రి రుద్రవరం శ్రీనివాసులు విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. తల్లి దేవి గృహిణి. -
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం
PM Modi Conferred With Bhutan's Highest Civilian Award: భారత ప్రధాని మోదీకి భూటాన్ దేశం నుంచి అరుదైన గౌరవం లభించింది. భూటాన్ దేశం తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని అత్యున్నత పౌర పురస్కారం నాడగ్ పెల్ గి ఖోర్లోతో సత్కరించింది. ఈ క్రమంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ అత్యున్నత గౌరవ పౌర పురస్కారం అయిన న్గదాగ్ పెల్ గి ఖోర్లోతో నరేంద్ర మోడీని సత్కరించడం తమకు చాలా సంతోషంగా అనిపించిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతేకాదు గత కొన్నేళ్లుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మోదీజీ తమకు అందించిన స్నేహపూర్వక సహాయసహకారాలు, మద్దతును గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పైగా భూటాన్ ప్రజలు మోదీజీని గొప్ప ఆధ్యాత్మిక మహోన్నత వ్యక్తిగా భావిస్తున్నారని అన్నారు. ఈ మేరకు తాము ఈ అత్యున్నత పురస్కార వేడుకను వైభవోపేతంగా జరుపుకోవాలని భావిస్తూ భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం అని భూటాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఫేస్బుక్లో పేర్కొంది. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) -
మోదీకి అత్యున్నత పౌర పురస్కారం!
అబుదాబి : యుఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్‌తో శనివారం సత్కరించింది. 2015లో అరబ్ దేశాల్లో పర్యటించిన మోదీ ఇరుదేశాల మధ్య మత, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో చేసిన కృషికిగాను ఈ అవార్డును ఇస్తున్నట్టు గత ఏప్రిల్‌లోనే యూఏఈ ప్రకటించింది. ఈ అవార్డును యుఏఇ జాతిపిత షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరుతో ఇస్తారు. ఆయన శతజయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని మోదీకి ప్రకటించడం విశేషం. ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 60 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. యుఏఈ భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అలాగే యుఏఈ పెట్రోలియం ఉత్పత్తుల్లో భారత్ నాలుగో అతిపెద్ద దిగుమతిదారు. భారతదేశం నుంచి దాదాపు 33 లక్షల మంది యుఏఈలో పని చేస్తున్నారు. -
భారతరత్న వివాదం!
సంపాదకీయం: దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న చుట్టూ ఎప్పటిలానే వివాదం అలుముకుంది. రిపబ్లిక్ డే ముందు లేదా స్వాతంత్య్ర దినో త్సవం సమీపిస్తుండగా ఫలానావారి పేరు భారతరత్న పురస్కారానికి పరిశీలిస్తున్నారని మీడియాలో వెల్లడి కాగానే ‘అన్నివిధాలా అర్హత లున్న మా నాయకుడికి ఇవ్వరేమ’ని నిలదీసేవారు ఎక్కువవుతు న్నారు. ఆ పురస్కారం అందుకున్న ఫలానా వ్యక్తి కంటే మా నేత ఎందులో తీసిపోయాడని అడుగుతున్నారు. సహజంగానే ఎన్నికల రుతువులో ఇలాంటి పురస్కారాల ప్రస్తావన వస్తే ఈ ప్రశ్నలు మరింత బిగ్గరగా వినబడతాయి. ఇచ్చేవారికి సైతం ఇలాంటి ప్రయోజనాలే ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు మరింత పదునుదేరతాయి. ప్రతిభాపాటవా లను, అంకితభావాన్ని చాటుకోవడానికి అనేకానేక రంగాలున్న ప్పుడు... అందులోనూ మనది సువిశాలమైన దేశమైనప్పుడు ఆ అత్యున్నత పురస్కారానికి అర్హులుగా పరిగణించవలసినవారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. అందులో వింతేమీ లేదు. భారతరత్న పురస్కారాల కోసం అయిదు బంగారు పతకాలను తయారుచేయమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రిజర్వ్‌బ్యాంకు మింట్‌ను కోరిందన్న వార్తలతో ఈసారి వివాదానికి బీజంపడింది. అంతేకాదు... మాజీ ప్రధాని వాజపేయికి, ఆయనతోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఆ పురస్కారాన్ని ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నట్టు కథనాలు వెలువడ్డాక మా నేత పేరును కూడా పరిశీలిం చాలని కోరేవారి సంఖ్య యధాప్రకారం పెరిగింది. నేతాజీ కుటుంబీకు లుగానీ, ఆయన సిద్ధాంతాల స్ఫూర్తితో పనిచేస్తున్న ఫార్వర్డ్బ్లాక్గానీ ఆయనకు ఆ బిరుదునివ్వడానికి ప్రయత్నించినప్పుడల్లా గట్టిగా వ్యతి రేకిస్తున్నారు. ఎందరినో ఆ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశాక ఆయన గుర్తుకొచ్చారా అని నిలదీస్తున్నారు. ఈసారి కూడా వారు ఆ ప్రశ్నే వేశారు. బ్రిటిష్ వలసపాలకులను ఈ దేశంనుంచి వెళ్లగొట్టడా నికి సైన్యాన్ని నిర్మించి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ, జపాన్ల సాయాన్ని సైతం పొందా లని నిర్ణయించి, ఆ పనిలో ఉండగానే అనూహ్యంగా కనుమరుగైన నేతాజీకి 1992లో భారతరత్న ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. అయితే, ఆయన మరణం గురించి అధికారికంగా ప్రకటించని స్థితివున్న కార ణంగా అది ఆగిపోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు నేతాజీ పేరు ఆ పురస్కారానికి వినబడుతున్నది. ఈ దేశాన్ని చాలా దశా బ్దాలు కాంగ్రెసే ఏలినందున గాంధీ-నెహ్రూ కుటుంబానికుండే పేరు ప్రతిష్టలు ఎక్కడ మసకబారుతాయోనన్న బెంగతో నేతాజీ లాంటివారి త్యాగశీలతను పరిగణనలోకి తీసుకోలేదన్నది బహిరంగ రహస్యం. హాకీ క్రీడాకారుడు స్వర్గీయ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్న సిఫార్సులు అందాయని, వాటిని ప్రధాని కార్యాలయానికి పంపామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. కనుక ఆయన పేరు కూడా ఉండొచ్చని అర్ధమవుతున్నది. ఇక కేంద్రంలో అధి కారంలో ఉన్నది బీజేపీ గనుక సంఘ్ పరివార్నుంచి కూడా వేర్వేరు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయ వంటివారి పేర్లున్నాయి. దళిత నాయకుడు దివంగత కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని బీఎస్పీ అధినేత మాయావతి కన్నా ముందు కాంగ్రెస్ డిమాండు చేసిందంటున్నారు. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా చాటిన ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలన్న డిమాండు ఎప్పటి నుంచో ఉన్నది. నిరుడు ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావుతోపాటు ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటిం చినప్పుడు దేశమంతా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. అయితే, సచిన్‌ను ఎంపిక చేయడానికి ఉరకలు, పరుగులతో సాగిన ప్రయ త్నాలు వెల్లడయ్యాక అందరూ ఆశ్చర్యపోయారు. 80మంది ఎంపీలు సిఫార్సుచేసిన ధ్యాన్‌చంద్ పేరు వెనక్కిపోయి, సచిన్ పేరు హఠాత్తుగా ఖరారైందని ఆ కథనం వెల్లడించింది. క్రికెట్ క్రీడలో 24 ఏళ్లపాటు కొనసాగి ఈ దేశానికి సచిన్ ఆర్జించిపెట్టిన ఖ్యాతిపైగానీ, ఆయన ప్రతి భాపాటవాలపైగానీ రెండో మాట లేదు. కానీ, ప్రభుత్వం అనుసరించిన విధానం కూడా ఆ ప్రతిభాపాటవాలకు దీటుగా ఉండాలి. యూపీ ఏ సర్కారు ఆ విషయంలో విఫలమైందనే చెప్పాలి. ప్రజాదరణ ఉన్న క్రికెట్లోకాక హాకీలో దిగ్గజం కావడమే ధ్యాన్‌చంద్‌కు అనర్హత అయిందా అన్న ప్రశ్న వేసినవారూ ఉన్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడంలో మనం ఎలాంటి విధివిధానాలను పాటిస్తున్నాం... ఏ విలువలకు పట్టంగడుతున్నామన్న స్పృహ పాలకులకు ఉన్నట్టులేదు. సజీవుడిగా ఉన్నప్పుడే ఆ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడైన వినోబాభావేకు 1982లో ఆయన మరణించాకగానీ భారతరత్న రాలేదు. మరణించిన మూడున్నర దశాబ్దాల తర్వాతగానీ నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గుర్తుకురాలేదు. అందుకు భిన్నంగా ఎంపికైన వారిలో ఎంతోమంది వివాదాస్పద వ్యక్తులున్నారు. ఇన్నాళ్లూ అనుస రించిన విధానాల కారణంగా ఆ పురస్కారానికుండే గౌరవప్రపత్తులకు భంగం వాటిల్లిన మాట వాస్తవం. ఎన్డీయే ప్రభుత్వమైనా దీనికి భిన్నంగా ఉండాలి. ఒక కొత్త ఒరవడికి నాంది పలకాలి. అర్హులను గుర్తించడానికి భిన్నరంగాల్లో లబ్ధప్రతిష్టులైన వ్యక్తులతో కమిటీని ఏర్పర్చడంతోపాటు, ఆ పురస్కారాలు పొందడానికి గల అర్హతలే మిటో నిర్దిష్టంగా పేర్కొంటే... ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేప డితే భారతరత్న ప్రతిష్టను మరింత పెంచినవారవుతారు. ఇప్పుడు న్నట్టుగా ఎంపిక బాధ్యతను ప్రధానికే వదిలేస్తే ఎప్పటిలా వివాదాలు తప్పవని గుర్తించాలి.