45 కి.మీ. రోడ్డుకిరువైపుల నిలబడి ప్రజల స్వాగతం
అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం
రైల్వే అనుసంధానం సహా పలు ఒప్పందాలు
థింపూ: భూటాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనకు శుక్రవారం ఉదయం భూటాన్ రాజధాని థింపూ చేరుకున్న మోదీకి ప్రధాని త్సెరింగ్ టొబ్‌గే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపూ దాకా 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి భారత్, టిబెట్ పతాకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోదీ స్వయంగా రాసిన పాటకు భారత సంప్రదాయ దుస్తుల్లో గర్బా నృత్యం చేశారు. దాన్ని మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.
రాజు వాంగ్‌చుక్‌తో భేటీ
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్సెరింగ్‌లతో మోదీ సమావేశమయ్యారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను తొలిసారిగా మోదీకి రాజు ప్రదానం చేశారు. భారత్, భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోందని మోదీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఉంటుందన్నారు. ఈ సుందర దేశంలోకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగతం పలికిన భూటాన్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
భారత్, భూటాన్ మైత్రి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ‘మా పెద్దన్న మోదీ జీకి భూటాన్‌లోకి స్వాగతం’అని త్సెరింగ్ టొబ్‌గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అనంతరం ప్రధానుల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై అధికార ప్రతినిధులు సంతకాలు చేశారు.
రెండు దేశాల నడుమ కొక్రాఝర్– గెలెఫు, బనార్హట్–సంత్సెల మధ్య రైల్వే లైనుపై ఎంవోయూకు తుదిరూపం ఇచ్చారు. 21, 22వ తేదీల్లోనే మోదీ భూటాన్‌లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల ఒక రోజు వాయిదా పడింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.
నేడు డిజొంగ్ మఠ సందర్శన
భూటాన్‌లోని శక్తిమంతమైన తషిఛో డిజొంగ్ బౌద్ధ మఠాన్ని మోదీ శనివారం సందర్శించనున్నారు. థింపూలో భారత్ సహకారంతో ఏర్పాటైన అత్యాధునిక మాతా శిశు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. గత వారం భూటాన్ ప్రధాని త్సెరింగ్ భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment