Bhutan tour
-
భూటాన్‌లో ఆస్పత్రిని ప్రారంభించిన మోదీ
థింపు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివా రం భూటాన్ రాజధాని థింపూలో అత్యాధు నిక వసతులతో నిర్మించిన ఆస్పత్రిని ఆ దేశ ప్రధాని త్సెరింగ్ టోబ్గేతో కలిసి ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 పడకలతో కూడిన గ్యాల్ట్సుయెన్ జెట్సున్ పెమా వాంగ్‌చుక్ మాతా శిశు హాస్పిటల్‌ను భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించే ఈ ఆస్పత్రి ఎన్నో కుటుంబాలకు ఆశా కిరణం వంటిదని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్–టిబెట్ల ఆర్థిక సహకారానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ ఆస్పత్రి అని తెలిపారు. భారత్ సాయంతో మొదటి దశలో రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రి 2019 నుంచి సేవలందిస్తోంది. భారత్ అందించిన మరో రూ.119 కోట్లతో చేపట్టిన ఆస్పత్రి రెండో దశ నిర్మాణం తాజాగా పూర్తయిందని విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికిన రాజు రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను అందజేశారు. మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. పర్యటన ముగించుకుని తిరిగి శనివారం మధ్యాహ్నం మోదీ తిరుగు పయనమయ్యారు. ఆయన వెంట ప్రధాని త్సెరింగ్ టోబ్గేతోపాటు రాజు జింగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ స్వయంగా పారో విమానాశ్ర యానికి వచ్చారు. వీరిద్దరూ ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు. -
మోదీకి భూటాన్‌లో అరుదైన గౌరవం
థింపూ: భూటాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనకు శుక్రవారం ఉదయం భూటాన్ రాజధాని థింపూ చేరుకున్న మోదీకి ప్రధాని త్సెరింగ్ టొబ్గే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపూ దాకా 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి భారత్, టిబెట్ పతాకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోదీ స్వయంగా రాసిన పాటకు భారత సంప్రదాయ దుస్తుల్లో గర్బా నృత్యం చేశారు. దాన్ని మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. రాజు వాంగ్‌చుక్‌తో భేటీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్సెరింగ్‌లతో మోదీ సమావేశమయ్యారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను తొలిసారిగా మోదీకి రాజు ప్రదానం చేశారు. భారత్, భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోందని మోదీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఉంటుందన్నారు. ఈ సుందర దేశంలోకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగతం పలికిన భూటాన్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్, భూటాన్ మైత్రి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ‘మా పెద్దన్న మోదీ జీకి భూటాన్‌లోకి స్వాగతం’అని త్సెరింగ్ టొబ్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అనంతరం ప్రధానుల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై అధికార ప్రతినిధులు సంతకాలు చేశారు. రెండు దేశాల నడుమ కొక్రాఝర్– గెలెఫు, బనార్హట్–సంత్సెల మధ్య రైల్వే లైనుపై ఎంవోయూకు తుదిరూపం ఇచ్చారు. 21, 22వ తేదీల్లోనే మోదీ భూటాన్‌లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల ఒక రోజు వాయిదా పడింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. నేడు డిజొంగ్ మఠ సందర్శన భూటాన్‌లోని శక్తిమంతమైన తషిఛో డిజొంగ్ బౌద్ధ మఠాన్ని మోదీ శనివారం సందర్శించనున్నారు. థింపూలో భారత్ సహకారంతో ఏర్పాటైన అత్యాధునిక మాతా శిశు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. గత వారం భూటాన్ ప్రధాని త్సెరింగ్ భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. -
భూటాన్ విశ్వసనీయ పొరుగుదేశం
పారో/థింపూ: భూటాన్ భారత్‌కు ఎప్పుడూ విశ్వసనీయ పొరుగుదేశమేనని ప్రధాని మోదీ చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ శనివారం భూటాన్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్, మంత్రివర్గ సభ్యులతో కలసి మోదీకి పారాలోని విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తర్వాత ఇరువురు ప్రధానులు కలసి పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. అనేక రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా చర్చలు కొనసాగించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ‘భూటాన్ అభివృద్ధిలో భారత్ ప్రధాన భాగస్వామి కావడం ఒక విశేషం. భూటాన్ పంచవర్ష ప్రణాళికలలో భారత్ సహకారం ఇకపైన కూడా కొనసాగుతుంది’ అని మోదీ అన్నారు. అంతరిక్ష పరిశోధన, విమానయానం, ఐటీ, విద్యుత్, విద్యారంగానికి సంబంధించి ఇరు దేశాలు 10 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మోదీ దేశ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌తో కూడా భేటీ అయ్యారు. రూపే కార్డును ప్రారంభించిన మోదీ భూటాన్‌లో దక్షిణాసియా ఉపగ్రహ వినియోగం కోసం ఇస్రో సహాయంతో అభివృద్ధి చేసిన గ్రౌండ్ ఎర్త్ స్టేషన్, సాట్కామ్ నెట్‌వర్క్‌ను మోదీ, షెరింగ్ కలిసి ప్రారంభించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా భూటాన్ అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. సిమ్తోఖా జొంగ్ వద్ద భూటాన్‌లో రూపే పే కార్డును మోదీ ప్రారంభించారు. ‘భూటాన్‌లో రూపే పే కార్డును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధానం డిజిటల్ చెల్లింపులు, వాణిజ్యం, పర్యాటక రంగంలో ఇరుదేశాల సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నాను’ అని వెల్లడించారు. మాంగ్దేచు జలవిద్యుత్ కర్మాగారాన్ని ప్రారంభించిన మోదీ, ఐదు దశాబ్దాల భారత–భూటాన్ జలవిద్యుత్ సహకారాన్ని గుర్తుచేసే స్టాంపులను కూడా విడుదలచేశారు. మోదీ ఎయిర్పోర్ట్ నుంచి రాజధాని థింపూకి వెళ్తున్నప్పుడు ప్రజలు త్రివర్ణ పతాకాలు ఊపుతూ దారిపొడవునా మోదీకి స్వాగతంపలికారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. -
భూటాన్ బయలుదేరిన ప్రణబ్
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం భూటాన్ బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రణబ్‌కు వీడ్కోలు పలికారు. రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ సీనియర్ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు నలుగురు ఎంపీలు ప్రణబ్ వెంట భూటాన్ పయనమైనవారిలో ఉన్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్‌చుక్ ఆహ్వానంపై ప్రణబ్ ఆ దేశం వెళ్లారు. దాదాపు 26 ఏళ్లలో తొలిసారిగా ప్రణబ్ భూటన్లో పర్యటిస్తున్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటిగా భూటన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. -
దేవుళ్లకు కృతజ్ఞతలు..
మోడీ పర్యటనపై భూటాన్ ప్రధాని న్యూఢిల్లీ: తమ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం కావడంపై భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘‘ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతమైంది. మమ్మల్ని రక్షించే దేవతలకు, మాకు నాయకత్వం వహించే రాజులకు కృతజ్ఞతలు. ఇది మా ప్రజల అదృష్టం’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతకుముందు భూటాన్ నుంచి ఢిల్లీ వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ ‘‘ఢిల్లీకి చేరుకున్నాను. భూటాన్ పర్యటన నా మదిలో ఎప్పటికీ అందమైనదిగా ఉంటుంది. ఈ పర్యటన ఎంతో సంతృప్తివ్వడమే కాదు.. ఫలవంతమైంది కూడా’’ అని ట్విట్టర్లో రాశారు. కాగా, తన అంతరాత్మ ప్రబోధం మేరకే తన తొలి విదేశీ పర్యటనకు భూటాన్‌ను ఎంచుకున్నానని మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ దేశ పర్యటనకు వెళ్లిన మోడీకి ఘనస్వాగతం లభించిన విషయం విదితమే. సోమవారం భూటాన్ ప్రధాని తోబ్గే తన మంత్రివర్గంతో కలసి విమానాశ్రయం వరకూ మోడీని తోడ్కొని వచ్చి వీడ్కోలు పలికారు. -
సంపన్న భారత్ తో 'సార్క్' కు మేలు
భూటాన్ పార్లమెంటులో మోడీ ప్రసంగం భారత్‌లో ప్రభుత్వ మార్పు భూటాన్‌తో బంధంపై ప్రభావం చూపదు గతంలో భారత్ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామన్న ప్రధానమంత్రి ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతానికి ఇరు దేశాల నిర్ణయం మోడీ పర్యటన దిగ్విజయం: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ థింపు: బలమైన, సుసంపన్నమైన భారతదేశం.. భూటాన్ సహా పొరుగు దేశాల అభివృద్ధికి సాయపడగలదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. భారత్ సుసంపన్నమైతే సార్క్ దేశాలన్నిటికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. మోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన సోమవారం ముగిసింది. పర్యటన ముగించే ముందు ఆయన భూటాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్‌లో ప్రభుత్వం మారిపోయినప్పటికీ.. భూటాన్‌తో సంబంధాలపై ఆ ప్రభావం ఉండబోదని.. తమ దేశం గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మోడీ స్పష్టంచేశారు. భూటాన్ జాతీయ శాసనసభ స్పీకర్ జిగ్మేజాంగ్పో ఆహ్వాన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. భారత్ ఎంత బలంగా ఉంటే.. భూటాన్‌కు అంత మంచిదని పేర్కొన్నారు. బలమైన, సుసంపన్నమైన భారత్ ఈ ప్రాంతంలోని చిన్న దేశాలకు సాయపడగలదని చెప్పారు. తన అంతరాత్మ ప్రబోధం మేరకే భారత ప్రధానమంత్రిగా తన తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంపిక చేసుకున్నానని మోడీ తెలిపారు. ‘‘ఇంత గొప్ప విజయం (ఎన్నికల్లో) తర్వాత.. ఏదైనా పెద్ద బలమైన దేశంలో ముందుగా పర్యటించాలని, తద్వారా చాలా కీర్తి వస్తుందనే ఆలోచన సాధారణంగా ఉంటుంది. కానీ.. నేను ముందు భూటాన్‌ను సందర్శించాలని నా అంతరాత్మ చెప్పింది. ఇందుకు ప్రణాళిక ఏదీ లేదు. అది మామూలు చర్య’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. తమ భూభాగాన్ని భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించుకునేందుకు అనుమతించబోమని భూటాన్ కూడా హామీ ఇచ్చింది. ఈశాన్య భారత్ మిలిటెంట్లు భూటాన్‌లో తలదాచుకుంటున్న నేపథ్యంలో ఆ దేశం ఈ హామీ ఇచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపు... మోడీ పర్యటన సందర్భంగా.. రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించాయని అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. భూటాన్, భారత్ ఈశాన్య రాష్ట్రాల మధ్య క్రీడల నిర్వహణ, సంయుక్త పరిశోధన కోసం హిమాలయ విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి చర్యలతో ఈ బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. పాల పొడి, గోధుమలు, ఆహార నూనెలు, పప్పుధాన్యాలు, బాస్మతియేతర బియ్యం వంటి ఎగుమతులపై భూటాన్‌కు నిషేధం నుంచి, పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు భారత్ తెలియజేసింది. అలాగే.. భారత్‌లో చదువుకునే భూటాన్ విద్యార్థులకు ఇచ్చే నెహ్రూ - వాంగ్‌చుక్ స్కాలర్షిప్ను ఏడాదికి రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఖోలాంగ్చు విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన భారత్ - భూటాన్ భాగస్వామ్యంతో భూటాన్‌లో నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యం గల ఖోలాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ సోమవారం శంకుస్థాపన చేశారు. భూటాన్ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం.. ఆయన పార్లమెంటు ఆవరణ నుంచే ఎలక్ట్రానిక్ మీట నొక్కటం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇటీవలే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ తొలి విదేశీ పర్యటనకు ఎంచుకున్న భూటాన్ పర్యటన దిగ్విజయమయిందని.. ఆయనతో పాటు పర్యటనకు వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మీడియాతో పేర్కొన్నారు. భూటాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని పొరుగు దేశం చైనా ఇటీవలి కాలంలో తీవ్ర యత్నాలు చేస్తున్న నేపథ్యంలో మోడీ తొలిసారిగా భూటాన్ పర్యటనకు వెళ్లి ఆ దేశంతో భారత్ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించటం విశేషం. ఈ పర్యటనలో మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్లు కూడా ఉన్నారు. భూటాన్ - భారత్ మైత్రి సంతోషకరం: చైనా భారత్ - భూటాన్‌ల మధ్య సంబంధాలు మోడీ పర్యటనతో బలోపేతం అవటం సంతోషకరమని చైనా స్పందించింది. భూటాన్‌తో తాము దౌత్య సంబంధాలు నెలకొల్పలేదని.. అయితే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, పర్యటనలు ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హువాచున్యింగ్ పేర్కొన్నారు. భారత్-టిబెట్ల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న భూటాన్ 1951 నుంచి ఒంటరిగా ఉంది. చైనాతో సరిహద్దు వివాదం నేపధ్యంలో భూటాన్ - చైనాల మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. మోడీ ప్రసంగానికి చప్పట్లు ప్రధాని మోడీకి భూటాన్ పార్లమెంటులో అరుదైన గౌరవం లభించింది. మోడీ 45 నిమిషాల ప్రసంగం ముగిసిన తర్వాత.. ఆ దేశ ఎంపీలు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి చప్పట్లతో అభినందనలు తెలిపారు. భూటాన్‌లో దుష్టాత్మలను తరిమివేయటానికి (దెయ్యాలను) చప్పట్లు కొడతారు కానీ.. అభినందనలు తెలిపేందుకు కాదు. కానీ మోడీ ప్రసంగం తర్వాత ఉభయసభల ఎంపీలందరూ చప్పట్లతో అభినందించటం విశేషం. మోడీ హిందీలో ప్రసంగించగా.. స్థానిక దుబాసీ ఆయన ప్రసంగాన్ని భూటానీస్లోకి తర్జుమా చేసి వినిపించారు. భారత్ నుంచి తెప్పించిన వాహనంలోనే.. భారత ప్రధాని నరేంద్రమోడీ థింపులో సైతం భారత్ నుంచి విమానంలో తెప్పించుకున్న ప్రత్యేక వాహనంలోనే ప్రయాణించారు. భద్రత రీత్యా ప్రత్యేకంగా రూపొందించిన బీఎండబ్ల్యూ 7 కారులోనే ఆయన ప్రయాణించారని.. అది భారత్‌లోకెల్లా అత్యంత భద్రమైన వాహనమని స్థానిక మీడియా పేర్కొంది.