సంపన్న భారత్ తో 'సార్క్' కు మేలు
భూటాన్ పార్లమెంటులో మోడీ ప్రసంగం
భారత్‌లో ప్రభుత్వ మార్పు భూటాన్‌తో బంధంపై ప్రభావం చూపదు
గతంలో భారత్ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామన్న ప్రధానమంత్రి
ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతానికి ఇరు దేశాల నిర్ణయం
మోడీ పర్యటన దిగ్విజయం: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్
థింపు: బలమైన, సుసంపన్నమైన భారతదేశం.. భూటాన్ సహా పొరుగు దేశాల అభివృద్ధికి సాయపడగలదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. భారత్ సుసంపన్నమైతే సార్క్ దేశాలన్నిటికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. మోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన సోమవారం ముగిసింది. పర్యటన ముగించే ముందు ఆయన భూటాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్‌లో ప్రభుత్వం మారిపోయినప్పటికీ.. భూటాన్‌తో సంబంధాలపై ఆ ప్రభావం ఉండబోదని.. తమ దేశం గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మోడీ స్పష్టంచేశారు. భూటాన్ జాతీయ శాసనసభ స్పీకర్ జిగ్మేజాంగ్పో ఆహ్వాన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. భారత్ ఎంత బలంగా ఉంటే.. భూటాన్‌కు అంత మంచిదని పేర్కొన్నారు. బలమైన, సుసంపన్నమైన భారత్ ఈ ప్రాంతంలోని చిన్న దేశాలకు సాయపడగలదని చెప్పారు. తన అంతరాత్మ ప్రబోధం మేరకే భారత ప్రధానమంత్రిగా తన తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంపిక చేసుకున్నానని మోడీ తెలిపారు. ‘‘ఇంత గొప్ప విజయం (ఎన్నికల్లో) తర్వాత.. ఏదైనా పెద్ద బలమైన దేశంలో ముందుగా పర్యటించాలని, తద్వారా చాలా కీర్తి వస్తుందనే ఆలోచన సాధారణంగా ఉంటుంది. కానీ.. నేను ముందు భూటాన్‌ను సందర్శించాలని నా అంతరాత్మ చెప్పింది. ఇందుకు ప్రణాళిక ఏదీ లేదు. అది మామూలు చర్య’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. తమ భూభాగాన్ని భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించుకునేందుకు అనుమతించబోమని భూటాన్ కూడా హామీ ఇచ్చింది. ఈశాన్య భారత్ మిలిటెంట్లు భూటాన్‌లో తలదాచుకుంటున్న నేపథ్యంలో ఆ దేశం ఈ హామీ ఇచ్చింది.
ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపు...
మోడీ పర్యటన సందర్భంగా.. రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించాయని అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. భూటాన్, భారత్ ఈశాన్య రాష్ట్రాల మధ్య క్రీడల నిర్వహణ, సంయుక్త పరిశోధన కోసం హిమాలయ విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి చర్యలతో ఈ బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. పాల పొడి, గోధుమలు, ఆహార నూనెలు, పప్పుధాన్యాలు, బాస్మతియేతర బియ్యం వంటి ఎగుమతులపై భూటాన్‌కు నిషేధం నుంచి, పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు భారత్ తెలియజేసింది. అలాగే.. భారత్‌లో చదువుకునే భూటాన్ విద్యార్థులకు ఇచ్చే నెహ్రూ - వాంగ్చుక్ స్కాలర్‌షిప్‌ను ఏడాదికి రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఖోలాంగ్చు విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన
భారత్ - భూటాన్ భాగస్వామ్యంతో భూటాన్‌లో నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యం గల ఖోలాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ సోమవారం శంకుస్థాపన చేశారు. భూటాన్ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం.. ఆయన పార్లమెంటు ఆవరణ నుంచే ఎలక్ట్రానిక్ మీట నొక్కటం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇటీవలే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ తొలి విదేశీ పర్యటనకు ఎంచుకున్న భూటాన్ పర్యటన దిగ్విజయమయిందని.. ఆయనతో పాటు పర్యటనకు వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మీడియాతో పేర్కొన్నారు. భూటాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని పొరుగు దేశం చైనా ఇటీవలి కాలంలో తీవ్ర యత్నాలు చేస్తున్న నేపథ్యంలో మోడీ తొలిసారిగా భూటాన్ పర్యటనకు వెళ్లి ఆ దేశంతో భారత్ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించటం విశేషం. ఈ పర్యటనలో మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్‌లు కూడా ఉన్నారు.
భూటాన్ - భారత్ మైత్రి సంతోషకరం: చైనా
భారత్ - భూటాన్‌ల మధ్య సంబంధాలు మోడీ పర్యటనతో బలోపేతం అవటం సంతోషకరమని చైనా స్పందించింది. భూటాన్‌తో తాము దౌత్య సంబంధాలు నెలకొల్పలేదని.. అయితే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, పర్యటనలు ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హువాచున్యింగ్ పేర్కొన్నారు. భారత్-టిబెట్‌ల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న భూటాన్ 1951 నుంచి ఒంటరిగా ఉంది. చైనాతో సరిహద్దు వివాదం నేపధ్యంలో భూటాన్ - చైనాల మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు లేవు.
మోడీ ప్రసంగానికి చప్పట్లు
ప్రధాని మోడీకి భూటాన్ పార్లమెంటులో అరుదైన గౌరవం లభించింది. మోడీ 45 నిమిషాల ప్రసంగం ముగిసిన తర్వాత.. ఆ దేశ ఎంపీలు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి చప్పట్లతో అభినందనలు తెలిపారు. భూటాన్‌లో దుష్టాత్మలను తరిమివేయటానికి (దెయ్యాలను) చప్పట్లు కొడతారు కానీ.. అభినందనలు తెలిపేందుకు కాదు. కానీ మోడీ ప్రసంగం తర్వాత ఉభయసభల ఎంపీలందరూ చప్పట్లతో అభినందించటం విశేషం. మోడీ హిందీలో ప్రసంగించగా.. స్థానిక దుబాసీ ఆయన ప్రసంగాన్ని భూటానీస్‌లోకి తర్జుమా చేసి వినిపించారు.
భారత్ నుంచి తెప్పించిన వాహనంలోనే..
భారత ప్రధాని నరేంద్రమోడీ థింపులో సైతం భారత్ నుంచి విమానంలో తెప్పించుకున్న ప్రత్యేక వాహనంలోనే ప్రయాణించారు. భద్రత రీత్యా ప్రత్యేకంగా రూపొందించిన బీఎండబ్ల్యూ 7 కారులోనే ఆయన ప్రయాణించారని.. అది భారత్‌లోకెల్లా అత్యంత భద్రమైన వాహనమని స్థానిక మీడియా పేర్కొంది.