అనుభవజ్ఞుడైన రాజకీయ నేత. మరీ ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకో గలిగిన వాడిగా గౌరవం పొందిన వ్యక్తి
కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ నిఘంటువులో స్టేట్స్‌మన్ అన్న పదానికి ఇచ్చిన విపులార్థం ఇది. భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ వర్ణన అచ్చు గుద్దినట్లు సరిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వ పక్షం తరఫున ఐక్యరాజ్య సమితిలో దేశం వాణిని వినిపించడమైనా.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్నట్లు గోధ్రా అల్లర్ల విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ‘రాజ ధర్మం’పాటించాల్సిందేనని చెప్పడమైనా. వాజ్‌పేయి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన్ను ఓ మంచి స్టేట్స్‌మన్‌గా నిలబెట్టే సంఘటనలు బోలెడు. పార్టీ సిద్ధాంతాల కంటే దేశం ముఖ్యమని
మనసా వాచా కర్మేణా నమ్మి ఆచరించిన వ్యక్తి!
అమెరికాను ధిక్కరించిన ధీరత్వం..
అణ్వాయుధాలు దాచుకున్నారన్న నెపంపై అమెరికా 2003, మార్చి 20న ఇరాక్‌పై యుద్ధం ప్రకటించింది. బ్రిటన్, పోలండ్, ఆస్ట్రేలియా తదితర 48 దేశాలు అమెరికా పక్షాన ఇరాక్‌పై కదన రంగంలోకి దిగాయి. యుద్ధం మొదలైందో లేదో.. 20 వేల మంది సైనికులను పంపాల్సిందిగా అమెరికా భారత్‌ను కోరింది. మూడేళ్ల క్రితమే భారత్ తన సహజ భాగస్వామి అని గొప్పగా ప్రకటించింది. ఇంకోవైపు రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, హోం శాఖ మంత్రి ఎల్.కె.అద్వానీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జశ్వంత్ సింగ్‌లు అమెరికాతో చేయి కలపడం మేలన్న సలహాలు ఇచ్చారు. మరోవైపు ఒక వర్గం మీడియా ఇరాక్ యుద్ధంలో భారత్ పాల్గొంటేనే మేలని కథనాలు ప్రచురించాయి. అమెరికా అధ్యక్షుడి రోజువారీ ఫోన్లు ఇంకోవైపు!! ఇంత ఒత్తిడి, గందరగోళం మధ్య కూడా స్థిర చిత్తంతో అమెరికా నిర్ణయాన్ని తోసిపుచ్చగలిగింది ఒక్క వాజ్‌పేయి మాత్రమే. యుద్ధంలో పాల్గొనేది లేదని ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారు. ప్రధానిగా తనకున్న అనుమానాలకు, ప్రజాభిప్రాయాన్ని కూడా జోడించి తీసుకున్న ఈ నిర్ణయం తరువాతి కాలంలో అంతర్జాతీయ వేదికలపై దేశం గౌరవాన్ని కాపాడిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
జెనీవా వేదికగా భారతీయ గళం..
1994లో జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు తద్వారా భారత్ పరువు తీసేందుకు పాక్ పన్నాగం పన్నింది. మానవహక్కుల ఉల్లంఘన పేరుతో ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టి కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వివాదం చేయాలన్న ఈ కుట్రను ఛేదించేందుకు ప్రధాని హోదాలో పి.వి.నరసింహారావు ఎవరిని నియమించారో తెలుసా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయిని!! ఈ కాలం రాజకీయ నేతల్లా వాజ్‌పేయి.. ‘‘ప్రభుత్వం చేయాల్సిన పని మేమెందుకు చేయాలి? మీకు చేతకాకపోతే దిగిపోండి.. మేము చేసి చూపిస్తాం’’టైపు గంభీరోపన్యాసాలు ఇవ్వలేదు. పీవీ తనకు ఇచ్చిన గౌరవాన్ని అంతే హుందాగా నిలుపుకున్నాడు. జెనీవా వేదికగా పాకిస్థాన్ కుట్రలను తన వాగ్ధాటితో ఛిన్నాభిన్నం చేశాడు. కశ్మీర్ విషయానికి వస్తే భారతీయులంతా ఒక్కటేనని.. మా భూభాగాన్ని కాపాడుకోవడం ఎలాగో మాకు బాగా తెలుసునని పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు.
నిజాయితీ రాజకీయాలు..
1976.. డిసెంబర్ 31. ఎమర్జెన్సీ కాలం. ఢిల్లీలోని వాజ్‌పేయి నివాసానికి ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి రామ్ బహదూర్ రాయ్ వచ్చాడు. కాంగ్రెస్ మంత్రి ఓమ్ మెహతా అటల్‌జీని కలిశాడన్న వార్త వినడంతో రాయ్ హడావుడిగా విచ్చేశాడు. ‘‘వాజ్‌పేయిగారు.. ఇది నిజమేనా? ఓం మెహతా మిమ్మల్ని కలిశారట’’అని రాయ్ అడిగాడు. ‘‘ఆయన చాలా పెద్దమనిషి.. నేనే ఆయన్ని కలవడానికి వెళ్లాను’’అంటూ ఠక్కున వచ్చింది సమాధానం! కొంత నిశ్శబ్దం తరువాత వాజ్‌పేయి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అల్లరిమూకలు చేస్తున్న విధ్వంసాన్ని వివరించారు. ఏబీవీపీ కూడా తన తప్పులను ఒప్పుకుని ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పడం మంచిదని, ఇలా చేస్తే ఎమర్జెన్సీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వాజ్‌పేయి రామ్ బహదూర్‌కు సూచించారు కూడా. ఆ అల్లర్లకు.. ఏబీవీపీకి సంబంధం లేదని రాయ్ అనడం.. ‘‘మీ లాంటి వాళ్లు ఇలా మాట్లాడటం సహజమే. మా లాంటి వాళ్లు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువ నమ్ముతూంటారు’’అని వాజ్‌పేయి అనడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ మీటింగ్ అక్కడితో ముగిసింది. ఏబీవీపీ క్షమాపణలు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాది తరువాతగానీ ఎమర్జెన్సీ ఎత్తివేయలేదు.
రాజధర్మం పాటించాల్సిందే..
గోధ్రా అల్లర్ల తరువాత గుజరాత్‌లో మత హింస చెలరేగడంపై వాజ్‌పేయి ఎంతో ఆవేదన చెందారు. అక్కడ అధికారంలో ఉన్నదీ బీజేపీనే కావడం వల్ల కేంద్రంలోని తమ ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని ఆయన ఆందోళన చెందారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేదని ఆయన సమక్షంలోనే ప్రకటించడం వాజ్‌పేయి నిష్పాక్షికతకు ఒక నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు చెబుతారు. గోధ్రా అల్లర్ల విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రికి మీరే సలహా ఇస్తారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మోదీ రాజ ధర్మం పాటించాల్సిందే’’అని స్పష్టం చేశారు. రాజధర్మం అంటే ఏమిటన్నది వివరిస్తూ.. అధికారంలో ఉన్నవాళ్లు ఎగువ, దిగువ కులాల మధ్య వ్యత్యాసం చూపరాదని సమాజంలోని అన్ని మతాల ప్రజలపట్ల సమాదరణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేతపై కూడా పార్టీకి భిన్నంగా వాజ్‌పేయి స్పందించారు. ‘వివాదాస్పద కట్టడానికి ఎలాంటి హాని తలపెట్టమని హామీ ఇచ్చారు. అదుపు తప్పిన కొందరు కరసేవకులు కట్టడాన్ని కూల్చేశారు. అది జరగకుండా ఉండాల్సింది. దీనికి మేము చింతిస్తున్నాము’ అని స్పష్టంగా చెప్పారు.
సిద్ధాంతాల చట్రంలో ఇమడని వ్యక్తి..
బీజేపీకి, సైద్ధాంతిక గురువుగా ఆర్‌ఎస్‌ఎస్‌ను చెప్పుకుంటారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ విధానాల రూపకల్పన మొదలుకొని, అనేక ఇతర అంశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం ఉంటుందని ప్రచారంలో ఉన్న విషయం తెలి సిందే. వాజ్‌పేయి మాత్రం ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత చట్రంలో ఇమడని వ్యక్తిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ వ్యతిరేకత... హిం దుత్వ విధానాల ప్రచారం ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యమైన విధానాలైతే.. చాలా సందర్భాల్లో వాజ్‌పేయి వీటిని తోసిరాజన్నా డు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా.. భారత్ తర ఫున జెనీవాలో కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశంలో మాట్లాడటం ఇలాంటిదే. సిద్ధాంతాలకంటే దేశం గొప్పదన్న ఆలోచన వాజ్‌పేయిది అంటారు కొందరు.
సిసలైన స్టేట్స్‌మన్
Published Fri, Aug 17 2018 5:32 AM | Last Updated on Fri, Aug 17 2018 8:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment