సంఘ్ ప్రచారకర్త కేఎన్ గోవిందాచార్య (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : భారత్‌లోని వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు ఓ సరికొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు.. పార్టీల సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి (93) కన్నుమూశారు. ‘ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ (సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి)గా ప్రజల చేత పిలువబడిన వ్యక్తి వాజ్‌పేయి. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా ఆయన అవలంభించిన ఆదర్శాలే ఇందుకు కారణం.
వాజ్‌పేయి తన జీవితంలో పాటించిన ఆదర్శాల గురించి ఆయనతో సుదీర్ఘంగా కలిసి ప్రయాణించిన సంఘ్ ప్రచారకర్త, తెలుగువారైన కేఎన్ గోవిందాచార్య ఏమన్నారంటే.. ‘రాజకీయాల్లో వాజ్‌పేయి పాటించిన కొన్ని ఆదర్శాలే నేడు ఆయనను అజాతశత్రువుగా నిలిపాయి. ఆయన ‘అధికారం కావాలి కానీ దానికోసం ఎవరి ముందు చేయి చాచను.. దేనికి తలవంచను’ అనే వారు. ‘ఉత్తమమైన రాజకీయాలంటే ప్రజలతో కూడినవే కానీ అధికారంతో కూడినవి కాదు అనే వారు. రాజకీయాలు ఎప్పుడైనా ప్రజలకు మేలు చేసేవిలానే ఉండాలి కానీ అధికారం కోసం అర్రులు చాచేవిగా ఉండకూడదు అనేవారని’ గోవిందాచార్య తెలిపారు.
వాజ్‌పేయ్ నమ్మిన అతి ముఖ్యమైన మరో విషయం ఏంటంటే వ్యక్తిగత, రాజకీయ ఆశయాలు పార్టీకి లోబడి ఉండాలి.. పార్టీ ఆశయాలు దేశ, సామాజిక ప్రయోజనాలకు లోబడి ఉండాలనేవారు. ఆయన కూడా అలానే నడుచుకునే వారన్నారు గోవిందాచార్య. వాజ్‌పేయి నమ్మిన మరో రెండు సిద్ధాంతాలు ‘ఎవరూ కూడా వివాదాస్పద రాజకీయాల్లో మునిగిపోకూడదు. మన చేతలు, మాటల ద్వారా ప్రజలకు సన్నిహితంగా ఉండాలి అనే వారు. అంతేకాక పార్టీలో ఉన్న వారు వారి వారి ఆశయాల సాధన కోసం వివాదరహితంగా ఉంటూ పనిచేయాలి’ అనే కోరుకునే వారని గోవిందాచార్య తెలిపారు.
అయితే వాజ్‌పేయి, గోవిందాచార్యలకు 1997లో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి రిపోర్టుల ప్రకారం జనరల్ సెక్రటరీగా పని చేస్తోన్న గోవిందాచార్య ‘ఎల్‌కే అడ్వాణీయే అసలైన నాయకుడు .. వాజ్‌పేయి కేవలం ముసుగు మాత్రమే’ అనే ఆరోపణలు చేశారనే వార్తలు వచ్చాయి. ఈ మాటలు తన ప్రధాని హోదాకు భంగం కల్గించేవిగా ఉన్నాయంటూ వాజ్‌పేయి అడ్వాణీకి లేఖ రాశారు.
ఈ విషయం గురించి గోవిందాచార్య ‘ఆ వివాదం 1997, అక్టోబర్ 3 న మొదలై.. అక్టోబర్ 30 1997 ముగిసింది. నేను వాజ్‌పేయిని బీజేపీ ముసుగు అన్నాను. కానీ మీడియా నా మాటలను వక్రీకరించింది. అందులో నా తప్పేం లేదు అని ఆయనకు తెలియజేయడం కోసం 17 పేజీల లేఖ రాశాను. ఆయన అప్పుడు దాని గురించి స్పందించలేదు. కానీ 1998లో నన్ను మరోసారి జనరల్ సెక్రటరీగా నియమించారు. అంటే ఆ వివాదం అప్పటికే ముగిసినట్లే కదా’ అన్నారు.
అంతే కాక కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి (బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌కి బేధాభిప్రాయాలు వచ్చేవి. ఆ సమయంలో వారు ఒకరికొకరు ఎదురు పడేవారు కాదు అని తెలిపారు. ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించడం, ప్రపంచ వాణిజ్య సంస్థ, పెటేంట్ చట్టాలు, తెహ్రీ డ్యాం, రామజన్మభూమి వంటి అంశాల్లో బీజేపీకి, సంఘ్‌కి మధ్య విబేధాలు తలెత్తాయి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment