
అద్వానీ తన జీవిత చరిత్ర ‘మై కంట్రీ మై లైఫ్’ పుస్తకంలో.. వాజ్‌పేయితో అనుబంధాన్ని పంచు కున్నారు. అప్పుడే లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన వాజ్‌పేయికి రాజకీయ సహయకుడిగా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించానని ఆయన గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ.. ‘వాజ్‌పేయి తీసుకున్న అణుపరీక్షల నిర్ణయం, పాకిస్తాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు నిజాయతీగా చేసిన ప్రయత్నాలు మన దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి’ అని కొనియాడారు. ఎలాంటి గొడవలు జరగకుండా వాజ్‌పేయి నాయకత్వంలో మూడు కొత్త రాష్ట్రాలు చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లు ఏర్పాటయ్యాయయని ప్రస్తుతించారు. ఏకాభిప్రాయాన్ని సాధించగల గొప్ప నేత వాజ్‌పేయి అని ఒక సందర్భంలో ఆయన పాలనాదక్షతను మెచ్చుకున్నారు. వాజ్‌పేయి భారతరత్నకు అన్ని విధాల అర్హుడని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అద్వానీ లేఖ కూడా రాశారు. 1998–2004 మధ్య కాలంలో వాజ్‌పేయి ప్రధానిగా పనిచేసిన సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.
పానీపూరీ తింటూ.. స్కూటర్‌పై షికారు చేస్తూ
రాజకీయాల్లో అలాంటి మిత్రుల్ని అరుదుగా చూస్తుంటాం. వారే వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీలు.. దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. వారిద్దరి అనుబంధం 1950ల నాటిది. అప్పటి నుంచి వారి మధ్య ఒక ప్రత్యేక స్నేహబంధం కొనసాగింది. దాదాపు ఐదు దశాబ్దాలు నమ్మకమైన సన్నిహితులుగా కొనసాగిన వాజ్‌పేయి, అద్వానీలు ప్రతీ సమయంలోను ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగారు. ఆ అనుబంధం దేశ రాజకీయాల్లో బీజేపీ రూపంలో పెనుమార్పులే తీసుకొచ్చింది. 1980, ఏప్రిల్‌లో వారిద్దరి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకుంది. వాజ్‌పేయితో చిన్ననాటి స్నేహాన్ని అద్వానీ గుర్తుచేసుకుంటూ.. ‘ఇద్దరం యువకులుగా ఉన్నప్పుడు వీధుల్లో పానీపూరీలు తింటూ షికార్లు చేసేవాళ్లం. నేను స్కూటర్ నడుపుతుంటే వెనుక వాజ్‌పేయి కూర్చునేవారు. నేను పెద్దగా చాట్ తినకపోయినా వాజ్‌పేయి చాలా ఇష్టంగా తినేవారు’ అని ఒక సందర్భంలో వెల్లడించారు.